A Special Homage To NTR On His 98th Birth Anniversary From YVS Chowdary

28,మే 2020, 'ఎన్‌. టి. ఆర్‌.' గారి 98వ జయంతి:

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్‌, స్వర్గీయ 'నందమూరి తారక రామారావు (ఎన్‌. టి. ఆర్‌.)' గారు ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘీక చిత్రాలలో నటించటమే కాక, ఆయా పాత్రలలో జీవించి, తన దివ్య మోహన రూపంతో ఎందరికో స్పూర్తి నిచ్చారు. 1983 వరకూ CM, PM, MLA, MP, గవర్నర్‌ మరియూ రాష్ట్రపతి లాంటి రాజకీయ పదవుల్లోని తేడాపై ధ్యాసే పెట్టని 'తెలుగు' ప్రజానీకానికి, తనకున్న తిరుగులేని జనాకర్షణ శక్తితో ఆత్మీయ 'అన్న'గా దగ్గరై, వాళ్ళల్లో 'రాజకీయ చైతన్యం' తీసుకురావటమే కాక, 'ఆత్మగౌరవం' నినాదంతో, అప్పటివరకూ 'మదరాసీ'లుగా పిలువబడుతున్న 'తెలుగు జాతి'కీ, 'తెలుగు భాష'కీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపునీ తెచ్చారు. ఆయన తన పరిపాలనలో తీసుకున్న సంచలనాత్మక, విప్లవాత్మక నిర్ణయాలు మరియూ సంక్షేమ పధకాలు ఇప్పటికీ ఎందరో రాజకీయవేత్తలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

అంతే కాకుండా హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలచిన 'మహాభారతం', 'భాగవతం', 'రామాయణం'లోని పాత్రలకు తన సినిమాల ద్వారా సజీవ రూపకల్పన చేసి, మన కళ్ళముందు కదలాడారు. తన 60 ఏళ్ళ వయస్సులో, ఆ రోజుల్లో మన 'తెలుగు'నాట ఉన్న గతుకుల రోడ్లల్లో, 'చైతన్యరధం' పైభాగాన కూర్చొని తిరుగుతూ, ప్రతీ కిలోమీటరుకూ వేలాదిగా, లక్షలాదిగా ప్రజల్ని ఆకర్షిస్తూ, 'చైతన్యరధం' పైనే నిలబడి తన ప్రసంగాల ద్వారా వాళ్ళల్లో ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నింపారు. భావితరాల వాళ్ళు 'మానవమాత్రులకు ఇంతటి జనాకర్షణశక్తి సాధ్యమా' అని కలలో కూడా ఊహించుకోలేనటువంటి అసాధ్యాలను సుసాధ్యాలుగా మలుస్తూ ఒక 'కా'రణ'జన్ముడి'లా, 'యుగపురుషుడి'లా, ఓ 'దైవం'లా అవతరించారు.

‘తెలుగు జాతి’కి గర్వకారణం మరియూ ‘తెలుగు పలుకు’లను తన కంఠంతో కొత్తపుంతలు తొక్కించిన ఆ 'మహాపురుషుని’ జ్ఞాపకార్ధం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏవైనా రెండు జిల్లాలకి ‘ఎన్‌. టి. ఆర్‌. జిల్లా’ పేరుతో నామకరణం జరపాలనీ.. ఆయన్ని ‘భారతరత్న’ బిరుదాంకితుడిగా చూడాలన్న తెలుగువాళ్ళ చిరకాల స్వప్నం సాకారం చేయాలనీ.. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న అసంఖ్యాక తెలుగు వారందరి తరపున.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, భారతదేశ ప్రభుత్వాలను వినమ్రంగా కోరుతున్నాను.

'కా'రణ'జన్ములు', 'యుగపురుషులు' ఎప్పుడూ సందేశాలు ఇవ్వరు. కానీ, తమ తమ జీవనవిధానాల ద్వారా మనకి స్పూర్తినిచ్చే ఆశయాలని, మన మధ్య వదిలి 'భువి' నుండీ 'దివి'కి పయనమవుతారు. అలా ఆయన వదిలిన వెళ్ళిన ఎన్నో ఆశయాలలో ముచ్చటకి మూడు..

  1. ఏ పనినైనా 'అంకితభావం'తో చేయడం..
  2. ఆ పని ఎంత 'కష్టమైనా ఇష్టపడి' చేయటం..
  3. ఆ పనిని సాధించటంలో 'మడమ తిప్పకుండా పోరాటం' చెయ్యటం..

‘ఆయన’ నాకు ‘దేవుడు’. నాలాగా ఎంతోమందికి ‘దైవసమానం’. ‘ఆయన’ దివ్యమోహనరూపమే నన్ను సినిమాలవైపు తద్వారా సినీపరిశ్రమకు తీసుకువచ్చింది. ఆయన ఆశయాల స్పూర్తితోనే నేను ఇక్కడ నిలబడ్డాను. అంతేకాదు, నేనిక్కడ పొందిన కీర్తీ, సంపాదిస్తున్న ప్రతీ పైసా ఆయన Account లో నుండీ Draw చేసుకుంటున్నట్లే Feel అవుతాను. అందుకే నా సొంత చలనచిత్ర నిర్మాణ సంస్థ అయిన ‘బొమ్మరిల్లు వారి’ బేనర్‌పై నేను నిర్మించే ప్రతీ సినిమా ప్రారంభం ‘ఆయన’ ఫొటోపై.. “నా పరిపూర్ణ, పరిశుద్ధ హృదయంతో, నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడూ, ప్రభూ.. ఈ జన్మకూ..” అంటూ సంగీత సవ్యసాచి ‘యం యం కీరవాణి’గారు స్వయంగా రచించి, స్వరపరచి, ఆలపించిన ‘ప్రార్ధనాగీతం’తో మొదలై, మళ్ళీ సినిమా చివరిలో ‘ఆయన’ అదే ఫొటోపై ‘కృతజ్ఞతాభావం’తో పూర్తి అవుతుంది.

అలా నాకే కాదు, ఇక్కడ 'అమలాపురం'లోని 'రిక్షాపుల్లర్' నుండి, ఎక్కడో 'అమెరికా'లో ఉంటున్న 'సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్' వరకూ, ప్రపంచవ్యాప్తంగా.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, వివిధ రంగాలలో ఉన్న, నాలా ఎంతో మంది 'తెలుగు' వాళ్ళకు, ఆయన తన ఆశయాల ద్వారా స్పూర్తినిచ్చారు.
‘మరణంలేని జననం ఆయనిది,
అలుపెరగని గమనం ఆయనిది,
అంతేలేని పయనం ఆయనిది..’

‘ఆయన’ ఎక్కడున్నా నన్నూ, నాలాంటి అభిమానుల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటారనే నా నమ్మకం. అటువంటి ‘అవిశ్రాంత యోధుని’ 98వ 'జయంతి' సందర్భంగా..
జై ‘నటరత్నం’..
జై జై ‘తెలుగుతేజం’..
జై జై జై ‘విశ్వవిఖ్యాతం’..
జోహార్ 'ఎన్. టి. ఆర్‌.’..
అంటూ ఆ ‘మహనీయుని’ తలచుకుని, స్మరించుకోవటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ 'తెలుగు'వాడు తనని తాను గౌరవించుకోవటంతో సమానంగా భావిస్తూ..

‘ఆయన’ వీరాభిమాని,
‘బొమ్మరిల్లు వారి’ సంస్థ అధినేత,
వై వి ఎస్ చౌదరి.
28, మే 2020

A Special Homage To NTR On His 98th Birth Anniversary From YVS Chowdary (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%