Everyone will come out of Ala Vaikunthapurramuloo movie with a joy: Director Trivikram

'అల వైకుంఠపురములో' థియేటర్స్ నుంచి జనం ఒక పరిపూర్ణమైన అనుభూతితో,ఆనందంతో బయటకు వస్తారు!
- మాటల మాయాంత్రికుడు, దర్శకుడు 'త్రివిక్రమ్'

Everyone will come out of Ala Vaikunthapurramuloo movie with a joy: Director Trivikram (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

'అల వైకుంఠపురములో' థియేటర్స్ నుంచి జనం ఒక కంప్లీట్ ఫీలింగ్తో, ఆనందంతో బయటకు వస్తా రని చెప్పారు త్రివిక్రమ్. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రానికి ఆయన దర్శకుడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్,,పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించిన ఆ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఆ సినిమా గురించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు...

ఎవరికైనా కెరీర్ స్టార్ట్ అయ్యేటప్పుడు తనలో ఉన్న ఆలోచనలన్నీ అందరికీ చెప్పెయ్యాలనీ, వాళ్లందరి ప్రశంసలూ పొందాలనీ, తన ఆలోచనలతో వాళ్లందరూ ఏకీభవించాలని ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచాక.. ప్రశంస తగ్గిపోతుంది, అంచనాలు పెరిగిపోతాయి. ఎప్రిసియేషన్ తగ్గిపోవడం మూలంగా, క్రియేట్ చేసేవాళ్లకు మన పనిలో ఏమైనా లోపముందా అనిపించే ఛాన్స్ ఉంది. దాంతో దారి మార్చుకొని ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదమూ ఉంది. లేదంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం మూలంగా ఆ బరువుకు కుంగిపోయి, చెప్పాలనుకున్నది చెప్పలేక కుంగిపోయి, ఒక నార్మల్ లేదా సేఫ్ రూట్లోకి ఎస్కేప్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. ప్రతిసారీ ఈ రెంటినీ గెలవడానికి ఎవరైనా ప్రయత్నించాల్సిందే. 'అరవింద సమేత' నుంచి నా భయాలతో ఫైట్ చేస్తూ వస్తున్నా. 'అజ్ఞాతవాసి' ఫ్లాపైన తర్వాత అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే.. ఆయనకు అలవాటైన హ్యూమర్లోకి, ఎంటర్టైన్మెంట్లోకి వెళ్లిపోతే బాగుంటుంది కదా.. అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా ముందు దానివైపే తోస్తారు. నేనది చెయ్యలేదు. అది కావాలని తీసుకున్న డెసిషన్. ఎంత పరాజయం చూసినా కానీ కొత్తగా భయపెట్టేది ఏముంటుంది! ఈ భయాన్ని గెలవాలంటే ఇదే సమయం, ఇదే స్టెప్. అందుకని సీరియస్ గా ఉండే సబ్జెక్ట్ ట్రై చేశా. అందులో కమర్షియల్ గా ఉండే సాగ్స్ కానీ, హ్యూమర్ కానీ, ట్రాక్ కానీ.. అలాంటివేవీ మైండ్లోకి కూడా రానివ్వలేదు. దాన్ని నేను బిగ్గెస్ట్ టేకెవేగా ఫీలవుతా. 'అరవింద తర్వాత' మళ్లీ అలాంటి కథే చెప్పకూడదు కదా.. దాన్నుంచి బ్రేక్ కావాలి కదా.. ప్రతిసారీ మనం మారడానికి ప్రయత్నించడమే. అందుకే 'అల వైకుంఠపురములో' సినిమా తీశా.

సినిమాలు చూశాక 'సరిలేరు నీకెవ్వరు' జానర్, 'అల వైకుంఠపురములో' జానర్ వేర్వేరుగా ఉన్నాయని ప్రేక్షకులు ఫీలవుతారని నేననుకుంటున్నా. ట్రైలర్ లను బట్టే అవి భిన్న తరహా కథలని తెలిసిపోతుంది.

ఈ సినిమా ప్రధానంగా ఏ పాయింట్ మీద నడుస్తుంది? కొత్తగా ఏం చెప్పారు?
మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ, స్థాయి ఇవ్వలేం. స్థాయి అనేది ఎవరికి వాళ్లు తెచ్చుకోవాల్సింది. ఇదే థాట్ ఆఫ్ ద ఫిల్మ్. దానికి ఇల్లు ఆధారం. మనం ఏ కథ చెప్పినా రామాయణ భారతాలు దాటి చెప్పలేమనేది ఈ ప్రపంచంలో అందరూ ఒప్పుకొనే మాట. వాటిని దాటైతే మనం కొత్త కథ చెప్పలేం. అందువల్ల వాటికి సంబంధించిన ఏదో ఒక ఛాయ కథలో కనిపిస్తూ ఉండవచ్చు.

మీ బలం హ్యూమర్. 'అరవింద సమేత'ను అందుకు భిన్నంగా తీశారేం?
కొత్త కథ ఎత్తుకోవడంలో తప్పు లేదు. అర్జునుడు బాణాలు బాగా వేస్తాడు. అవసరమనుకున్నప్పుడు, అప్పుడప్పుడు కత్తి తీయడంలో తప్పులేదు. శత్రువు మనకు బాగా సమీపానికి వచ్చినప్పుడు బాణం తీసి, ఎక్కుపెట్టి వేసే సమయం ఉండదు. అప్పుడు కత్తితీసి నెగ్గితే తప్పేమీ లేదు కదా. ఒక్కోసారి మన బలాలు లేకుండా కూడా ఫైట్ చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల కొత్త కథలు సమకూర్చుకోవడంలో తప్పులేదనుకుంటాను. జనంలోని ఇష్టం, అభిమానం కూడా మనల్ని బందీని చేస్తుంది. భయాన్ని గెలవడమనేది గేం ఆఫ్ లైఫ్ అంటాను.

'అల వైకుంఠపురములో' పేరు పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఏమిటి?
పోతన గారి పద్యమే స్ఫూర్తి.

మిమ్మల్ని ప్రేక్షకులు ఇంతగా అభిమానించడం చూస్తుంటే మీకేమనిపిస్తుంది?

ప్రేక్షకులు అభిమానించేది మనం ఇచ్చే వర్కుని, మనల్ని కాదు. దాన్ని డిటాచ్డ్ గా చూస్తేనే, వాటినుంచి మనం విడిపోయి మనకు నచ్చిన పని చేసుకోగలం, లేకపోతే మరీ సీరియస్ అయిపోయి, స్తబ్దతకు గురవుతాం. కాబట్టి ఆ సినిమావరకు మనం ప్రజల ఇష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలి. చేసిన ఏ సినిమా కూడా నచ్చలేదని చెప్పారంటే, అప్పటిదాకా నేను చేసిన పని నేను చేసినట్లు కాదు, తర్వాత చేసేపని కూడా నేను చేసేది కాదు. ఆ క్షణానికి వాళ్లకు నచ్చదు. ప్రేక్షకులనేవాళ్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. అందుకే వాళ్లను ప్రేక్షక దేవుళ్లు అంటుంటాం. థియేటర్లో లైట్లు ఆర్పిన తర్వాత కులం, మతం, జాతి.. వీటన్నిటికీ అతీతంగా తమ ముందున్న సినిమాని చూస్తారు. వాళ్లను ఏదీ ఆ టైంలో ఎఫెక్ట్ చెయ్యదు. నవ్వొస్తే నవ్వుతారు, ఆనందం వస్తే ఆనందిస్తారు. కళ్లల్లో నీళ్లొస్తే ఏడుస్తారు. ప్రేక్షక దేవుడంటే మనం తెలుసుకోవాల్సింది.. పొజిషన్ కాదు, కండిషన్. అదొక స్థితి. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక అమ్మాయిమీద యాసిడ్ పోస్తే వాడు దేవుడెలా అవుతాడు!

పాటల వెనుక మీ మ్యూజిక్ టేస్ట్ ఉందా? ముఖ్యంగా 'సామజవరగమన' పాటలో మీ ఇన్పుట్స్ ఉన్నాయంటారు?
నాకు సంగీతం చెయ్యడం రాదు, పాడ్డం రాదు. నాలో ఎన్నో కోరికలు.. గిటారు వాయించాలని, అమ్మాయిలు నావైపు ఆరాధనగా చూడాలని.. ఉండేవి. కానీ నాకు ఏవీ రావు. నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు. ఒక్క సిద్ శ్రీరాం వాయిస్ తప్ప, లైవ్ గా ఎగ్జాక్టుగా మీరు ఏ పాటైతే ఇప్పుడు వింటున్నారో దాన్ని తమన్ నాకు వినిపించేశాడు. అప్పుడు 'సామజవరగమన' అనేది పెడితే బాగుంటుందని నేను సజెస్ట్ చేశానంతే. శాస్త్రి గారికి చెబితే, 45 నిమిషాల్లో పాట రాసేశారు. ఈ పాటను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని చెప్పింది బన్నీ. అప్పుడు ఆలోచించి, తమన్, సిద్ శ్రీరాం లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు షూట్ చేసి రిలీజ్ చేశాం. కాకినాడలో షూటింగ్ జరిగేటప్పుడు బన్నీ, నేను, తమన్.. ముగ్గురం కూర్చొని.. 'సామజవరగమన', 'రాములో రాములా', 'ఓమైగాడ్ డాడీ' పాటల్ని ఎలా జనంలోకి తీసుకెళ్లాలని మూడు పేజీలు రాసుకున్నాం. అప్పటికి ఆ మూడు పాటలూ ట్యూన్స్ పూర్తయి ఉన్నాయి.

