Social News XYZ     

Desamlo Dongalu Paddaru Director Reminds Me of 30 Years Back Ram Gopal Varma: Ali

30 ఏళ్ల‌కు ముందు రామ్‌గోపాల్ వ‌ర్మ‌ను చూసిన‌ట్టు అనిపించింది -అలీ

అలీ సమర్పణలో ఖ‌యూమ్‌, తనిష్క్ , రాజ‌న్‌, షానీ, పృథ్విరాజ్‌, స‌మీర్‌, లోహిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా దేశంలో దొంగ‌లు ప‌డ్డారు. సారా క్రియేషన్స్ ప‌తాకంపై. రూపొందింది. గౌత‌మ్ రాజ్‌కుమార్ ద‌ర్శ‌కుడు. ర‌మా గౌత‌మ్ నిర్మాత‌.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ఇదొక క్రైమ్ థ్రిల్ల‌ర్‌. హ్యూమ‌న్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ, ఇప్పుడు స‌మాజంలో జ‌రుగుతున్న ప‌రిస్థితుల‌ను ప్ర‌తిబింబిస్తూ క‌థ‌ను తెర‌కెక్కించాం. ఇప్ప‌టికే విడుద‌ల‌యిన టీజ‌ర్‌కి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇటీవ‌ల సినిమా చూసిన అలీ బాగా న‌చ్చ‌డంతో ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా ఉండ‌టానికి అంగీక‌రించారు. త‌మ్ముడి కోసం ఆయ‌న స‌మ‌ర్పించ‌డం లేదు. సినిమా న‌చ్చి స‌మ‌ర్పిస్తున్నారు. మా టీమ్ అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. ద‌ర్శ‌కుడిగా ఇది నా తొలి సినిమా. నేను బాగా చేశాన‌ని చెప్ప‌డం క‌న్నా, ప్రేక్ష‌కులు సినిమా చూసి చెప్తార‌ని ఆశిస్తున్నాను. విడుద‌ల‌కు ముందే మా సినిమా బ్లాక్ బెర్రీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్‌కి వెళ్లింది. అది చాలా సంతోషం అని అన్నారు.

 

ఖ‌య్యుమ్ మాట్లాడుతూ ఇప్ప‌టిదాకా వంద సినిమాలు చేశాను. అందులో హీరోగానూ ఉన్నాయి. నా కంటూ ఓ డ్రీమ్ రోల్ ఉంటుంది క‌దా.. అలాంటి సినిమా ఇది. క‌థ విన‌గానే న‌మ్మి చేశాను. టీమ్ అంద‌రూ క‌ష్ట‌ప‌డి పనిచేశారు. త‌ల్లి సెంటిమెంట్ ఉన్న సినిమా ఇది. హ్యూమ‌న్ ట్రాఫికింగ్ మీద ఉంటుంది. నా లైఫ్లో చెప్పుకునే సినిమా అవుతుంది. తొలిసారి ఈ సినిమా చూసి మా అన్న‌య్య న‌న్ను అప్రిషియేట్ చేశారు. సినిమా చాలా బాగా చేశార్రా బావుంది అని ఆయ‌న అన‌డం మ‌ర్చిపోలేను అని అన్నారు.

స‌హ నిర్మాత సంతోష్ మాట్లాడుతూ షూటింగ్‌లో ఓ సారి ఖ‌య్యుమ్‌గారికి యాక్సిడెంట్ అయింది. అక్క‌డి నుంచి ఫ్లైట్స్ కూడా లేవు. అయినా 12 గంట‌లు ఆయ‌న ర‌క్తం కారుతున్నా ప్ర‌యాణం చేశారు. అలా ఎంత‌గానో అంద‌రూ స‌హ‌క‌రించారు అని చెప్పారు.

