ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు డిగ్రీ కాలేజ్
1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం వంటి పలు అవార్డు చిత్రాల దర్శకుడిగా నరసింహ నందికి ఓ ప్రత్యేక పేరుంది. కాగా శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై ఆయన స్వీయ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం డిగ్రీ కాలేజ్, వరుణ్, దివ్యారావు హీరోహీరోయిన్లు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నామని దర్శకుడు నరసింహ నంది తెలిపారు. ఇంతవరకు నేను తీసిన చిత్రాలకు భిన్నంగా ఆర్ట్ జోనర్లో కాకుండా కమర్షియల్ అంశాలను మేళవించి దీనిని తీసాను. ఇద్దరు డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ మధ్య క్లాసురూమ్ లోను, అలాగే బయట అంకురించిన యదార్ధ ప్రేమ సంఘటనల ఆధారంగా సహజత్వానికి దగ్గరగా ఈ చిత్రాన్ని రూపొందించాం. రొమాన్స్ అంశాలు కధకు అనుగుణంగా జోడించాం. ఆ మధ్య విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్స్ కు విశేషమైన స్పందన లభించడమే కాకుండా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. తప్పకుండా మా అంచనాలను చిత్రం నిలబెడుతుంది అని అన్నారు.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ, ప్రేమ, రొమాన్స్ మాత్రమే కాదు భావోద్వేగ భరితమైన అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. అవి నన్నెంతో ఆకట్టుకున్నాయి. అందుకే ఈ చిత్రాన్ని నా ఆధ్వర్యంలో విడుదల చేయదలచుకున్నాను అని అన్నారు. .
వరుణ్, దివ్యారావు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో దువ్వాసి మోహన్, ఆర్.కె., రవిరెడ్డి, మల్లేష్, బద్దల హరిబాబు, జయవాణి. మై విలేజ్ షో అనిల్, శ్రీనివాస్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మురళీమోహన్ రెడ్డి, సంగీతం: సునీల్ కశ్యప్, ఆర్ట్: బాబ్జి, ఎడిటింగ్: నాగిరెడ్డి, నిర్మాణం: శ్రీ లక్ష్మి నరసింహ సినిమా పతాకం. రచన, దర్శకత్వం: నరసింహ నంది.