Social News XYZ     

As Long As Telugu Cinema Exists, Kodi Ramakrishna Will Remembered As The Director Who Gave The Blockbuster In Any Genre

తెలుగు సినిమా ఉన్నంత కాలం – ఏ జోనర్‌లో అయినా బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ అంటే కోడి రామకృష్ణే ముందు గుర్తొస్తారు (రేపు కోడి రామకృష్ణ జయంతి సందర్భంగా...)

ఒకో దర్శకుడికి ఒకో స్టైల్ ఉంటుంది. ఆ స్టయిల్ కథ చెప్పడంలో, సినిమా తీయడంలోనే కాదు, ఒక జోనర్‌కే పరిమితం అవుతారు. వెర్సటైల్ డైరెక్టర్లు అని అందర్నీ అనలేరు.

ఫ్యామిలీ డ్రామా తీసే దర్శకుడు ఫాంటసీ సినిమా తీయలేకపోవచ్చు. పొలిటికల్ సైటైరికల్ సినిమాలు తీసే దర్శకుడు విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చేయలేకపోవచ్చు. హారర్ సినిమా తీయగలిగిన వారు ఎంటర్‌టైన్‌మెంట్ జోలికి వెళ్ళకపోవచ్చు.

 

ఏ జోనర్‌లో అయినా అద్భుతంగా కథ చెప్పి, ప్రేక్షకులను ఆకట్టుకుని, బాక్సాఫీస్ భేరి మోగించగల అరుదైన అతి కొద్దిమంది దర్శకుల్లో స్వర్గీయ కోడిరామకృష్ణ ఉండేవారు.

కోడి రామకృష్ణ జయంతి జులై 23. 1949లో పాలకొల్లులో జన్మించారు. నాటకాలాడుతూ సినిమా రంగం మీద ప్రేమ పెంచుకున్నారు. తన గురువు దాసరి గారి పిలుపుతో మద్రాసు సినీ రంగానికి వచ్చారు. దాసరి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు.

ప్రతాప్ ఆర్ట్స్ బేనర్‌లో తొలిసారి దర్శకుడయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో ‘ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య’ సినిమా తీసి, సూపర్ హిట్ సాధించారు. ఆ సినిమా ఏడాది పైన ఆడింది. ఆ సినిమాతోనే రచయిత గొల్లపూడిని నటుడిగా మార్చారు. ఆ తర్వాత అదే బేనర్‌లో ‘తరంగిణి’ సినిమా డైరెక్ట్ చేశారు. ఆ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ఇక అక్కడి నుంచి కోడి రామకృష్ణ వెనుకడుగు వేయలేదు.

‘ఆలయ శిఖరం’, ‘రంగుల పులి’, ‘ముక్కుపుడక’ తదితర చిత్రాలతో వరుస విజయాలు సాధించారు.

నేటి సూపర్‌స్టార్ మహేష్ బాబుని బాల నటుడిగా ‘పోరాటం’ చిత్రంలో పరిచయం చేశారు కోడి రామకృష్ణ. ఆ తర్వాత ఆ తండ్రీ కొడుకుల కాంబినేషన్లో ‘గూఢచారి 117’ అనే సినిమా తీశారు. కృష్ణ గారితో ‘దొంగోడొచ్చాడు’, ‘చుట్టాలబ్బాయి’, ‘గూండా రాజ్యం’ సినిమాలు తీశారు.

నట సామ్రాట్ డాక్టర్ అక్కినేనితో ‘రావు గారింట్లో రౌడీ’, ‘డాడీ డాడీ’, ‘గాడ్ ఫాదర్’ మొదలైన సినిమాలు తీశారు.

మెగాస్టార్ చిరంజీవిని తొలిసారి గూఢచారిగా చూపిస్తూ ‘గూఢచారి నెంబర్1’ సినిమా తీశారు. చిరంజీవితో ‘ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య’, ‘ఆలయ శిఖరం’ కాకుండా ‘సింహపురి సింహం’, ‘రాక్షావోడు’ చిత్రాలు డైరెక్ట్ చేశారు. అంతేకాదు మెగాస్టార్‌తో భారీ బడ్జెట్‌లో ‘అంజి’ అనే సినిమా తీశారు.

