భారతదేశం గర్వించదగ్గ సినిమాలు చేయాలన్నదే నా లక్ష్యం!
-ఛాలెంజింగ్ రైటర్ టర్నడ్ డైరెక్టర్
డైమండ్ రత్నబాబు
సెవెంత్ క్లాస్ లో డిస్టింక్షన్ తెచ్చుకున్న ఓ 'చిచ్చర పిడుగు'... టెన్త్ లో మొక్కుబడిగా చదివినా ఫస్ట్ ర్యాంక్ సాధించి... ఇంటర్మీడియట్ 'జస్ట్ ఫస్ట్ క్లాస్' తో సరిపెట్టుకుని.. ఇక ఇక్కడ చదివింది చాలనుకుని... 'డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు.. పి.హెచ్.డి' ఫిల్మ్ ఇండస్ట్రీలో చేరాలని ఫిక్సయిపోయాడు.
చిన్నప్పటినుంచి సినిమా పిచ్చిని నరనరాన జీర్ణించుకున్న ఈ 'బందరు బుల్లోడు'..ఇండస్ట్రీకి రావడానికి ముందు.. పెట్రోలు బంకులు మొదలుకుని ట్రాన్స్ పోర్ట్ కంపెనీ వరకు పలు చోట్ల పని చేసి, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆకళింపు చేసుకోవడం నేర్చుకుని, తనను తాను సాన బెట్టుకుంటూ వచ్చాడు. కవితలు రాయడం, జోక్స్ క్రియేట్ చేయడం 'బందరు లడ్డూతో పెట్టిన విద్య'గా చేసుకున్న ఈ కుర్రాడు... చిన్నప్పుడే తన కలానికి 'డైమండ్' అనే పేరు పెట్టుకుని... భవిష్యత్ లో రైటర్ గా అద్భుతాలు సృష్టించాలనే తన 'వజ్ర సంకల్పాన్ని' అప్పుడే చెప్పకనే చెప్పుకున్నాడు. రాయి లాంటి తనను.. 'రత్నం'గా మార్చుకుని, 'డైమండ్' అనే తన కలం పేరును 'ఇంటి పేరు'గా మార్చుకున్న ఆ అసాధారణ ప్రతిభాశాలే రైటర్ టర్నడ్ డైరెక్టర్ 'డైమండ్ రత్నబాబు' !!
250 రూపాయల చెక్కు తీసుకోవడం కోసం భాగ్యనగరం చేరుకొని.. పదుల సంఖ్యలో లక్షలాది రూపాయల చెక్కులు తీసుకునేలా తనను తాను 'చెక్కు'కున్న 'డైమండ్ రత్నబాబు' సక్సెస్ స్టోరీ వెనుక.. గుళ్ళల్లో పెట్టే అన్నప్రసాదాలతో ఆకలి తీర్చుకున్న రోజులున్నాయి. అవకాశాల కోసం రెండేళ్లపాటు రేయింబవళ్లు ఇష్టంగా పడిన కష్టముంది.
రామ్ పోతినేని పరిచయ చిత్రం వై.వి.ఎస్ 'దేవదాస్' చిత్రానికి మాటలు అందించిన ప్రముఖ రచయిత చింతపల్లి రమణ వద్ద 'అజ్ఞాత శిష్యరికం' చేసి.. 'సీమశాస్త్రి'తో అధికారకంగా వెలుగులోకి వచ్చిన 'డైమండ్ రత్నబాబు' ఇక ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు.
'ఈడో రకం.. ఆడో రకం, పిల్లా నువ్వు లేని జీవితం, పాడవులు పాండవులు తుమ్మెద' చిత్రాలతో రైటర్ గా హ్యాట్రిక్ కొట్టిన రత్నబాబు.. ఎస్.వి.కృషారెడ్డి, రాఘవ లారెన్స్ ల వద్ద దర్శకత్వ శాఖలో మెళకువలు నేర్చుకుని 'బుర్రకథ' చిత్రంతో దర్శకుడిగా మారారు. అనుకున్న రోజుల్లో, అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలో 'బుర్రకథ'ను పూర్తి చేసి.. ఎవరూ అనుకోని రీతిలో.. ఆ చిత్రానికి 'కోటి రూపాయల లాభం' తెచ్చి పెట్టి.. పరిశ్రమ వర్గాల్లోని ప్రతి ఒక్కరూ విస్తు పోయేలా చేశారు.
శివ నిర్వాణ, శ్రీమణి వంటి మిత్రుల సాంగత్యంలో ఎంతో నేర్చుకున్నానని చెప్పే డైమండ్ రత్నబాబు.. మోహన్ బాబు నటించిన 'గాయత్రి' చిత్రానికి రచయితగా పని చేయడం తన జీవితాన్ని మలుపు తిప్పిందని అంటారు. 'అత్యంత శక్తివంతమైన గాయత్రీ మాత ఆశీస్సుల వల్ల' మోహన్ బాబు గారు తనకు 'గాడ్ ఫాదర్'గా లభించారని చెబుతూ ఒకింత భావోద్వేగానికి లోనవుతారు డైమండ్ రత్నబాబు.
'సత్యానంద్, పరుచూరి బ్రదర్స్ తర్వాత నేను ఇష్టపడే రచయితవి నువ్వేనయ్యా' అని మోహన్ బాబుగారు కితాబివ్వడం తన పూర్వ జన్మ సుకృతంగా ప్రకటించుకునే ఈ డైమండ్ రైటర్.. సదరు కితాబు' తనకు ఆస్కార్ అవార్డు కంటే ఎక్కువని అంటారు.
'గాయత్రి' చిత్రం షూటింగ్ టైమ్ లోనే తన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని వరమిచ్చిన మోహన్ బాబుగారు.. ఇప్పుడు తన దర్శకత్వంలో 'సన్నాఫ్ ఇండియా' చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్నారని.. ఇందుకుగాను ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని వినయంగా చెబుతారు. 'సన్నాఫ్ ఇండియా' యావద్భారత దేశం గర్వపడే గొప్ప సినిమా అవుతుందని, ఈ చిత్రానికి మోహన్ బాబుగారు స్వయంగా స్క్రీన్ ప్లే సమకూర్చుతున్నారని, విష్ణుబాబు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారని రత్నబాబు తెలిపారు. ఆగస్టు 15న లాంఛనంగా ప్రకటితమైన ఈ చిత్రానికి ఇండియాలోని టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారని, ఆ వివరాలు అధికారికంగా అక్టోబర్ 2, గాంధీ జయంతి నాడు ప్రకటిస్తారని రత్నబాబు వివరించారు.
రొటీన్ సినిమాలు చేయడానికి తాను పూర్తిగా విరుద్ధమని, తాను తెరకెక్కించే ప్రతి చిత్రం అత్యంత వైవిధ్యంగా ఉంటుందని... 'చాలెంజింగ్ డైరెక్టర్' అనిపించుకోవాలన్నదే తన లక్ష్యమని సగర్వంగా ప్రకటించుచుకుంటున్న 'డైమండ్ రత్నబాబు' పుట్టిన రోజు నేడు. 'సన్నాఫ్ ఇండియా' చిత్రంతో రత్నబాబు పేరు దేశమంతా మారుమ్రోగలని మనసారా కోరుకుంటూ..."హ్యాపీ బర్త్ డే రత్నబాబు"!!
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.