Samudrala Senior Annual Writers Award Announced At his 117th Jayanthi Celebrations

ఇది సముద్రాల వారి భిక్ష! ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్

Samudrala Senior Annual Writers Award Announced At his 117th Jayanthi Celebrations (Photo:SocialNews.XYZ)

తెలుగు సినిమా తొలి దశాబ్దమైన 1930లలోని మొదటి 'మాయాబజార్' (1936), 'ద్రౌపదీ వస్త్రాపహరణం' (1936) నాటి నుంచి సినీ రచనలో ఉంటూ, ఆ పై జీవించిన మూడు దశాబ్దాల కాలంలో 'యోగి వేమన', 'దేవదాసు', 'విప్రనారాయణ', 'భూకైలాస్', 'శ్రీసీతారామ కల్యాణం', 'నర్తనశాల' లాంటి ఎన్నో చారిత్రక, సాంఘిక, జానపద, పౌరాణిక సినీ ఆణిముత్యాలకు రచన చేసిన మహోన్నతులు సముద్రాల సీనియర్. "తెలుగు సినిమా రచనలో తొలి తరానికి చెందిన సముద్రాల సీనియర్ (రాఘవాచార్య) ప్రాతఃస్మరణీయులు. ఆయన పాటలు, మాటలు ఇవాళ్టికీ జనంలో నిలిచిపోయాయి. సముద్రాల వారు, పింగళి వారు లాంటి పెద్దలు వేసిన బాటలోనే తరువాతి తరాలకు చెందిన మేమూ నడుస్తున్నాం. నేటి సినీ రచయితల ఈ వైభవమంతా అప్పుడు వారు పెట్టిన భిక్ష" అని ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ అన్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన సముద్రాల సీనియర్ 117వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఫిల్మ్ నగర్‌ కూడలిలో సరిగ్గా పదేళ్ళ క్రితం నెలకొల్పిన సముద్రాల వారి విగ్రహం చెంత జరిగిన ఈ జయంతి వేడుకలకు ఎన్టీఆర్ కుమారుడు, ప్రముఖ నిర్మాత, సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎన్టీఆర్ గారు 'మాస్టారూ' అని పిలిచేవారు: నందమూరి మోహనకృష్ణ

ఈ సందర్భంగా సాయిమాధవ్ మాట్లాడుతూ, "కె.వి. రెడ్డి గారి దర్శకత్వంలో సముద్రాల వారు రచన చేసిన నాగయ్య గారి 'యోగి వేమన' చిత్రం, అక్షరాలను సైతం తూకం వేసినట్లుగా అందులో సాగిన ఆయన రచన ఇవాళ్టికీ సినీ రచయితలకు ఓ పెద్ద బాలశిక్ష. కొన్ని సందర్భాల్లో కలం ముందుకు సాగనప్పుడు ఇవాళ్టికీ నేను మళ్ళీ ఆ సినిమా చూస్తూ, ఆ రచన ద్వారా ప్రేరణ పొందుతుంటా" అని చెప్పారు.

'మాస్టారూ' అంటూ తమ తండ్రి ఎన్టీఆర్ గౌరవంగా పిలుచుకొనే సముద్రాల వారు తమ సొంత సంస్థకు 'శ్రీసీతారామ కల్యాణం' లాంటి అనేక ఆణిముత్యాలు అందించారనీ, స్వీయ దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో 'వినాయక చవితి', 'బభ్రువాహన' చిత్రాలను రూపొందించారనీ మోహనకృష్ణ గుర్తు చేసుకున్నారు. సముద్రాల సీనియర్ మనుమడు విజయ రాఘవాచారిని శాలువా, జ్ఞాపికతో ఆత్మీయంగా సత్కరించారు.

ఈ జయంతి వేడుకలను నిర్వహించిన రైల్వే ఉన్నతాధికారి, సినీ - సాంస్కృతిక ప్రియులు రవి పాడి మాట్లాడుతూ, సముద్రాల వారు రాసిన 'దేవదేవ ధవళాచల మందిర...' (చిత్రం - భూకైలాస్), 'సీతారాముల కల్యాణము చూతము రారండి...' (శ్రీసీతారామ కల్యాణం), 'జననీ శివకామినీ...' (నర్తనశాల) లాంటి సినీ గీతాలు తెలుగువారి సాంస్కృతిక జీవితంలో విడదీయరాని భాగమైన సంగతిని గుర్తు చేశారు. ఇక నుంచి ప్రతి ఏటా సముద్రాల వారి జయంతి రోజున వారి రచనా ప్రతిభను గుర్తు చేసుకుంటూ, ఒక ఉత్తమ సినీ సంభాషణల రచయితకూ, ఒక ఉత్తమ సినీ గీత రచయితకూ నగదు పురస్కారమిచ్చి, సత్కరించాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు.

సముద్రాల సీనియర్ మనుమడూ, సముద్రాల జూనియర్ ఆఖరి కుమారుడూ అయిన విజయరాఘవాచారి మాట్లాడుతూ, తమ తాత గారు, తండ్రి గారు సినిమా రంగంలో చేసిన కృషిని స్మరించుకున్నారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏయన్నార్, త్రివిక్రమరావు,కమలాకర కామేశ్వరరావు, కె. విశ్వనాథ్ లాంటి ప్రముఖులతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

సముద్రాల సీనియర్ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ జయంతి వేడుకలలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, సినీ నిర్మాణ - పంపిణీ రంగ ప్రముఖులు కొమ్మినేని వెంకటేశ్వరరావు, ఫిల్మ్ నగర్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, పలువురు సీనియర్ పత్రికా రచయితలు పాల్గొన్నారు. సముద్రాల సీనియర్ విగ్రహానికి సభక్తికంగా పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జయంతి వేడుకల నిర్వాహకులు - సముద్రాల కుటుంబ సభ్యులు కలసి సముద్రాల సీనియర్ గారి ఆత్మీయ కుటుంబ మిత్రులు, వారి స్వస్థలమైన గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెదపులివర్రు గ్రామానికే చెందిన దర్శకులు అయిన 'కళాతపస్వి' కె. విశ్వనాథ్‌ను ఆయన స్వగృహంలో కలిశారు. సముద్రాల వారి పక్షాన ఆయనను సత్కరించారు. సముద్రాల వారి కుటుంబంతో తమకున్న ఆత్మీయ అనుబంధాన్నీ, సముద్రాల సీనియర్, జూనియర్లతో తమ అనుభవాలనూ పంచుకున్నారు.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%