యువరత్న బాలకృష్ణతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తీశారు కోడి రామకృష్ణ. ‘మంగమ్మ గారి మనవడు’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘ముద్దుల మావయ్య’, ‘మువ్వ గోపాలుడు’, ‘ముద్దుల మేనల్లుడు’, ‘బాల గోపాలుడు’, ‘భారతంలో చంద్రుడు’ మొదలైన సినిమాలు తీశారు.

యువ సామ్రాట్ నాగార్జునతో ‘మురళీ కృష్ణుడు’ సినిమా తీశారు. విక్టరీ వెంకటేష్‌కి ‘శత్రువు’ లాంటి మరిచిపోలేని బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ‘శ్రీనివాస కళ్యాణం’, ‘దేవీ పుత్రుడు’ మొదలైన సినిమాలు చేశారు.

నట భూషణ శోభన్ బాబుతో ‘దొరగారింట్లో దొంగోడు’, ‘సోగ్గాడి కాపురం’, ‘ఆస్తి మూరెడు – ఆశ బారెడు’, ‘జైలు పక్షి’ లాంటి సినిమాలు తీశారు. అవి కాకుండా ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’ లాంటి వైవిధ్యమైన చిత్రాలు చేశారు.

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు ‘పోలీస్ లాకప్’, ‘అమోరు’, ‘లాఠీ ఛార్జి’, ‘అరుంధతి’, ‘దేవి’ లాంటి సినిమాలు తీశారు.  ‘అమ్మోరు’ సినిమాలోని గ్రాఫిక్స్ – మూఢ నమ్మకాల నేపథ్యంలో సాగిన కథాంశం ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇక ‘అరుంధతి’ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సంచలన విజయం సాధించిన ఆ సినిమా కథనం, పాత్రలు – ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.

అలాగే భక్తి నేపథ్యంలో ‘త్రినేత్రం’, ‘దేవుళ్ళు’ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు.

తన కెరీర్ చివరి దశలో కన్నడ సూపర్ స్టార్ స్వర్గీయ విష్ణువర్ధన్ యానిమేషన్ క్యారెక్టరైజేషన్‌తో ‘నాగర హవు’ సినిమా తీశారు. యాక్షన్ కింగ్ అర్జున్‌తో ‘మా పల్లెలో గోపాలుడు’, ‘మావూరి మారాజు’, ‘పుట్టింటికి రావే చెల్లీ’ లాంటి సూపర్ హిట్స్ తీశారు. ‘అంకుశం’, ‘భారత్ బంద్’, ‘రాజధాని’ లాంటి ఇంటెన్సిటీ ఉన్న పొలిటికల్ యాక్షన్ చిత్రాలు ఒకవైపు చేస్తూనే, మరో వైపు ‘పెళ్ళాం చెబితే వినాలి’, ‘అల్లరి పిల్ల’ లాంటి

సరదా సరదా కుటుంబ కథా చిత్రాలు చేశారు.
ఆయనకి అంటూ పర్మినెంట్ ప్రొడ్యూసర్స్ ఉండేవారు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టిని తొలిసారి తెలుగులోకి ‘రైల్వే కూలీ’ సినిమాతో పరిచయం చేశారు.
జగపతి బాబుతో ‘చిలక పచ్చని కాపురం’, ‘దొంగాట’, ‘మా ఆవిడ కలెక్టర్’, ‘పెళ్ళి పందిరి’, ‘పెళ్ళి కానుక’, వడ్డే నీవన్‌తో ‘పెళ్ళి’, ‘మా బాలాజీ’ లాంటి విజయవంతమైన సినిమాలు తీశారు.

చివరి నిమిషం వరకూ సినిమాయే లోకంగా, షూటింగే శ్వాసగా జీవించిన గొప్ప దర్శకులు కోడి రామకృష్ణ. ఆయన 2019 ఫిబ్రవరి 22న కన్ను మూశారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం – ఏ జోనర్‌లో అయినా బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ అంటే కోడి రామకృష్ణే ముందు గుర్తొస్తారు.

Facebook Comments
As Long As Telugu Cinema Exists, Kodi Ramakrishna Will Remembered As The Director Who Gave The Blockbuster In Any Genre

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.