Social News XYZ     

Telugu Director Hemambar Jasti Making A Name For Himself In The Tamil Industry

తమిళ పరిశ్రమలో సత్తా చాటిన తెలుగు దర్శకుడు

ఇప్పుడు యావత్ దేశం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తోంది. తెలుగులో వస్తున్న సినిమాలు ఏమిటి? తెలుగులో ప్రతిభావంతులైన దర్శకులు ఎవరు? అని ఆరా తీస్తోంది. తెలుగు కథలతో పాటు కొంత మంది తెలుగు దర్శకులను అక్కడ సినిమా ఇండస్ట్రీకి తీసుకువెళుతున్నారు. 'అర్జున్ రెడ్డి', 'జెర్సీ', 'అల... వైకుంఠపురములో' వంటి సినిమాలు హిందీలో, ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయి. అలాగే, 'కేరాఫ్ కంచరపాలెం' సినిమానూ తమిళంలో రీమేక్ చేశారు. హేమంబ‌ర్ జాస్తి దర్శకత్వం వహించారు. 'కేరాఫ్ కాదల్' పేరుతో ఆ సినిమా విడుదలైంది.

హేమంబ‌ర్ జాస్తి తెలుగువారే. 'రాజకుమారుడు', 'ఒక్కడు' సహా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన పలు చిత్రాలకు ఆయన కో - డైరెక్ట‌ర్‌గా పని చేశారు. దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు, మణిరత్నం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, గుణశేఖర్ తదితర దిగ్గజ దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారు. దర్శకుడిగా తెలుగు నుంచి ఆయనకు పలు అవకాశాలు వచ్చాయి. అయితే, మంచి కథాబలమున్న సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని వెయిట్ చేశారు. అనూహ్యంగా 'కేరాఫ్ కంచెరపాలెం'ను తమిళంలో రీమేక్ చేయమని ఆఫర్ రావడంతో ఓకే చెప్పారు.

 

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 12న తమిళనాట విడుదలైన 'కేరాఫ్ కాదల్' సినిమాపై ప్రేక్షకులు ప్రేమ వర్షం కురిపించారు. విమర్శకులు సినిమాను ప్రశంసించారు. స్టార్ యాక్టర్స్‌తో కాకుండా కొంచెం కొత్త నటీనటులతో 'కేరాఫ్ కాదల్' తెరకెక్కించారు హేమంబర్ జాస్తి. ఈ ఏడాది విడుదలైన తమిళ సినిమాల్లో టాప్ 20 లిస్టును ప్రముఖ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అందులో 'కేరాఫ్ కాదల్' చోటు దక్కించుకుంది. ఈ ఏడాది విడుదలైన టాప్ సినిమాల్లో 'కేరాఫ్ కాదల్' ఒకటి తమిళ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా హేమంబర్ జాస్తి డైరెక్షన్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. తనదైన శైలిలో సినిమా తీశారని చెబుతున్నారు. తెలుగు నిర్మాతల నుంచి తెలుగులో సినిమా తీయమని హేమంబర్ జాస్తికి అవకాశాలు వస్తున్నాయి. అన్నీ కుదిరిన తర్వాత కొత్త సినిమా వివరాలను నిర్మాణ సంస్థ వెల్లడించనుంది.

Facebook Comments