Kakatiya short film awards ceremony a grand success

'సమాజాన్ని సంఘటితం చేసే లఘు చిత్రాలు రూపుదిద్దుకోవాలి'

కాకతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల ప్రదానోత్సవంలో

డా. అన్నదానం సుబ్రహ్మణ్యం

‘ఏక్ భారత్, సమరస భారత్’ నినాదంతో సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన ‘కాకతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం సారథి స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ఆర్.ఎస్.ఎస్. అధికారి డా. అన్నదానం సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా హాజరై తన సందేశాన్ని అందించారు. ప్రసార, ప్రచార మాధ్యమాల ద్వారా సమాజానికి ఉపయోగపడే అంశాలను, సంఘటితం చేసే విషయాలను ప్రజలకు అందించాలని కోరారు. లఘు చిత్రాలను రూపొందించే యువత ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే సమాజానికి మేలు చేసిన వారు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇటీవల తాను నిర్మించిన ‘పెళ్ళిచూపులు’ చిత్రంతో షార్ట్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ ను దర్శకుడిగా పరిచయం చేశానని, అలానే ప్రతి యేడాది ఒకరిని పరిచయం చేయాలనుకుంటున్నానని అన్నారు. కాకతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఔత్సాహికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ లఘు చిత్రోత్సవంలో శంకర్రాజు రూపొందించిన ‘బిహైండ్ ద స్మైల్’ ప్రధమ, శివకుమార్ బి.వి.ఆర్. రూపొందించిన ‘గురుకులం’ ద్వితీయ, దుర్గాప్రసాద్ రూపొందించిన ‘చాయ్ చోటు’ తృతీయ బహుమతులకు ఎంపికయ్యాయి. ఎం. శంకర్రాజు రూపొందించిన ‘రైతు’ లఘు చిత్రం స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపికయ్యింది. ‘సమరసత’, ‘సేవ’, ‘జాగరుకత’ అనే అంశాలపై తొలియత్నంగా తాము నిర్వహించిన కాకతీయ లఘు చిత్రోత్సవం విజయవంతం కావడం పట్ల అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్ రెడ్డి, ఆయుష్ నడింపల్లి హర్షం వ్యక్తం చేశారు. ఈ చిత్రోత్సవానికి అల్లాణి శ్రీధర్, ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, సుమంత్ పరాంజి, శేఖర్ సూరి, వినయ్ వర్మ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

Facebook Comments
Share

This website uses cookies.