'నా లవ్ స్టోరీ' కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే చిత్రం - హీరో మహిధర్
అశ్విని క్రియేషన్స్ బ్యానర్ పై జి.లక్ష్మి నిర్మాతగా.. శివగంగాధర్ డైరక్షన్ లో మహిధర్, సోనాక్షి సింగ్ రావత్ లను తెలుగు తెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం నా లవ్ స్టోరీ. లవ్ స్టోరీ లలో ఇది ఒక తన ప్రత్యేకతను చూపుతుందనేలా అంచనాలను పెంచిన ఈ సినిమా జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో మహిధర్ మీడియాతో ముచ్చటించారు.
మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
యాక్టింగ్ బిక్షు గారి దగ్గర నేర్చుకున్నా. మా అమ్మ గారు పబ్లిషర్ అవడం వల్ల రైటర్స్, డైరక్టర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అలా డైరక్టర్ శివ గారితో పరిచయం అయ్యారు. ఆయన నాకు కథ చెప్పడం, నాకు చేయాలనిపించడం, నేను యాక్టింగ్ కోర్సు చేశానని ఆయన నన్ను నమ్మి కథను సెట్స్ మీదకు తీసుకెళ్లడం చాలా ఫాస్ట్ గా అయిపోయిందంతా..
నా లవ్‌స్టోరీ.. అసలు సినిమా దేని గురించి?
ప్రస్తుతం సమాజంలో ప్రతీ అబ్బాయీ ఎదుర్కొంటున్న సమస్యే. వయసు మీద పడుతున్న పెళ్లి కాకపోవడం, అక్కడి నుంచి ఆ అబ్బాయికి ఒక అమ్మాయి పరిచయమవడం, ఆ తర్వాత ఒక క్యూట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ ఎలా సక్సెస్ అయింది అన్న దాని మీద కథ నడుస్తూంటుంది.
సినిమాలో మీ పాత్ర ఏంటి?
(నవ్వుతూ..)ఉద్యోగం లాంటివేమీ చేయను. లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ తిరుగుతూంటాను.
డైరక్టర్ గురించి..
శివ గారు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఆయన కూడా ఆర్టిస్ట్ అవడం వల్ల ఎదుటి వారి నుంచి ఎంత వరకు రాబట్టుకోవాలో బాగా తెలుసు. అందరం కొత్త వాళ్లమైనా కానీ ఒకటికి రెండు సార్లు చెప్పి బాగా చేయించుకోగలిగారు.
హీరోయిన్ గురించి..
సోనాక్షి సింగ్ రావత్ అని ముంబై అమ్మాయి. కొత్త అమ్మాయి అయినా మొదట్లో తెలుగు లో కొంచెం ఇబ్బంది పడినా తర్వాత్తర్వాత అర్థం చేసుకుని చాలా బాగా చేసింది.
క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులేం రాలేదా..?
క్యాస్టింగ్ కౌచ్ లాంటివేమీ అసలు మాకు తెలియదండి..
డ్యాన్సులు, ఫైట్లు..
డ్యాన్యులు, ఫైట్ల కోసం కూడా కోచింగ్ తీసుకున్నాను. సోనూ మాస్టర్ డ్యాన్స్ చాలా బాగా నేర్పించారు. కొత్త వాడిని కాబట్టి నేనేం చేయగలనో నా కెపాసిటీ ఏంటో తెలుసుకుని దానికి అనుగుణంగా చాలా బాగా చేయించుకున్నారు. ఫైట్స్ రామ్ సుంకర గారు కంపోజ్ చేశారు. రెండు ఫైట్స్ ఉన్నాయి సినిమాలో. రెండూ కూడా చాలా బాగా వచ్చాయి.
మ్యూజిక్ డైరక్టర్ గురించి..
వేద నివాన్ గారు మా సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. నాలుగు పాటలున్నాయి. ఆల్రెడీ రిలీజ్ అయిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. శివ గారు ఒక ఎత్తు అయితే వేద నివాన్ గారు ఇంకో ఎత్తు. అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. రీరికార్డింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. లిరిక్స్ భువన చంద్ర, శివశక్తి దత్తా గారు ఇచ్చారు. ఆల్రెడీ వేద నివాన్ గారు మనోజ్ తో శౌర్య అనే సినిమాకు పనిచేశారు. ఆ ఆల్బమ్ కూడా మంచి హిట్ అయింది.
సినిమాలో మీతో పాటూ ఎవరెవరు నటించారు?
తోటపల్లి మధు గారు నా తండ్రి క్యారెక్టర్ చేశారు. శివన్నారయణ గారు హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ చేశారు. కమెడియన్ చమ్మక్ చంద్ర ఉన్నారు నవ్వించడానికి. మిగిలిన వాళ్లంతా దాదాపు కొత్త వాళ్లే.
అసలు మీ పుట్టిన ఊరు? క‌్వాలికేషన్..
