అమీర్ పేట్ టు అమెరికా ఆడియో విడుదల వేడుక !!
రాధా మీడియా బ్యానర్ పై శ్రీమతి స్వప్న కొమండూరి సమర్పణలో పద్మజ కొమండూరి నిర్మిస్తున్న చిత్రం "అమీర్ పేట్ టు అమెరికా". రామ్మోహన్ కొమండూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక నిన్న సాయంత్రం హైద్రాబాద్ లో పలువురు రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావుగారు ఆడియోను విడుదల చేసి మొదటి సీడీని బూరా నర్సయ్య గౌడ్ మరియు చిత్ర బృందానికి అందించారు.
ఈ సందర్భంగా బూరా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. "తెలంగాణా రీతిలో తెరకెక్కుతున్న తెలంగాణ సినిమాలన్నీ ఈమధ్యకాలంలో హిట్ అవుతున్నాయి. ఈ పరిణామాన్ని ఈమధ్య అందరూ ఫాలో అవుతున్నారు. తమిళ, మలయాళ చిత్రాల సహజత్వాన్ని ఆదరిస్తున్నట్లు త్వరలోనే తెలంగాణ చిత్రాలను కూడా ఆదరిస్తారు. కథే హీరో అన్న రీతిలో త్వరలో సినిమాలోస్తాయి.
ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావు మాట్లాడుతూ.. "నిర్మాత రామ్ మా తమ్ముడి లాంటోడు. ఇక్కడ కుటుంబాలను వదులుకొని అమెరికాకి చదువు కోసం, సంపాదన కోసం అమెరికా వెళ్ళి అక్కడ సరైన అవకాశాల్లేక నానా ఇబ్బందులుపడే చాలా మంది వ్యధలను ఈ చిత్రం ద్వారా చూపించడం అనేది అభినందనీయం. ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలతో మరో సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం గురించి ఎలాంటి సహాయం కావాలన్నా సరే చేసిపెడతాం. త్వరలోనే తెలంగాణ దర్శకనిర్మాతలకు థియేటర్లు అందుబాటులోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.
నిర్మాత రామ్ మాట్లాడుతూ.. "మా ఆడియో విడుదల వేడుకకు విచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. సినిమాని కూడా ఇదే విధంగా ఆదరించి మా చిత్రాన్ని సూపర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. మా సాకేత్ దగ్గరుండి మరీ సినిమాని చూసుకున్నాడు" అన్నారు.
దర్శకుడు రామ్మోహన్ కొమండూరి మాట్లాడుతూ.. "మా ప్రొడ్యూసర్ రామ్ నన్ను నమ్మి ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను అప్పగించారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టే స్థాయిలో సినిమా ఉంటుంది. అలాగే.. ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో సినిమా రూపొందింది. చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను" అన్నారు.
తేజస్, వంశీ కోడూరి, వైవా హర్ష, వంశీకృష్ణ, పల్లవి డోరా, సాషా సింగ్, మేఘన, జీవన్, రవితేజ, యలమంద, మహిత, రమ్యా పటేల్, ఆషు రెడ్డి, సంతోష్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సమ్మెట గాంధీ, మణిచందన, డాక్టర్ రాజేశ్వరి, మాధవి సుంకిరెడ్డి, నరేష్ సుంకిరెడ్డి, రఘువీర్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రామ్మోహన్ కొమండూరి మరియు భానుకిరణ్ చల్లా, నిర్మాత: పద్మజ కొమండూరి, మ్యూజిక్: కార్తీక్ కొడకండ్ల, సినిమాటోగ్రఫీ: అరుణ్ ఐ కె సి, జి.ల్. బాబు, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి.