Social News XYZ     

74 Year Old Indraganti Srikanth Sharma Writes A Romantic Song For Sammohanam

'సమ్మోహనం' కోసం
74 ఏళ్ళ వయసులో
ఫుల్ రొమాంటిక్ సాంగ్ రాసిన
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

సుధీర్ బాబు, అదితీ రావ్ హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ''సమ్మోహనం'' చిత్రం జూన్ 15న విడుదలకు ముస్తాబవుతోంది. ''పెళ్లిచూపులు'' ఫేమ్ వివేక్ సాగర్ స్వరాలందించిన ఈ చిత్రంలో మొత్తం 4 పాటలు ఉన్నాయి. ''ఊహలు ఊరేగే గాలంతా'' పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి , ''ఓ చెలి తార'' ,''కనులలో తడిగా'' పాటలను రామజోగయ్యశాస్త్రి రచించారు. ''మనసైనదేదో వరించిందిలా... తలపై తరంగమై తరిమిందిలా... వలపో, పిలుపో, మురుపో.. ఏమో !... అంత వింతే ! అందే దెంతో ! '' అనే పాటను ప్రముఖ కవి 'ఇంద్రగంటి శ్రీకాంత శర్మ' విరచించారు. ఇటీవల ఆన్ లైన్లో విడుదలైన ఈ పాటకు విశేషాదరణ లభిస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ - ''ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ జగమెరిగిన కవి. ఆయన ఎంత గొప్ప రచయితో ,పేరొందిన సంపాదకులో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాపు గారు తీసిన ''కృష్ణావతారం'' సినిమాతో ఆయన పాటల రచయితగా కూడా మారారు. అందులో ఆయన 'చిన్నారి నవ్వు- చిట్టి తామర పువ్వు' పాట రాశారు. ఆ తర్వాత జంధ్యాలగారి 'నెలవంక'లో ఆరు పాటలు రచించారు. ఆ తరువాత కూడా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ''రెండు జెళ్ళ సీత' లో ''పురుషుల్లో పుణ్యపురుషులు వేరు'' పాట ''పుత్తడి బొమ్మ'' లో రెండు పాటలు, 'రావు గోపాలరావు' లో 'కులుకులమ్మ చూసిందిరో' పాట, కృష్ణ మూర్తి - కుక్క పిల్లలు 'టెలీఫిల్మ్లో ఒక పాట రాశారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'గోల్కొండ హై స్కూల్' కోసం 'ఏనాటివో రాగాలు', ''అంతకుముందు ఆ తరువాత'' చిత్రం కోసం 'నా అనురాగం' అనే పాటను రచించారు. మా ''సమ్మోహనం'' లో కూడా ఏదైనా పాటను రాయించమని దర్శకుడ్ని నేనే కోరాను. ఆరోగ్యం అంతగా సహకరించని పరిస్థితుల్లో కూడా అద్భుతంగా పాట రాసారు శ్రీకాంత శర్మ గారు. 74 ఏళ్ళ వయసులో ఇంత ఫుల్ రొమాంటిగ్గా రాస్తారని నేను ఊహించలేదు. కవిత్వానికి వయసుతో సంబంధం లేదని ఈ పాట వింటే ఒప్పుకుంటారు. శ్రీకాంత్ శర్మ గారి పాటతో ఈ ఆల్బంకే ఒక నిండుతనం వచ్చింది. ఈ పాటలు ఎంత హాయిగా ఉంటాయో, సినిమా కూడా అంతే హాయిగా ఉంటుంది. ఒక తీపి గుర్తులా నిలిచిపోయే సినిమా ఇది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం జూన్ 15న విడుదల కానుంది" అని తెలిపారు.

 

దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ ''మా నాన్న గారు అనుభూతి కవిత్వానికి పెట్టింది పేరు. ఒక నార్మల్ పర్సన్ ని ఓ గ్లామర్ స్టార్ ప్రేమించడం, అతని బైక్ మీద విహరించడం లాంటివి భావోద్వేగానికి గురి చేసే అంశాలు. మనసులో పొంగి పొరలే ఆ ఉద్వేగాన్ని ఒడిసి పట్టే పాట ఇది. నాన్న గారికి సందర్భం చెప్పగానే రాత్రికి రాత్రి పాట పూర్తి చేసేసారు. 'లోనజడి పిలిచేనా ! పూలనది పలికేనా ! లాంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్స్ రాసారాయన. ఈ పాట చిత్రీకరణ కూడా చాలా బాగా కుదిరింది" అని చెప్పారు.

న‌టీన‌టులు:
సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పవిత్రా లోకేష్ , నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శిశిర్‌శ‌ర్మ,అభయ్ ,హర్షిణి త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు:
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్ కుమార్‌, ఫైట్స్ :రామకృష్ణ , ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: య‌స్ . ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌; డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, ,నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.

సాంగ్
పల్లవి:
మనసైనదేదో వరించిందిలా
తలపే తరంగమై తరిమిందిలా
వలపో, పిలుపో, మురుపో..ఏమో!
అంతా వింతే! అందే దెంతో!

చరణం – 1
తనివార నాలో వెలుగాయె
చిరుయెండ చాటు వానాయె
లోనజడి – పిలిచేనా!
పూలనది – పలికేనా...
పైనా లోనా వేడుకలే
అందే దెంతో, దేనికదే!
అరుదైన రాగ రవమే వెంటాడెనా!
మరుమల్లె తావి వరమై జంటాయెనా
చిగురంత చాలులే! సరేనా!

జగమంత నేనై జయించేనులే
వలపే వసంతమై విరిసిందిలే
కలలూ చెలిమీ కలిసే వేళ
నాలో నువ్వే నీలో నేనే...

Lyric - INDRAGANTI SRIKANTHA SARMA
Music - VIVEK SAGAR
Singer - VIVEK SAGAR
Director - MOHANAKRISHNA INDRAGANTI
Producer - SIVALENKA KRISHNA PRASAD

Facebook Comments
74 Year Old Indraganti Srikanth Sharma Writes A Romantic Song For Sammohanam

About uma