'అల వైకుంఠపురములో' సినిమా ఎలా ఉంటుందనుకోవచ్చు?
జనం థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక కంప్లీట్ ఫీలింగ్తో, ఆనందంతో బయటకు వస్తారు. చీర నేసినవాడికి దాని అందం తెలీదు. ఒక అనుభూతితో నేసుకుంటూ వెళ్లిపోతాడు. నేనూ అంతే. నా సినిమా ఎలా ఉందో ప్రేక్షకులే చెప్పాలి. ఒక సినిమాతో నేనింత ఎత్తుకు ఎదగాలని ఏ దర్శకుడూ అనుకొని చెయ్యడు. కథ రాసేంతవరకే రచయిత దానికి రాజు. తర్వాత ఆ కథకు అతను బానిస.

డైలాగ్స్ అలా రాయాలని ఆలోచించి రాస్తారా? ఎక్కడ కూర్చొని రాస్తుంటారు?
డైలాగ్స్ గురించి నిజంగా నేను ఆలోచించను. స్పాంటేనియస్ రచయితగా నన్ను నేను చూసుకుంటా. నేనెక్కడికో వెళ్లి రాస్తుంటానని అనుకుంటారు. నేను మా ఇంట్లోనే రాసేసుకుంటూ ఉంటాను. నేను చాలా తేలిగ్గా, ప్రశాంతంగా పనిచేయడానికి ఇష్టపడతా.

ఈ మధ్య మీ సినిమాల్లో స్త్రీలపై గౌరవాన్ని పెంచే పాత్రలు కనిపిస్తున్నాయి. కాన్షియస్ గానే వాటికి ప్రాముఖ్యం కల్పిస్తున్నారా?
1950ల నుంచి 1970 దాకా కూడా ఇంట్లో స్త్రీలే ఇంటి బాధ్యతలు చూసుకునేవాళ్లు. అంటే పైకి చెప్పని ఒక మాతృస్వామ్య విధానం ఉండేది. ఇంటికి సంబంధించిన అన్ని పనులూ వాళ్ల ద్వారానే నడిచేవి. '70ల తర్వాత ప్రయాణాలు పెరిగి, ఉన్న చోటు నుంచి వేరే చోట్లకు వెళ్లి ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాల్సి రావడం వల్ల ఇళ్లల్లో వాళ్ల భాగస్వామ్యం తగ్గింది. తెలీకుండా మనం కూడా వేరే సంస్కృతికి ప్రభావితమవడం, మన మూలాల్ని మనం వదిలేయడం, దాంతో వాళ్లను అగౌరవపరిచేవిధంగా చూడటం, అలా మనం మగవాళ్లమే చూడ్డం వల్ల, లేని ఒక యాక్సెప్టెన్స్ రావడం, వాళ్లు మౌనంగా ఉండటాన్ని కూడా మనం యాక్సెప్టెన్స్ కింద చూడ్డం వంటివి 35 ఏళ్లు నడిచాయి. నాకు తెలిసి ఇప్పుడవి మారిపోయాయి. 'అత్తారింటికి దారేది' అలా రాయడానికి కారణం.. నాకు మా అత్తంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పట్నుంచీ విన్న నానుడి.. తల్లి తర్వాత పిన్ని, తండ్రి తర్వాత మేనత్త అని. అలాంటి అత్తని మనం ఎందుకు తక్కువచేసి చూపిస్తాం? అత్తతో అల్లుడు వేళాకోళమాడ్డం బేసిగ్గా మన సంస్కృతిలో లేదు. దాన్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టారు. పెళ్లిలో అల్లుడ్ని విష్ణువుగా చూస్తాం. అందుకే కాళ్లు కడుగుతాం. అంటే అల్లుడి బాధ్యతను పెంచడం కోసం అతని కాళ్లు కడుగుతాం. అలాంటివాడు అత్తతోటి ఎలా వేళాకోళమాడతాడు? అతను దేవుడిలాగే బిహేవ్ చెయ్యాలి. అందర్నీ బాగా చూసుకోవాలి, మంచి సమాజాన్ని నిర్మించాలి. ఇవన్నీ తెలీకుండానే నా సినిమాలో ప్రతిఫలించి ఉండొచ్చు. కాన్షియస్గా నేను వాటిని చెప్పాననట్లేదు.

