ఈనెల 29న `శంభో శంకర` గ్రాండ్ రిలీజ్
కమెడియన్లు హీరోలుగా క్లిక్కయితే ఆ లెక్కే వేరు. అలీ- యమలీల, సునీల్ - అందాల రాముడు, మర్యాద రామన్న, శ్రీనివాసరెడ్డి- గీతాంజలి, సప్తగిరి- సప్తగిరి ఎక్స్‌ప్రెస్ .. బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించిన ఈ చిత్రాలన్నీ కమెడియన్ టర్న్‌డ్ హీరో సినిమాలే. ఇప్పుడు అదే కోవలో వస్తున్న మరో చిత్రం శంభో శంకర
. షకలక శంకర్‌ని హీరోగా, శ్రీధర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. ఆర్. పిక్చర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో వై. రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రమిది.
నిర్మాత రమణారెడ్డి మాట్లాడుతూ-ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుత స్పందన లభించింది. టీజర్ 50లక్షల వ్యూస్ వైపు దూసుకెళుతోంది. ఒక స్టార్ హీరో టీజర్‌కి తగ్గని ధమాకా రిజల్ట్ ఇది. దిల్‌రాజు వంటి అగ్రనిర్మాత కం పంపిణీదారుడు ఈ సినిమా టీజర్‌ని ప్రశంసించారంటే ఫలితం ముందస్తుగానే ఊహించవచ్చు. పరిశ్రమలో పాజిటివ్ టాక్ వినిపించడం ఉత్సాహం నింపుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నాం
అని అన్నారు.
మరో నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ -షకలక శంకర్ కథానాయకుడిగానూ నిరూపించుకునే ప్రయత్నమిది. తొలి ప్రయత్నమే పెద్ద సక్సెస్ అవుతాడన్న ధీమా ఉంది. టీజర్‌కి వచ్చిన హైప్ దృష్ట్యా ఈ చిత్రాన్ని అత్యంత ఘనంగా రిలీజ్ చేస్తున్నాం. 29న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. శంకర్‌తో పాటు నటీనటులందరూ అద్భుతంగా లీనమై నటించారు. అందరికీ ఇదో కీలకమలుపునిచ్చే సినిమా అవుతుంది
అన్నారు.
షకలక శంకర్, కారుణ్య నాగినీడు, అజయ్ ఘోష్, రవి ప్రకాష్, ప్రభు, ఏడిద శ్రీరామ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: ఛోటా.కె. ప్రసాద్, నిర్మతలు: వై. రమణారెడ్డి, సురేష్ కొండేటి, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: శ్రీధర్. ఎన్.