బొమ్మరిల్లు, శతమానం భవతి స్టయిల్లో మా బ్యానర్ నుండి వస్తున్న మరో కుటుంబ కథా చిత్రం 'శ్రీనివాస కళ్యాణం' - దిల్‌రాజు
నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'. సతీశ్ వేగేశ్న దర్శకుడు. దిల్‌రాజు, శిరీశ్, లక్ష్మణ్ నిర్మాతలు. ఆగస్ట్ 9న సినిమా విడుదలవుతుంది.
ఈ సందర్భంగా... నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''శ్రీనివాస కళ్యాణం' సినిమా ఆగస్ట్ 9న విడుదలవుతుంది. 12 ఏళ్ల క్రితం.. అంటే 2006 ఆగస్ట్ 9న 'బొమ్మరిల్లు' విడుదలై నాకు ల్యాండ్ మార్క్ ఫిలిం అయింది. అదే రోజున ఈ సినిమా విడుదలవుతుంది. మహేశ్‌బాబుగారి పుట్టినరోజు కూడా అప్పుడే. మా బ్యానర్‌లో మహేశ్‌గారు సినిమా కూడా చేస్తున్నారు. సినిమా ప్రారంభంలోనే బొమ్మరిల్లు వంటి మంచి సినిమా కుదిరితే అదే డేట్‌లో విడుదల చేద్దామని అనుకున్నాను. ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే కాన్ఫిడెంట్‌గా డేట్ ఫిక్స్ అయ్యాను. సినిమా చివరి సాంగ్‌ను పిక్చరైజ్ చేశాం. వర్షంలో ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేశాం. పెళ్లి గురించి చాలా సినిమాలు, పాటలు చూశాం. మరి కొత్తగా ఏముంటుంది అనే అందరూ అనుకుంటున్నారు. అయితే రేపు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మంచి అనుభూతితో ప్రేక్షకులు ఇంటికి వెళతారని నమ్మకంగా చెబుతున్నాను. శతమానం భవతి తర్వాత సతీశ్ వేగేశ్న పెళ్లిపై సినిమా చేస్తానని అన్నారు. అలాగే ఈ కథ తయారీలో నా లైఫ్‌లో జరిగిన విషయాలు కూడా తోడయ్యాయి. నా లైఫ్‌లో జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో.. ప్రతి ఒక కుటుంబంలో జరుగుతాయి.
బొమ్మరిల్లు సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు సినిమా నచ్చడంతో దాన్ని అద్భుతమైన సినిమాగా మలిచారు. శతమానం భవతికి అలాంటి మ్యాజిక్ రిపీట్ అయింది. పెద్ద సినిమాల మధ్యలో విడుదలైన శతమానం భవతిని ట్రెండ్ సెట్టర్‌ని చేశారు. సందేహం లేదు.. రేపు శ్రీనివాసకళ్యాణం చూసిన ప్రేక్షకులే సినిమాను అందరి దగ్గరకు తీసుకెళతారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. ఇంటికెళ్లిన తర్వాత మా జీవితాన్ని చూపించారని అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ ఫీల్ అవుతారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు అన్ని కాకున్నఆ.. కొన్ని విషయాలైనా ఈ సినిమా నుండి తీసుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలు, అబ్బాయిలు నా పెళ్లి ఇలా జరిగితే బావుండని అనుకుంటారు. మా బ్యానర్ నుండి బొమ్మరిల్లు, శతమానం భవతి తర్వాత శ్రీనివాసకళ్యాణం మరో మంచి సినిమా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ రోజునే ఆగస్ట్ 9నే అనుకున్నాను.
ఉదాహరణకు అశ్వనీదత్‌గారు జగదేకవీరుడు అతిలోక సుందరి రిలీజ్ డేట్ రోజునే మహానటిని విడుదల చేశారు. మ్యాజిక్ జరిగింది. అలాగే నాకు అలాగే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అనుకుంటున్నాను. దిల్ తర్వాత అదే హీరోతో మరో అద్భుతమైన సినిమా చేయడానికే ఈ గ్యాప్ వచ్చిందేమో అని అనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామినే మాతో ఈ సినిమా చేయించాడని అనుకుంటున్నాను. స్క్రిప్ట్‌కి సమయం తీసుకున్నాం కానీ.. షూటింగ్‌ను తక్కువ సమయంలోనే పూర్తి చేశాం. ఆల్‌రెడి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి సాంగ్.. యూత్‌ఫుల్ సాంగ్.. సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది'' అన్నారు.