ఇటీవల మీ సినిమాల్లో కథ ఒక ఇంటిచుట్టూ నడవడం కనిపిస్తుంది. ఎందుకలా?
మనం ప్రపంచం అంతా తిరగొచ్చు. కానీ ఇంటికొచ్చాక ఒక సుఖం వస్తుంది. ఆ ఇంటికొచ్చిన ఫీలింగే వేరు. అందుకే 'హోం కమింగ్' అంటాం. మనకు తెలీకుండానే ఇల్లు మన సంస్కృతిలో ఒక భాగం. అది చిన్నదే కావచ్చు. ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు. బహుశా నేను ఆ ఇంట్లో ఆనందాన్ని వెతుక్కొనే ప్రయత్నం చేస్తానేమో. అందుకే నా సినిమాల్లో కథకి ఇల్లు కేంద్రంగా ఉంటూ ఉండొచ్చు. 'అల.. వైకుంఠపురములో' మూవీలో 'వైకుంఠపురం' అనే ఇంటికి ఉన్న విలువను అలా సింబలైజ్ చేశాను. ఆ ఇంటికి హీరో వెళ్లడం ఎందుకు ముఖ్యమైన విషయమయ్యింది? అందుకే ఆ ఇంటికి ఆ పేరుపెట్టి, అదే సినిమాకి టైటిల్ గా పెట్టా.

మీ డైలాగ్స్ వల్లే సినిమాలు హిట్టయ్యాయనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వస్తున్న రైటర్స్ కొంతమంది మిమ్మల్ని అనుకరిస్తున్నారు కూడా. వాళ్ల సినిమాలు చూసినప్పుడు మీరెలా ఫీలవుతారు?
నేను ఏ సినిమానైనా ఏ నెగటివ్ లేకుండా చూస్తా. చాలా సార్లు ఆశ్చర్యానికి గురవుతా. ఆడియెన్స్ ఎలా ఫీలవుతారో నేనూ అలాగే 'అరె.. భలే రాశాడే' అని ఫీలవుతా. తక్కువ బడ్జెట్తోటే వీళ్లు ఈ సినిమా భలే చేశారే, మనం చెయ్యలేకపోయామే అని కచ్చితంగా అనిపిస్తుంది. కొన్ని సినిమాలు చూస్తే, ఈ ఐడియా మనకెందుకు రాలేదననే జెలసీ కూడా వస్తుంది. వీడు నాలా రాస్తున్నాడే అని ఎప్పుడూ నాకనిపించలేదు. నిజాయితీగా చెప్తున్నా. ఇందులో హ్యూమిలిటీ ఏమీ లేదు. డైలాగ్స్ వల్ల సినిమా ఆడుతుందనే దాన్ని నేను ఏకీభవించను. ఎందుకంటే.. కథ, పాత్రలు, సన్నివేశాలు.. తర్వాతే మాటలు. మాట అనేది వాటికి బలమవ్వాలే తప్ప, మాట వల్ల ఇవన్నీ రావు. నా డైలాగ్స్ కి పేరు రావడానికి కారణం నేననుకొనేదేమంటే.. ఆ సన్నివేశాన్ని మరింత సూటిగా, బలంగా చెప్పడానికి నేను మాటల్ని వాడానని..

'జులాయి' నాటికీ, ఇప్పటికీ అల్లు అర్జున్లో మీకు కనిపించిన మార్పు ఏమిటిది?
'జులాయి' నాటికీ, ఇప్పటికీ పోల్చుకుంటే అల్లు అర్జున్ పని మీద మరింత ఫోకస్డ్ గా ఉన్నాడనే విషయం తెలిసింది. వేరే ధోరణే తనకు లేదు. ఎంతసేపూ సినిమాపైనే అతని దృష్టి.

మీరు పాన్-ఇండియా సినిమాలు ఎందుకు తియ్యట్లేదు?
నేను పాన్-ఇండియాకు వెళ్లకపోవడానికి నాకు కరెక్ట్ కథ తగలకపోవడం, నేనింకా అలాంటి కథ రాయలేకపోవడం.

ఈమధ్య ఎక్కువగా మీ సినిమాలకు 'ఆతో మొదలయ్యే టైటిల్స్ పెడుతున్నారు. అది సెంటిమెంటా?
నాకు సెంటిమెంట్లున్నాయి కానీ, 'ఆ అక్షరంతో టైటిల్ మొదలుపెట్టాలనే సెంటిమెంటైతే లేదు.

తర్వాత ఎవరితో సినిమా చెయ్యబోతున్నారు?
తర్వాతి సినిమా ఏమిటనేది ఇంకా డిసైడ్ అవలేదు. కథ అల్లుకొని, దానికి ఎవరు సరిపోతారనుకుంటే వాళ్లతో చేస్తా.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%