ఎంకన్న సామి ఆశీస్సులతో 100 కోట్ల క్లబ్‌లో `కె.జి.ఎఫ్`
2018 ఎండింగ్‌లో అద్భుతమైన విజయమిది. కన్నడ హీరో యశ్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరంగదుర్ నిర్మించిన ప్రతిష్ఠాత్మక చిత్రం కె.జి.ఎఫ్
సంచలన విజయం సాధించింది. కేవలం తొలి 3రోజుల్లో 58 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన కె.జి.ఎఫ్ గ్రాస్ పరంగా తొలి వారాంతానికే 100 కోట్ల క్లబ్ లో చేరనుందని సమీక్షకులు చెబుతున్నారు. 2019 యశ్ కెరీర్ కి ఇది అతిపెద్ద బూస్ట్ .. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టక ముందే అభిమానులకు అద్భుతమైన కానుకను యశ్ అందించాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుత వసూళ్లు సాధించిందని తెలుగు వెర్షన్ నిర్మాత, వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి తెలిపారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీతగోవిందం
ఈ ఏడాది రిలీజై 100కోట్ల క్లబ్ లో చేరింది. అదే తరహాలోనే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక డ్రైవర్ కొడుకు అయిన యశ్ 100 కోట్ల క్లబ్ సినిమాని అందించడం ఓ సెన్సేషన్ అని ప్రశంసించారు. కన్నడలో తొలి 100కోట్ల క్లబ్ చిత్రంగానూ కె.జి.ఎఫ్ సంచలనం సృష్టిస్తోంది.
భారీ మాఫియా బ్యాక్‌డ్రాప్, కోలార్ బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్, క్లాస్ అనే తేడా లేకుండా మైమరిపిస్తోంది. కె.జి.ఎఫ్ చిత్రాన్ని అటు కన్నడం సహా తెలుగు, తమిళం, హిందీలో అత్యంత భారీగా రిలీజ్ చేస్తే కన్నడంలో బంపర్ హిట్. మిగతా చోట్ల ఇతర క్రిస్మస్ రిలీజ్‌లతో పోటీపడుతూ బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే 100కోట్ల వసూళ్ల దిశగా సాగుతుండడంతో యశ్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కన్నడలో ప్రస్తుతం ఏ సూపర్‌స్టార్‌కి సాధ్యం కాని అరుదైన ఫీట్‌ని యశ్ సాధించాడు. గీత గోవిందం 100కోట్ల క్లబ్.. కెజిఎఫ్ 100కోట్ల క్లబ్ ఈ ఏడాదిలో ఒక మేలుకొలుపు.. అసలు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని హీరోల్ని అందలం ఎక్కించిన సినిమాలుగా ఈ రెండు నిలిచాయన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. కె.జి.ఎఫ్ విజయాన్ని పురస్కరించుకుని వారాహిచలనచిత్రం బృందం ఈ బుధవారం ఉదయం తిరుమలేశుని సందర్శించుకోనుంది. ఉదయం 9.30-10.00 మధ్య తిరుపతి- సంధ్య థియేటర్‌ని నిర్మాత సాయి కొర్రపాటి సహా కె.జి.ఎఫ్ బృందం విజిట్ చేయనుంది. అటుపై 12.30 గం.లకు విజయవాడ ట్రెండ్ సెట్ మాల్‌ని విజిట్ చేస్తుంది. సాయంత్రం 4.00 గం.లకు వైజాగ్ శరత్ థియేటర్‌లోనూ అభిమానులతో సెలబ్రేషన్స్‌ని ఘనంగా నిర్వహించనున్నారు.