రామారావు నా ఆత్మబంధువు... ఆ కుటుంబానికి అండగా ఉంటా - మెగాస్టార్ చిరంజీవి సంతాపం
సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు మృతిచెందిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి తీవ్రదిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. రామారావు తనకు ఆత్మబంధువని, సినియర్ జర్నలిస్టు అనే కాకుండా ఆయన వ్యక్తిత్వం తనకెంతో ఇష్టమని చిరంజీవి అన్నారు.
రామారావు గురించి ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే ‘‘ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, నడవలేకపోతున్నారని తెలిసి సన్ షైన్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గురవారెడ్డి దగ్గరికి పంపించాను. మోకాళ్ల ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. తన అక్కయ్యగారికి బాగోలేదని, ఆమె కోలుకున్నాక ఆపరేషన్ చేయించుకుంటానని రామారావు అన్నారు. నేనంటే అతనికి ఎంతో అభిమానం, అతనన్నా నాకంతే అభిమానం. లేకలేక పుట్టిన అతని కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా పేరు పెట్టాడు. ఆ కుర్రాడి పేరు చిరంజీవి నాగ పవన్ అనుకుంటాను.
నేనతన్ని కేవలం ఒక జర్నలిస్టుగానే చూడను. నీతికీ నిజాయితీకీ నిబద్దతకూ మరోరూపంలా చూస్తుంటాను. అతని కుటుంబానికి నేను అన్నిరకాలుగా అండగా ఉంటాను, వాళ్ల కుటుంబం బాగోగులను చూసుకుంటాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ చిరంజీవి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
This website uses cookies.