Social News XYZ     

Very Happy With The Response To Kurup: Sobhita Dhulipala

‘కురుప్’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది - హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల

కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘కురుప్‌’. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటించింది. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీ వేస్‌ కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా సినిమా రాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత రోహిత్ విడుదల చేశారు. చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...

పాత్ర నచ్చితే ఏ భాషలో అయినా చేస్తా
నేను పుట్టి పెరిగింది సంప్రాదయమైన తెలుగు కుటుంబంలో అయినా, నా సినీ ప్రస్థానం మొదలైంది మాత్రం ముంబైలోనే. కాబట్టి నా జర్నీకి స్టార్టింగ్ పాయింట్ బాలీవుడ్ అని చెప్పొచ్చు. నా మనసులో ఎలాంటి బౌండరీలు లేవు. నేను ఏ భాషలో సినిమా చేయాలన్నా కథ బాగా నచ్చాలి. అంతేకానీ ఇది మన భాష కాదనే విషయాన్ని నేను పట్టించుకోను. సినిమాలో నా పాత్ర నన్ను ఇంప్రెస్ చేస్తే ఏ భాషలో అయినా చేసేందుకు నేను రెడీ. ‘కురుప్’లో నా పాత్ర నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది.

 

నేను అలా చెప్పను
తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని, బయటి నుంచి వచ్చేవాళ్లకే ఛాన్సులు ఇస్తారనే మాటను నేను నమ్మను. తెలుగులో ఇతర భాషల హీరోయిన్లు వస్తున్న మాట నిజమే. కానీ తెలుగువాళ్లకు అవకాశాలు లేవని నేను చెప్పను. నాకు బయటకంటే ఇక్కడే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. నేను ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నప్పుడు అక్కడి అమ్మాయిలు కూడా మనలాగే అనుకుంటారేమో.

దుల్కర్ నిర్మిస్తున్నారని తెలుసు కానీ..
డైరెక్టర్ శ్రీనాథ్ ముంబైకి వచ్చి కురుప్ మూవీ స్క్రిప్ట్‌ను నాకు వినిపించారు. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారని నాకు అప్పటికే తెలుసు. కానీ ఆయన ఇందులో యాక్ట్ చేస్తున్నారనే విషయం తెలియదు. కథ నచ్చి ఓకే చెప్పాను. షూటింగ్ స్టార్ట్ అయ్యాక సెట్‌కు వెళితే దుల్కర్ ఇందులో నటిస్తున్నారనే విషయం నాకు అప్పుడు తెలిసింది.

కరివేపాకులా కాదు.. ఉప్పులా..
నేను ఏ సినిమా సెలెక్ట్ చేసుకున్నా.. అందులో నా పాత్ర నిడివి గురించి పట్టించుకోను. నా పాత్రకు తగిన ప్రాధాన్యం ఉందా లేదా అనేదే చూస్తాను. అంటే కూరలో కరివేపాకుల కాకుండా ఉప్పులా ఉండాలి. కూర ఎంత చేసినా ఉప్పులేకపోతే టేస్ట్ ఉండదు కదా. అలా నా పాత్ర ప్రాముఖ్యతను బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను.

ఒకప్పుడు పర్టికులర్‌గా ఉండేదాన్ని
నేను నా సినీ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఇలాంటి సినిమాలే చేయాలి, అలాంటి పాత్రలు చేయకూడదని చాలా పర్టికులర్‌గా ఉండేదాన్ని. అయితే నేను సినిమా చేస్తున్న క్రమంలో చాలా విషయాలు తెలుసుకున్నా. ఏ జోనర్ సినిమా అయినా ప్రేక్షకులకు నచ్చేలా కథ ఉంటే అందులో నటించాలని అనుకున్నా. ఇప్పుడు అలాంటి సినిమాలనే ఎంచుకుంటున్నా. ఇక నేను ఏ పాత్ర ఎంచుకున్నా స్క్రిప్ట్‌ను చాలా సార్లు చదువుతా. నా పాత్ర గురించి పూర్తిగా అర్థం చేసుకుని అందులో లీనమయ్యేలా హోం వర్క్ చేస్తా. ఈ సినిమాకు కూడా చాలా హోంవర్క్ చేశా. సినిమాలో నా పాత్ర చూస్తే నా హార్డ్ వర్క్ మీకు అర్థమై ఉంటుంది.

స్క్రిప్ట్‌లో దమ్ముంటే పక్కా హిట్
‘కురుప్’ డైరెక్టర్ శ్రీనాథ్ ఫ్లాపుల్లో ఉన్నా ఆయన చెప్పిన స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. స్క్రిప్ట్‌లో దమ్ముంటే అదే సినిమాను లాక్కెళ్లిపోతోందని నమ్ముతా. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నా. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు నన్ను మరింతగా ఆదరిస్తానే నమ్మకం ఉంది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందితే అదే గొప్ప అదృష్టం.

ఓటీటీలో రిలీజ్ చేస్తారేమోనని భయపడ్డా
సినిమా రెండేళ్ల క్రితం పూర్తయింది. ఓటీటీలో రిలీజ్ చేస్తారేమో అని భయపడ్డాం. కానీ ఇప్పుడు ఇలా ఇన్ని భాషల్లో ఇంత పెద్ద ఎత్తున విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. .

మణిరత్నం గారితో చేస్తున్నా
‘కురుప్’, ‘మేజర్’ సినిమాల తర్వాత మణితర్నం గారితో ‘పొన్నియన్ సెల్వణ్’ మూవీ చేస్తున్నా. ఇది తెలుగులో కూడా విడుదల కానుంది. ‘సితార’ అనే హిందీ సినిమాతో పాటు ‘మేడిన్ హెవన్’ సీజన్2లో కూడా చేస్తున్నా. ఇక నా తొలి హాలీవుడ్ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాను. నేను నటించిన పలు సినిమాలు ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్నాయి. వాటి కోసం ఎదురు చూస్తున్నా.

Facebook Comments
Very Happy With The Response To Kurup: Sobhita Dhulipala

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.