కామెడీ జోనర్ సినిమాలకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే... సరైన ప్లాట్ రాసుకుంటే... ఆడియన్స్ ను రెండు గంటలపాటు ఎంటర్టైన్ మెంట్ ను అన్ స్టాపబుల్ గా ఇచ్చేయొచ్చు. తాజగా విడుదలైన ‘ఉరుకు పటేల’ కూడా అలాంటి జోనర్ లోనే తెరకెక్కింది. ‘హుషారు’ లాంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ హీరో తేజస్ కంచర్ల... ఇప్పుడు కామెడీ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు వినాయకచవితి సందర్భంగా వచ్చింది. ఈచిత్రాన్ని లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. వివేక్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కంచర్ల బాల భాను నిర్మాతగా వ్యవహరించారు. తేజస్ సరసన ఖుష్బూ చౌదరి నటించారు. ఇతర పాత్రల్లో గోపరాజు రమణ, చమ్మక్ చంద్ర, సుదర్శన్, లావణ్య రెడ్డి, మలక్ పేట శైలజ తదితరులు నటించారు. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమాత్రం ఎంటర్టైన్ చేసిందో రివ్యూలో చూద్దాం పదండి.
కథ: పటేల(తేజస్ కంచర్ల) చిన్నప్పటి నుంచే చదవులో లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్. దాంతో తోటి విద్యార్థులలో చులకన అవుతూ వుంటారు. అమ్మాయిలు అయితే... పటేల వైపే కన్నెత్తి చూడటానికి ఇష్టపడరు. అలా చదువు అబ్బక... ఇటు అమ్మాయిలూ తనకపడక... తెగ ఫీలైపోతుంటాడు. అలా పెరిగి పెద్ద వాడైన పటేల... పెళ్లి చేసుకోవాలనుకున్నా... ఎవ్వరూ పిల్లను ఇవ్వడానికి ముందుకు రారు. దాంతో తన తండ్రి అదేగ్రామానికి ప్రెసిడెంట్(గోపరాజు రమణ). తన తండ్రికి రాజకీయంగా తోడు వుంటూ... స్నేహితులతో సరదాగా గడిపేస్తుంటాడు. అలాంటి పటేల జీవితంలోకి వైద్యురాలైన అక్షర(ఖుష్బూ చౌదరి) వస్తుంది. ఆమె తల్లిదండ్రులను ఒప్పించి పటేలను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది. చదువు సంధ్యల్లేని పటేలాను అక్షర ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది? దానికి వెనుక వున్న కుట్ర ఏంటి? అసలు నిజంగానే అక్షర... పటేలను ప్రేమించిందా? పటేల ఎందుకు పరిగెత్తాల్సి వస్తుంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ... కథనం విశ్లేషణ: చాలా కాలంగా మనం మూఢ నమ్మకాలతో నరబలి ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఎక్కడో ఒక చోట ఇలాంటి వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం. అలాంటి వాటిని బేస్ చేసుకుని ఉరుకు పటేల సినిమా థ్రిల్లర్ కామెడీ జోనర్ లో తెరకెక్కింది. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా ఊళ్ళో తిరిగే పటేల, అక్షరను చూసిన తరువాత ఆమె వెంటపడటం.. ఇద్దరూ ఒకరినొకరు సరదాగా పలకరించుకోవడం.. ఆ తరువాత ప్రేమలో పడటంలాంటి సరదా సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్ తో ద్వితీయర్థంపై ఆసక్తి పెరుగుతుంది. ప్రీ ఇంటర్వెల్ లో పటేల... అక్షర బర్త్ డే అని వెళ్లడం... అక్కడ అక్షరతో సహా వాళ్ల ఫ్యామిలీ పటేలాను చంపాలనుకోవడంతో వావ్... ఏం ట్విస్ట్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అంతా పటేల అక్కడ నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు అక్షర ఫ్యామిలీ ఎందుకు పటేలని చంపాలనుకుంటుంది అని సాగుతుంది. సినిమా అయిపోతుంది అనుకున్న టైంలో రెండు ట్విస్టులు ఇచ్చి ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తారు. అసలు ఈ ట్విస్ట్ లను ప్రేక్షకుడు ఊహించలేరు.
ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా కమర్షియల్ సినిమాలాగ కంప్లీట్ చేసేసి... ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ద్వితీయర్థం మొత్తం థ్రిల్లర్ సినిమాగా ఆసక్తిగా సాగుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం నెక్స్ట్ ఏం జరుగుతుంది అని టెన్షన్ క్రియేట్ చేసి, క్లైమాక్స్ ట్విస్ట్ లతో ఆశ్చర్యపరిచి సక్సెస్ అయ్యారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఒక పల్లెటూళ్ళో ఈ కథని నడిపించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక పల్లెటూళ్ళో తీసేస్తే సెకండ్ హాఫ్ అంతా ఒక హాస్పిటల్ లో తీసేసారు. టైటిల్ కథకి సరిగ్గా సరిపోయేలా పెట్టుకున్నారు.
తేజస్ కంచర్ల కొంచెం గ్యాప్ తీసుకోని ఉరుకు పటేల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సెకండ్ హాఫ్ లో థ్రిల్లర్ జోనర్ లో తను ఇరుక్కుపోయిన ప్లేస్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని భయపడే పాత్రలో అదరగొట్టేసాడు. ఉరుకు పటేల సినిమాని తన భుజాలమీదే మొత్తం నడిపించాడు. ఓవైపు భయపడుతూనే... మరోవైపు కామెడీ పండించాడు. ముఖ్యంగా ఒక కాలి మీద నడుస్తూ... చేసిన నటన నిజంగానే ప్రేక్షకులు పటేల పాత్రలోకి వెళ్లి ఫీల్ అయ్యేలా నటించారు. పాటల్లో చాలా స్టైలిష్ గా కనిపించి... స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. మేకోవర్ కూడా యూత్ కి తగ్గట్టుగా వుంది. ఉత్తరాఖాండ్ భామ... కుష్భు చౌదరి తన అందంతో చాలా క్యూట్ గా మెప్పించింది. సెకెండాఫ్ లో వచ్చే ఆమెలోని మరోకోణం నటనతో ఆకట్టుకుంది. తెలుగమ్మాయి కాకపోయినా తెలుగమ్మాయిలా కనిపించి అలరించింది. ఇక మరో పాత్రలో హీరోయిన్ వదిన పాత్ర వేసిన లావణ్య రెడ్డి కూడా ఆకట్టుకుంటుంది. మొదటి నుంచి ఆమె పాత్రను ప్యాసివ్ గా వుంచేసి... క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ తో ఆమె పాత్ర కూడా చాలా ప్రాధాన్యతతో కూడుకున్నదే అనిపిస్తుంది. ఇక గ్రామసర్పంచుగా పటేల తండ్రి పాత్రలో గోపరాజు రమణ ఎప్పటిలాగే తనమార్క్ డైలాగులు, నటనతో మెప్పంచారు. సుదర్శన్ తో డబుల్ మీనింగ్ డైలాగులతో కాస్త శ్రుతిమించే చెప్పించారు. చమ్మక్ చంద్ర పాత్ర అక్కడక్కడా నవ్విస్తుంది.
మూఢనమ్మకాలతో జరిగిన కొన్ని సంఘటనల చుట్టూ ఈ కథను అల్లుకుని... థ్రిల్లర్, కామెడీ జానర్లో చాలా ఆసక్తికరంగా ఎంటర్టైన్మెంట్‌గా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసేలా ఈ చిత్రం ఉంటుంది. కొత్త స్క్రీన్ ప్లే జత చేసి మొదటి సినిమాని తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వివేక్. మూవీలో సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం రాత్రి పూట ఒకే హాస్పిటల్ లో కథ జరగడంతో దానికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఈ వారం వినాయకచవితి సందర్భంగా వచ్చిన హాలీడేస్ ను ఈ సినిమాతో ఎంజాయ్ చేసేయండి. హాయిగా నవ్వుకోండి.
రేటింగ్: 3.25
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.