వెండితెరపై ప్రేమ కథలు వచ్చాయి.. వస్తూనే ఉంటాయి. ఎన్ని ప్రేమ కథలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ప్రతీ సినిమాలోనూ అంతర్లీనంగా ప్రేమ కథ ఉంటూనే వస్తుంది. అయితే అలాంటి ప్రేమకథ చుట్టూనే తిరిగే సినిమాలంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఓ అంచనాలు ఉంటాయి. మరో కొత్త ప్రేమకథతో ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చింది ప్రేమ పిపాసి. మరి ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.
కథ
బావ (కపిలాక్షి మల్హోత్ర) కనిపించిన ప్రతీ అమ్మాయిని ట్రాప్‌లో పడేస్తాడు. ప్రేమ అంటూ అసలు పని కానిచ్చేస్తాడు. అవతల ఉన్న అమ్మాయిలు కూడా బావను తెగ వాడేస్తూ ఉంటారు. అయితే ఇలా జరుగుతూ ఉండగా.. బాలా (సోనాక్షి)ను చూసి ప్రేమించడం మొదలు పెడతాడు.
అప్పటి వరకు కనిపించిన అమ్మాయిను ప్రేమ అంటూ ట్రాప్ చేసి అసలు విషయం జరిగాక వదిలేసే బావ.. బాలాను ఎందుకు ప్రేమిస్తాడు? బాలా ఎంతగా చీ కొట్టినా తన వెంటే ఎందుకు పడతాడు? బావ-బాలాకు ఉన్న గతం ఏంటి? అమ్మాయిలను బావ ఎందుకు ట్రాప్ చేస్తుంటాడు? ఈ కథలో సుమన్ పాత్ర ఏంటి? చివరకు ఏమైంది? లాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ప్రేమ పిపాసి.
విశ్లేషణ:
ప్రేమలో ఓడిపోయిన బావ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమయ్యే సీన్స్‌తో ఫస్ట్ హాఫ్‌ను ఓపెన్ చేయడంతో అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తించాడు. ఇక మెల్లిగా గతంలోకి తీసుకెళ్లడంతో ప్రథమార్థంలో ఊపు పెరిగినట్టుగా అనిపిస్తుంది. బావ రాసలీలలు, అమ్మాయిలను ట్రాప్ చేసే ట్రిక్స్, ఈ కాలంలో అమ్మాయిలు ఎలా ఉన్నారో కళ్లకు కట్టినట్టు చూపించిన ఫీలింగ్ కలుగుతుంది. శ్రుతీ, కోమలి, కీర్తి అంటూ ఒకరి తరువాత ఒకర్ని ట్రాప్ చేసే సీన్స్‌తోనే ప్రథమార్థం మొత్తం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సుమన్, బాలా (సోనాక్షి) ఎంట్రీతో ఫస్టాఫ్ ముగుస్తుంది. అయితే యూత్‌ను ఆకట్టుకునే సీన్స్‌తో ప్రథమార్థం సూపర్ గా ఉంది.
తన కూతురుని ట్రాప్ చేస్తున్నాడని తెలిసిన సుమన్.. బావను చితక్కొట్టించడం, ఆ సమయంలో బాలాను కనబడటంతో కథలో మలుపు తిరిగిన ఫీలింగ్ వస్తుంది. బాలా ఇంటి ముందే ధర్నాకు దిగడం, అక్కడే కథంతా రసవత్తరంగా ఉంది.అయితే ఈ సమయంలో వచ్చే జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు చేసే కామెడీ ఆకట్టుకుంది. ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా చూసుకోవడంతో ఆ సీన్స్ అన్నీ చకచకా వెళ్లిపోతాయి. బాలా-బావకు ఉన్న గతం, ఫ్లాష్ బ్యాక్‌లో బావ స్నేహితుడు కార్తీక్‌ను ప్రీతి మోసం చేస్తుంది. దీంతో అతను ఆత్మహత్య చేసుకోవడంతో అమ్మాయిలను ట్రాప్ చేసే వాడిగా బావ మారిపోతాడు. ప్రీ క్లైమాక్స్ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తోంది. టోటల్‌గా ద్వితీయార్థం ప్రేక్షకులను మెప్పించిందని చెప్పవచ్చు.
ప్రేమ పిపాసిలో కపిలాక్షి మల్హోత్రనే హైలెట్ అయ్యే అవకాశం ఉంది. మొదటి చిత్రమే అయినా డ్యాన్సుల్లో, ఫైట్స్ అదరగొట్టాడు. ఎమోషన్స్ సీన్స్‌లో బాగా చేశాడు. ఇక ఈ చిత్రంలో తరువాత చెప్పుకోవాల్సింది సోనాక్షి గురించే. ద్వితీయార్థం మొత్తం ఈమె చుట్టే తిరగడంతో నటనకు, స్క్రీన్ ప్రజెన్స్‌కు అవకాశం దొరికింది. సీనియర్ నటుడైన సుమన్ ఆయన చేసిన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఆయన గెటప్ కానీ, ఆయన క్యారెక్టర్ కానీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక సినిమా మొత్తం హీరో పక్కనే ఉండే స్నేహితుడు రవి (ఫన్ బకెట్ భార్గవ్) కామెడీతో మెప్పించాడు. ఫ్లాష్ బ్యాక్‌లో కనిపించే హీరో స్నేహితుడు కార్తీక్, అలాగే మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు.
ప్రేమ పిపాసి సినిమాకు తీసుకున్న లైన్ యూత్‌ను ఆకట్టుకునేది కావడం ప్లస్ పాయింట్. ఈ కాలంలో ప్రేమ ఎలా ఉంది? అమ్మాయిలు-అబ్బాయిలు ఎందుకు ప్రేమించుకుంటున్నారు? దేని కోసం ప్రేమించుకుంటున్నారు? అనే అంశాలతో అల్లుకున్న కథ కావడంతో బాగానే అనిపిస్తుంది, దాన్ని తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడా డైలాగ్స్ బాగానే పేలాయి. మొత్తంగా యూత్‌ను టార్గెట్ చేసిన దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.
ప్రేమ పిపాసిలో అన్నింటికంటే ముందుగా చెప్పుకోవాల్సింది సంగీతం గురించే. మంచి మాస్ బీట్స్‌తో అందర్నీ మెప్పించినట్టు అనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ విషయంలో మరికొంత శ్రద్ద తీసుకుంటే బాగుండేదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమాటోగ్రఫర్ తన కెమెరాతో హీరో, హీరోయిన్లను అందంగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్రేమ పిపాసి అనే సినిమా చూస్తున్నంత సేపు.. ఈ సినిమాకు ఈ టైటిల్ కరెక్ట్ అనే భావన కలుగుతుంది.
రేటింగ్: 3.5/5