నటీనుటులు: రాజ్ తరుణ్ - షాలిని పాండే - నాజర్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
మాటలు: అబ్బూరి రవి
నిర్మాత: శిరీష్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జీఆర్ కృష్ణ
రేటింగ్: 3.25/5
కెరీర్ ఆరంభంలో వరుస హిట్లతో మంచి ఊపు మీద కనిపించి.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ట్రాక్ తప్పిన యువ కథానాయకుడు రాజ్ తరుణ్. కొంచెం గ్యాప్ తర్వాత అతను ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకుముందు రాజ్ తో ‘లవర్’ నిర్మించిన దిల్ రాజే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. జీఆర్ కృష్ణ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
వర్ష (షాలిని పాండే) చిన్నప్పట్నుంచి నటన మీద ఎంతో ఆసక్తి ఉన్న అమ్మాయి. హీరోయిన్ కావాలన్నది ఆమె జీవితాశయం. అందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఏదీ ఫలించదు. ఆమె బాయ్ ఫ్రెండ్ సహా ఎవరికీ తనపై నమ్మకం ఉండదు. అలాంటి సమయంలో వర్షకు మహి (రాజ్ తరుణ్) పరిచయం అవుతాడు. అతను ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. మహి చేసిన ఒక ఫొటో షూట్ వల్ల వర్షకు కథానాయికగా అవకాశం వస్తుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. మహి.. వర్షను ప్రేమిస్తాడు. మరి ఆమె అతణ్ని ప్రేమించిందా.. వీళ్లిద్దరి ప్రయాణం చివరికి ఏ మజిలీకి చేరింది అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
ప్రమాదం కొన్నిసార్లు ప్రాణాలు తీసేస్తుంది. కానీ ఈ సినిమాలో ఓ ప్రమాదం అమ్మ కడుపు లో ప్రమాదంలో ఉన్న అమ్మాయిని కాపాడుతుంది. ప్రాణంతో బయటకు తీసుకొస్తుంది. అక్కడ నుంచి మొదలయ్యే సినిమా ఎన్నో మలుపులు తీసుకుంటుంది. అయితే ఈ సినిమాకు బలం మాత్రం హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ షాలిని పాండేనే, దర్శకత్వం అలాగే దిల్ రాజు నిర్మాణ విలువలు. ఎలాగైనా హీరోయిన్ కావాలనే తన కోరిక నెరవేర్చుకునేందుకు అందరి చుట్టూ తిరుగుతూ..ఆడిషన్స్ సమయంలో చేసే నటనతో ఆకట్టుకుంటుంది షాలినీ. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. రాజ్ తరుణ్ నటనను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. తన పాత్రలో ఒదిగిపోయాడు. చిన్నప్పుడే అమ్మాయి..అమ్మాయి ప్రేమలో పడటం…ఆ తర్వాత తల్లిదండ్రులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లటం కారణంతో వాళ్లిద్దరూ విడిపోవటం..మళ్లీ టీనేజ్ లో కలుసుకోవటం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ప్రేమకథ ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో హీరో తండ్రి ఫోటోగ్రాఫర్ కావటం..జీవితంలో ప్రతి మూమెంట్ ను తన ఫోటోల్లో బంధించటం అనే ఓ పాయింట్ ను తీసుకుని..హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ కు బాగా కనెక్ట్ చేశారు.
సినిమా అంతటా..లవ్ ట్రాక్ లో ‘ఫీల్’ కనిపిస్తోంది. ప్రతి ప్రేమ సన్నివేశం ఫ్రెష్ గా ఉంటుంది. ఈ సినిమాలో హీరో కు చిన్నప్పటి నుంచే గుండె సమస్య ఉంటుంది. చిన్నప్పటి స్నేహితురాలు కలిశాక..ప్రేమ విషయం చెప్పేందుకు ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా తిరుగుతాడు. కానీ తన ప్రియురాలి తొలి సినిమా ప్రివ్యూ చూడటానికి వెళ్లి పడిపోతాడు. విషయం తెలుసుకున్న హీరోయిన్ హాస్పిటల్ కు వెళుతూ ఘోర ప్రమాదానికి గురవుతుంది. ఇటువంటి సన్నివేశాలు గుండెకు హత్తుకునే విధంగా తెరకెక్కించాడు దర్శకుడు జి.ఆర్.కృష్ణ. ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే పాయింట్ ను యూత్ కు ముఖ్యంగా ప్రేమికులకు కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు జీ ఆర్ కృష్ణ తెరకెక్కించాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే రొమాన్స్ యువతను అలరిస్తోంది.
కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. కోలేజీ స్టూడెంట్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. మికి సంగీతం సినిమాకు మరో ఆకర్షణ. దర్శకుడు జి.ఆర్.కృష్ణ తాను అనుకున్న పాయింట్ ను చక్కగా ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు.