మనం సైతం దుప్పట్ల పంపిణీ..
గత కొన్ని రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగింది. ఈ విపరీత వాతావరణానికి హైదరాబాద్ మహా నగరంలో నిరాశ్రయులు చాలా ఇబ్బందిపడుతున్నారు. రహదారులపై రాత్రి పూట నిద్రించే ఈ అభాగ్యులను చలి తీవ్రత వేధిస్తోంది. ఇలాంటి పేదలను ఆదుకునేందుకు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోని మనం సైతం సేవా సంస్థ ముందుకొచ్చింది. రాత్రి పూట నగరమంతా తిరిగి ఫుట్ పాత్ లపై పడుకున్న నిరాశ్రయులకు దుప్పట్లు పంచింది. వివిధ ఆస్పత్రుల వద్ద, దేవాలయాల దగ్గర రాత్రి పూట నిద్రిస్తున్న పేదలకు దుప్పట్లు కప్పి వెచ్చదనం కలిగించింది. మనం సైతం సభ్యులు కాదంబరి కిరణ్, బందరు బాబీ, సీసీ శ్రీను, వినోద్ బాలా తదితరులు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ..మొన్న కేరళ వరదల సమయంలో, నిన్న తిత్లీ తుఫాన్ సందర్భంగా బాధితులకు మా వంతు సాయం అందజేశాం. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ విపత్తు జరిగినా మాకు చేతనైనంత సాయం చేస్తున్నాం. నల్గొండ చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం చేశాం. చిత్ర పరిశ్రమలోని ఇరవై నాలుగు విభాగాల కార్మికులకు ఏ కష్టం వచ్చినా మనం సైతంను ఆశ్రయిస్తున్నారు. మా సేవా సంస్థపై అంతగా నమ్మకం పెరిగింది. పరిశ్రమలోని పెద్దలతో పాటు ప్రభుత్వ అధినేతలు మాకు సహకారం అందిస్తున్నారు. మా సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ చేస్తున్నాం. గతేడాది ఇలాగే అందించాం. ప్రస్తుతం నగరంలో చలి తీవ్రత బాగా పెరిగింది. ఈ సందర్భంగా రాత్రి పూట నగరం నలుమూలలా తిరుగుతూ పేదలకు దుప్పట్ల పంపిణీ చేస్తున్నాం. వాళ్ల ముఖాల్లోని ఆనందం వెలలేనిదిగా మనం సైతం భావిస్తోంది. అన్నారు.