లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం 'సత్య గ్యాంగ్' - నిర్మాత మహేశ్ ఖన్నా
సాత్విక్ ఈశ్వర్‌ను హీరోగా పరిచయం చేస్తూ సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు మహేశ్ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం 'సత్య గ్యాంగ్'. ఈ చిత్రానికి ప్రభాస్ దర్శకత్వంతోపాటు సంగీతం అందించగా, మహేశ్‌ఖన్నా దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 6న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ ''ఏప్రిల్ 6న సత్యగాంగ్ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. నేను ఎన్నో సినిమాల్లో నటించాను. సినిమా తియ్యడం మాత్రం మొదటిసారి. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా సినిమా తియ్యడం జరిగింది. జనరల్‌గా సినిమాల వల్ల ఎంతో మంది ఇన్‌స్పైర్ అవుతారు. సినిమాలో మనం ఇచ్చే కన్‌క్లుజన్ బాగుండాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాం. ఈ సినిమా ద్వారా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రేక్షకులే కాదు భారతదేశంలోని యువత మొత్తం ఏవిధంగా ఉండాలి, ఒకవేళ పొరపాటు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందనేది చెప్పడం జరిగింది. జనరల్‌గా ప్రతి తల్లి కూతురితో అన్ని విషయాలు క్లోజ్‌గా మాట్లాడుతుంది. అదే తండ్రి విషయానికి వస్తే తనకు బాధ వున్నా, కోపం వున్నా అన్నీ మనసులోనే దాచుకుంటాడు. పిల్లల్ని అందరూ ప్రేమగా పెంచుతారు. పిల్లలు ఎలాంటి తప్పులు చేస్తున్నారనేది తెలియనంతగా తమ ప్రేమను పంచుతారు. వాళ్ళు తప్పులు చేస్తే పరిణామం ఎలా ఉంటుంది. తర్వాతి తరానికి ఇది ఏవిధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరు తప్పు చేస్తే దానికి కుటుంబం మొత్తం బాధ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ చిత్రం ద్వారా ఎవరైనా తప్పు చేస్తే పోలీస్ డిపార్ట్‌మెంట్ ఐడెంటిఫై చేస్తుంది. ఉదాహరణకు ఒక అబ్బాయి, అమ్మాయి తప్పు చేస్తే ప్రతి విషయాన్ని పోలీస్ డిపార్ట్‌మెంట్ ఐడెంటిఫై చెయ్యలేదు. కొన్ని ట్రేస్ ఔట్ అవుతాయి, కొన్ని కావు. ఆఖరికి కోర్టుకు కూడా అన్నింటినీ ఆపడం సాధ్యం కాదు. ఆడది అర్థరాత్రి ఒంటరిగా తిరగగలిగినప్పుడే మనకు స్వాతంత్య్రం వచ్చినట్టు అని గాంధీగారు చెప్పారు. ఈ చిత్రం ద్వారా భవిష్యత్తులో మగ పిల్లవాడైనా సరై అర్థరాత్రి ఒంటరిగా తిరగడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. ఏదైనా తప్పు చెయ్యాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే నలుగురు అనాథ కుర్రాళ్ళు ఉంటారు. వారి వల్ల ఒక క్రైమ్ జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది సినిమా. మధ్యలో గ్యాంగ్ వార్స్ ఉంటాయి, లవ్ ట్రాక్ ఉంటుంది. భవిష్యత్తులో అనాధలు ఉండకూడదు అనేది కూడా చెప్తున్నాం. ఈ చిత్రానికి కథ, మాటలు నేనే రాశాను. అలాగే దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నాను.
ఈ కథకి ఇన్‌స్పిరేషన్ ఉంది. నాకు ఒనేరో అనే స్కూల్ ఉంది. మా స్కూల్‌లో ఒక స్టూడెంట్‌కి 10 నుంచి 20 వేలు మాత్రమే ఫీజు తీసుకుంటున్నాం. నాకు ఉన్న అనుభంలో నేను చూసిందేమిటంటే ఈరోజుల్లో పిల్లల మీద తల్లిదండ్రులు చాలా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. వాళ్ళని టేబుల్ స్పూన్స్‌లా తయారు చేస్తున్నారు. బయటికి వెళ్ళకూడదు, బయటకెళ్లి ఆడుకోకూడదు అనేది ఉంటుంది. అలా కాకుండా ఆడుతూ పాడుతూ పెరగాలన్నది మా కాన్సెప్ట్. మట్టిలో ఆడుకుంటే పిల్లలకు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. నేను స్కూల్ పెట్టిన కొత్తలో ఐదారేళ్ళ క్రితం ఉదయం ప్రేయర్‌లోనే ఐదారుగురు కుర్రాళ్ళు పడిపోయేవాళ్లు. కాస్త ఎండని కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. తర్వాత పిల్లలతో బయట గేమ్స్ ఆడించిన తర్వాత మిట్ట మధ్యాహ్నం దాదాపు 3 వేల అడుగులు ఉన్న కొండని ఎక్కగలిగారు. వారిలో రెసిస్టెన్స్ పెరిగింది. ఇక తల్లీ, తండ్రి లేని పిల్లలకు ఆ లోటు వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అనిపిస్తుంది. వాళ్ళకి న్యాయం చెయ్యాలనే ఉద్దేశంతో ఈ సినిమా చెయ్యడం జరిగింది. చదువనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. చదువే జీవితం కాదు. ఈ సినిమాకి కథే మెయిన్ హీరో. మా పెద్దబ్బాయి మైనింగ్ ఇంజనీర్, రెండో అబ్బాయి ఈ సినిమా స్టార్ట్ చేసే టైమ్‌కి ఇంటర్ సెకండియర్. ఈ సినిమా ఓపెనింగ్ టైమ్‌లో చాలా మంది పెద్దవారికి అబ్బాయికి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నేను వాడికి ఒకటే చెప్పాను నువ్వు ఇంటర్ ఫెయిల్ అయినా ఫర్వాలేదు. డాన్స్‌పైన, యాక్టింగ్‌పైన కాన్‌సన్‌ట్రేట్ చెయ్యమని చెప్పాను. అయితే ఎగ్జామ్స్‌కి వారం ముందు వాడిని వదిలాం. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. డిగ్రీ ఇక్కడే జాయిన్ చేశాం. ఈ సినిమాలో డాన్సులు బాగా చేశాడు. తప్పకుండా సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో సుమన్‌గారు, సుహాసినిగారు, బాహుబలి ప్రభాకర్, షఫీ, వినోద్, రాజేందర్, దిల్ రమేష్ ముఖ్యపాత్రలు చేశారు. నేను కూడా ఒక క్యారెక్టర్‌లో నటించాను. దైవసంకల్పం వల్లే ఈ సినిమా స్టార్ట్ చేశాం. ఈ సినిమాని 150 థియేటర్లలో రిలీజ్ చెయ్యాలనుకుంటున్నాం'' అన్నారు.