విజయవాడ లో పుట్టి పెరిగాను. సివిల్ ఇంజనీరింగ్ చేశాను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో.. మోడలింగ్ చేద్దామనుకున్నా.. ఢిల్లీ, హర్యానాలలో జాబ్ కూడా చేశా. కానీ సినిమాల మీద ఆసక్తితో యాక్టింగ్ నేర్చుకోవడం, శివ గారు కలవడం వల్ల ఇటువైపు వచ్చేశా..
చాలా మందికి ఎన్నో స్ట్రగుల్స్ పడితే కానీ అవకాశాలు రావట్లేదు.. మీకూ అంతేనా..?
లేదండీ.. యాక్టింగ్ నేర్చుకునే టైమ్ లోనే శివ గారు కథ చెప్పి ఓకే అనేశారు. అదృష్టం కొద్దీ ఛాన్సుల కోసం నేనెక్కడికీ వెళ్లి ఇబ్బంది పడింది లేదు .
ఇప్పటివరకు ఏం చేసేవారు?
సినిమా కాకుండా బిజినెస్ లు ఉన్నాయి. బార్ అండ్ రెస్టారెంట్స్, వైన్ షాప్స్, సాహితి పబ్లికేషన్స్ అని వర్మ గారి నా ఇష్టం, వోడ్కా విత్ వర్మ, పెద్ద వంశీ గారి పసలపూడి కథలు ఇలా ఎన్నో బుక్స్ మా నుంచే పబ్లిష్ అయ్యాయి. సినిమాల మీద ఇష్టం తో మొదట నేను నిర్మాతను అవుదామని చూశా కానీ అప్పుడు నాకు మంచి కథలు దొరకలేదు. ఫైనల్ గా హీరో అయ్యాను.
హీరో గా ఇదే మొదటి సినిమా. తర్వాత ఏమైనా సినిమాలు చేస్తున్నారా..?
భారతీబాబు గారితో వేరే సినిమా ఒకటి చేశాను. షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. ఆగస్టు లో రిలీజ్ అనుకుంటున్నారు.
నిర్మాత అవుదామనుకుని జర్నీ స్టార్ట్ చేశారు.. ఇప్పుడు ఆ ఆలోచన అలానే ఉందా మరి..
ప్రొడ్యూసర్ గా కంటిన్యూ చేస్తా. నా సినిమాలనే కాదు మంచి కథలొస్తే డబ్బులు పెట్టి, సినిమా తీయడానికి నేను రెడీ.
ఈ సినిమా నిర్మాత గురించి..
శేషగిరి రావు గారు సినిమాను , టీమ్ ను ఎంతో నమ్మి ఫ్రీడమ్ ఇచ్చారు. సినిమా మొత్తం మీద ఒక రెండు సార్లు సెట్స్ కి వచ్చారు అంతే. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మాకు ఎంతో సహకరించారు.
మీ అమ్మ గారు సినిమా చూశారా..?
మా అమ్మ కూడా చూడ్లేదండి.. ఆవిడకే బాగా ఇష్టం నన్ను సినిమాల్లో చూడాలని.
సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీనా..?
లేదండీ.. నా లవ్‌స్టోరీ అనగానే యూత్ ఫుల్ మూవీ అనుకుంటారు కానీ ఫ్యామిలీ అందరూ ఇన్వాల్వ్ అయి, కలిసి చూడదగ్గ సినిమా ఇది.
కామెడీ ఉంటుందా..?
కామెడీ ఉంటూనే, వేరే సీన్ లో ఇద్దరి ఫాదర్స్ మధ్య జరిగే కామెడీ ట్రాక్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది.
మొదటి సినిమా కదా.. ఏమైనా కంగారు పడుతూ చేశారా..?
అలాంటిదేమీ లేదు. మొదటి నుంచి కొంచెం ట్రైనింగ్ తీసుకోవడం, శివ గారితో ముందే నా జర్నీ స్టార్ట్ అవడం వల్లనో కానీ అలాంటివేమీ లేకుండా చాలా ఫ్రీ గానే చేశాను.
మీరు ముందు అనుకున్న ఇండస్ట్రీ, ఇప్పుడు చూస్తున్న ఇండస్ట్రీ ఒకేలా ఉన్నాయా..?
అంతా బాగానే ఉంది కానీ రిలీజ్ దగ్గర పడుతున్నప్పుడే కాస్త టెన్షన్ గా, ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే ఫీలింగ్ లోపల కొంచెం ఉంది.
ఏయే లొకేషన్స్ లో షూట్ చేశారు..
విజయవాడ, హైదరాబాద్ లలోనే ఎక్కువ షూటింగ్ చేశాం. సాంగ్స్ కోసం థాయలాండ్లో చాంగ్మయ్ లో చేశాం.
కెమెరామెన్ ఎవరు..?
ఈశ్వర్ కిరణ్ అని సెంథిల్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేశారు. ఇంతకుముందు కూడా చాలా సినిమాలే చేశారు. మమ్మల్నందరినీ ఎంతో బాగా చూపించారు.
ఫైనల్ గా...
నా లవ్ స్టోరీ ని 29 కి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. చాలా ఇష్టపడి, కష్టపడి చేశాం. ప్రతీ ఒక్కరికీ నచ్చేలా ఉంటుందని మాత్రం చెప్పగలను.