నా సినిమా నచ్చకపోతే తిట్టండి: దర్శకుడు దిలీప్ రాజా
‘‘ప్రేక్షకులకు నా సినిమా నచ్చితే తెలియజేయండి.. నచ్చకపోతే తిట్టండి. ఎక్కడైనా తప్పు ఉంటే ఎత్తిచూపండి.. సరిదిద్దుకుంటాను’’ అన్నారు దర్శకుడు దిలీప్ రాజా. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘పండుగాడి ఫొటో స్టూడియో’. పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ పతాకంపై ఆలీ, రిషిత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించారు. సెప్టెంబర్ 21న భారీగా విడుదల కాబోతోన్న ఈ చిత్రం గురించి దర్శకుడు దిలీప్ రాజా మీడియాతో ముచ్చటించారు.
ఆయన మాట్లాడుతూ..‘‘ఎవరి సినిమా వారికి నచ్చుతుంది. కానీ నచ్చాల్సింది ప్రేక్షకులకు. వారికి నచ్చితేనే అది గొప్ప చిత్రం అవుతుంది. ఆలీ హీరోగా నేను తెరకెక్కించిన పండుగాడి ఫొటో స్టూడియో సినిమా మంచి కంటెంట్‌తో మీ ముందుకు రాబోతోంది. ఇందులో ఆలీ ఎవరికి ఫొటో తీస్తే వారికి పెళ్లయిపోతుంది. ఎందుకని పెళ్లిళ్లు జరుగుతున్నాయో, దానికి సంబంధించిన కారణాలు సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయి. పూర్తి గ్రామీణ నేపథ్యంలో కొనసాగిన ఈ చిత్రంలో గొడుగు గోవిందం, చెంబు లింగం, బేడర్థణాగాడు, మెంటల్ మాలచ్చిమి, మిలట్రీమామ వంటి పాత్రలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతాయి. ఈ సినిమా కథనాన్ని దర్శకుడు సుకుమార్‌గారు ఓకే చేసిన తర్వాత చిత్రీకరణ మొదలుపెట్టాం. మంచి సజెషన్స్ ఇచ్చిన ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ సినిమా ప్రారంభం రోజు నేను ఏ దేవుడికీ కొబ్బరికాయ కొట్టలేదు. ప్రముఖ దర్శకులు జంధ్యాల, కె. బాలచందర్ గార్ల చిత్రాపటాలకు చేతులు జోడించి, కొబ్బరికాయ కొట్టాకే తొలి షాట్‌ను ప్రారంభించాము. వారి ఆశీర్వాదం ఈ చిత్రానికి ఉంటుందని భావిస్తున్నాను. ఈ చిత్రంలోని 5 పాటలకు సంగీత దర్శకుడు యాజమాన్య చక్కని సంగీతం అందించారు. శ్రేయాఘోషల్, మనీషా ఎర్రాబత్తిన పాడిన పాటలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఆలీగారు 100శాతం ఈ సినిమాకు న్యాయం చేశారు. ఆయనని కమర్షియల్ హీరోగా ఇందులో చూపించాను. నేను బ్లాక్‌బస్టర్ తీశానా? సక్సెస్ తీశానా? ఫెయిల్యూర్ తీశానో? నిర్ణయించేది ప్రేక్షకులే. వారి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాను. ప్రేక్షకులకు నా సినిమా నచ్చితే తెలియజేయండి.. నచ్చకపోతే తిట్టండి. ఎక్కడైనా తప్పు ఉంటే ఎత్తిచూపండి.. సరిదిద్దుకుంటాను. సెప్టెంబర్ 21న మా పండుగాడు మీ ముందుకు వస్తున్నాడు. ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే నా ఈ జర్నీలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..’’ అని అన్నారు.