Lineman Movie Review: A Nature Lover (Rating: 3.0)

లైన్ మ్యాన్… ప్రకృతి ప్రేమికుడు

ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో వైవిధ్యమైన కథలను ఎంచుకుని వెండితెరపై రాణిస్తున్న త్రిగుణ్... ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలోకి పరిచయం కాబోతున్నారు. కేరళలో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ గా తెరకెక్కుతున్న ‘లైన్ మ్యాన్’ చిత్రానికి వి.రఘుశాస్త్రి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: తండ్రి విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్ గా పనిచేస్తూ... అకాల మరణం చెందడంతో ఆ ఉద్యోగాన్ని తన కొడుకు అయినటువంటి నటరాజు అలియాస్ నట్టు(త్రిగుణ్)కి ఇస్తారు. ఖమ్మం జిల్లా సత్తెపల్లి గ్రామానికి కరెంటు రావాలన్నా... పోవాలన్నా... అంతా నట్టు చేతిలోనే ఉంటుంది. అలాంటి నట్టు... ఓ రోజు అదే గ్రామంలో వందేళ్ల పూర్తి చేసుకున్న దేవుడమ్మ(బి.జయశ్రీ) పుట్టినరోజును గ్రాండ్ గా చేయాలని గ్రామస్థులు భావించి... ఆమె పుట్టినరోజున రాత్రి ఘనంగా రంగు రంగుల విద్యుత్ ధ్దీపాలంకరణ మధ్య కేక్ కటింగ్ చేయాలని ఏర్పాట్లు చేస్తారు. అయితే నట్టు ఆ రాత్రే విద్యుత్ సరఫరా ఆపేస్తాడు. దేవుడమ్మ పుట్టినరోజు వేడుకలను అంత ఘనంగా చేయాలని ఐడియా ఇచ్చిన నట్టు... మరి ఎందుకు విద్యుత్తు సరఫరాను ఆపేసి గ్రామస్థులను నిరాశ పరిచాడు? ఆ సమయంలో దేవుడమ్మ రియాక్షన్ ఏమిటి? అసలు విద్యుత్తు సరఫరాను నిలిపేయడానికి కారణం ఏమిటి? చివరకు ఆ గ్రామానికి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ... కథనం విశ్లేషణ: ప్రస్తుత పరిస్థితుల్లో ఓ గంట కరెంట్ పోతేనే విలవిలలాడిపోయే పరిస్థితి మనది. అలాంటిది ఓ గ్రామంలో పది, పదిహేను రోజుల పాటు కరెంట్ లేకుండా పోతే... ఆ గ్రామస్థుల పరిస్థితి ఏంటి? అన్ని రోజులు కరెంటు లేకుండా ఎలా ఉన్నారు? ఇంతటి ఆధునిక ప్రపంచంలో అది ఎలా సాధ్యమైంది? అలా ఉండటానికి గల బలమైన కారణమేదో ఉండి తీరాలి... పది రోజుల పాటు కరెంటు లేకుండా ఉంటే ఎదురయ్యే కష్టాల కంటే కూడా ఏదో బలమైన కారణముంటేనే.. ఆ గ్రామస్థులు కూడా కరెంటు కోతను భరించారనేదానికి సిద్ధమయ్యారు అనేదాన్ని చాలా కన్వెన్సింగ్ గా చెప్పొచ్చు. దర్శకుడు కూడా అలానే ఆలోచించి... అన్నిరోజులు ఓ గ్రామ ప్రజలు కరెంటు లేకుండా జీవించారనేదానికి ఓ బలమైన హార్ట్ టచింగ్ సిచ్యుయేషన్ నే రాసుకుని తెరకెక్కించారు దర్శకుడు రఘు శాస్త్రి. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా క్లైమాక్స్ ను తీర్చిదిద్దారు. ఎక్కడో కేరళలో జరిగిన ఓ ట్రూ ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుని రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే కాస్త ల్యాగ్ ఉన్నా... గ్రామీణ వాతావరణంలో ప్రజలు ఎలా ఉంటారు? వారి జీవన విధానం, ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి? గ్రామీణ పాత్రలు ఎలా స్పందిస్తాయి? తదితర వాటిని చక్కటి డ్రామాతో తెరకెక్కించారు. ఇంతటి ఆధునిక యుగంలోనూ మారు మూల గ్రామాల్లోని ప్రజలు... మంత్రసాని రూపంలో తమకి తరతరాలుగా మేలు చేసిన దేవుడమ్మ పాత్రను తీర్చిదిద్దిన విధానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అలాగే గృహిణులు నేటికీ సీరియల్స్ కి ఎలా అడిక్ట్ అయ్యారనేది ఓ విలేజ్ గృహిణి పాత్రను చాలా ఫన్నీగా తీర్చిదిద్ది నవ్వించారు. హీరో ఎంత మేలు చేసినా... తనకూ ఓ ఆపోజిట్ బ్యాచ్ ఎలాగూ ఉంటుంది. అలాంటి యాంటీ హీరో బ్యాచ్ కూడా ఇందులో కూడా ఉంది. అయితే... ఫైట్లు చేసుకునేంత లేదు. సృష్టిలో మనిషిలాగే ప్రతి జీవి ప్రాణంతో జీవించే హక్కు కలిగివుంటుందనే దాన్ని చాలా హార్ట్ టచింగ్ గా ఓ మెసేజ్ రూపంలో ఇచ్చారు దర్శకుడు. దానికి ప్రతి ఒక్కరూ కనెక్ట్ కావాల్సిందే.

త్రిగుణ్... ఎప్పటిలాగే తన స్టైల్లో చాలా నాచురల్ గా నటించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ మారుమూల గ్రామంలో ఉండే విద్యుత్ లైన్ మ్యాన్ ఎలా మాస్ గా ఉంటారో... అలాగే ఉన్నాడు త్రిగుణ్. అతని పాత్రకు పెద్దగా ఎలివేషన్స్ ఏమీ ఇవ్వకున్నా... పక్కింటి అబ్బాయిలాగ అతని పాత్రను తీర్చిద్దారు. అందుకు తగ్గట్టుగానే పాత్రలో లీనమై నటించారు త్రిగుణ్. ఇందులో హీరోయిన్ కి పెద్దగా పాత్రయేమీ లేదు. కేవలం దేవుడమ్మ మనుమరాలిగా, గ్రామాన్ని వదిలిపోయే హైదరాబాద్ లో చదువుకునే అమ్మాయిగా కాజల్‌ కుందెర్‌ పాత్ర ఉంటుంది. 99 ఏళ్ల వృద్ధురాలిగా నటి బి.జయశ్రీ బాగా నటించారు. ఆమె చుట్టూనే అల్లుకున్న స్క్రీన్ ప్లే కావడంతో అందుకు తగ్గట్టుగానే ఆమె నటించారు. నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్‌ తదితరులు తమతమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.

ఎక్కడో కేరళలో జరిగిన ఓ ట్రూ ఇన్సిడెంట్ ను బేస్ ప్రకృతిని కాపాడాలనే ఓ హార్ట్ టచింగ్ మూమెంట్ గల ఓ మెసేజ్ ని ఇవ్వడంలో దర్శకుడు వి.రఘుశాస్త్రి సక్సెస్ అయ్యారు. అయితే విలేజ్ డ్రామా కాస్త నిడివి ఎక్కువ కావడంతో బోరింగ్ అనిపిస్తుంది. సీన్స్ వైజ్ గా తీసుకుంటే... బాగున్నాయి కానీ.. ల్యాగ్ ఎక్కువ కావడంతో ప్రేక్షకుల సహనానికి కాస్త పరీక్షలాంటిదే. ఎడిటర్ నిడివిని ఇంకాస్త తగ్గించి... కొంచెం గ్రిప్పింగ్ గా ఉండేలా ఎడిట్ చేయాల్సింది. శాంతి సాగర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విలేజ్ వాతావరణాన్ని, ప్రజల మధ్య నడిచే డ్రామాని బాగా చూపించారు. అందుకు తగ్గట్టుగానే కాద్రి మణికాంత్ సంగీతం సెట్ అయింది. పాటలు బాగున్నాయి. నిర్మాతలు ఓ మంచి సబ్జెక్టును తీసుకుని... దానిని బిగ్ స్క్రీన్ పై తీసుకురావడానికి ఖర్చుకు వెనకాడలేదు. సినిమాని చాలా ఉన్నతంగా నిర్మించారు. ప్రకృతి ప్రేమికులంతా తప్పక చూడాల్సిన చిత్రమిది. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%