అలీ మాట్లాడుతూ టి.కృష్ణ‌గారి ద‌ర్శ‌క‌త్వంలో దేశంలో దొంగ‌లుప‌డ్డారు అనే సినిమా వ‌చ్చింది. అప్ప‌ట్లో అందులో వేషం వేయ‌డానికి నేను వెళ్లాను. నీ ఫేస్ చాలా కామెడీగా ఉంటుంది. చిన్న‌పిల్లాడివి. నువ్వు చ‌చ్చిపోయే పాత్ర చేస్తే జ‌నాలు న‌వ్వుతారు వ‌ద్దు.. అని న‌న్ను పంపించేశారు. `ఏ రోజుకైన ఈ అబ్బాయి పెద్ద‌స్టార్ అవుతాడు` అని ఆయ‌న త‌న స్నేహితుల‌తో ఆరోజే చెప్పార‌ట‌. టి.కృష్ణ‌గారి స్నేహితుడు నాగేశ్వ‌ర‌రావుగారు టి.కృష్ణ స‌మ‌ర్పించు అనే ఓ సినిమా చేశారు. ముత్యాల సుబ్బ‌య్య‌గారి ద‌ర్శ‌క‌త్వంలో. ఆ సినిమా `అమ్మాయి కాపురం`. ఆ సినిమాకు నాకు ఉత్త‌మ క‌థానాయ‌కుడిగా అవార్డు వ‌చ్చింది. ఇప్పుడు దేశంలో దొంగ‌లు ప‌డ్డారు అని కృష్ణ‌గారి టైటిల్‌తో మా త‌మ్ముడు ఓ సినిమా చేశాడు. ఈ సినిమాకు నా జేబు నుంచి రూపాయి కూడా పెట్ట‌లేదు. సినిమా చాలా బావుంద‌నిపించింది. అందుకే స‌మ‌ర్పిస్తున్నాను. మా త‌మ్ముడు గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు. క‌ష్టాలు నేను ప‌డ్డాను కానీ, వాడు ప‌డ‌లేదు. కానీ ఈ సినిమా కోసం కొన్నాళ్లు భోజ‌నం కూడా స‌రిగా లేకుండా ప‌నిచేశాన‌ని చెప్పాడు. వాడి కోస‌మే ఈ సినిమా చూశాను. ట్విస్ట్ ల‌న్నీ చాలా బావున్నాయి. నేను ద‌ర్శ‌కుడిని పిలిచి ఎక్క‌డ ప‌నిచేశావ‌ని అడిగాను. ఎవ‌రి ద‌గ్గ‌రా చేయ‌లేద‌ని చెప్పాడు. 30 ఏళ్ల‌కు ముందు రామ్‌గోపాల్ వ‌ర్మ‌ను చూసిన‌ట్టు అనిపించింది. ఈ సినిమాను వ‌ర్మ చూస్తే త‌ప్ప‌కుండా మెచ్చుకుంటాడు అని అన్నారు.

సెలెబ్ కనెక్ట్ అధినేత సుమన్ మాట్లాడుతూ " ట్రైలర్ చూడగానే మంచి సినిమా అవుతుందనిపించింది. సినిమా నచ్చి మూవీ కి సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నాం. ఇకపై కూడా ఇలాంటి మరిన్ని మంచి సినిమాలను ప్రోత్సహిస్తూ నిర్మాతలుగా భాగం పంచుకొవాలనుకుంటున్నాం"అన్నారు.

గిరిధ‌ర్‌, జ‌బ‌ర్ద‌స్త్ రాఘ‌వ‌, వినోద్‌, త‌డివేలు త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు. ఈ సినిమాకు కెమెరా: శేఖ‌ర్ గంగ‌న‌మోని, సంగీతం: శాండీ, ఎడిటింగ్‌: మ‌ధు.జి.రెడ్డి, క‌ళ‌: మ‌ధు రెబ్బా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: సాయికుమార్ పాల‌కుర్తి, స‌హ నిర్మాత‌లు: సంతోష్ డొంకాడ‌, సెలెబ్ కనెక్ట్

Facebook Comments
Desamlo Dongalu Paddaru Director Reminds Me of 30 Years Back Ram Gopal Varma: Ali

About uma