'భగవద్గీత ఫౌండేషన్' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 'గీతాజయంతి' వేడుకలు
భగవద్గీత ను మతగ్రంధంగా చూడకుండా ధర్మగ్రంధంగా చూడాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎల్.ఎ. డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు.
ఈ నెల 10వ తేదీ శనివారం నాడు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభ (చిక్కడపల్లి) లో 'గీతాజయంతి' వేడుకలు, సంపూర్ణ భగవద్గీత పారాయణము 'భగవద్గీత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.మరియు అదే రోజు ఉదయం 8గంటలకు చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నుండి గీతా బంధువులతో శోభాయాత్ర ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎల్.ఎ. డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..'భగవద్గీత ధర్మా ధర్మాలు, కర్తవ్యం, ఆనందంగా జీవించటం ఎలాగో చెబుతుందన్నారు.
భగవద్గీత ను యువతకు చేరవేయాలనే సదాశయంతో భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గంగాధర శాస్త్రి ఈ కార్యక్రమం చేపట్టటం ముదావహమన్నారు.ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా. సముద్రాల వేణుగోపాలాచారి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కె.సి.ఆర్. తో మాట్లాడి ' భగవద్గీత ను పాఠ్యాంశం గా చేర్చటంతో పాటు సముచిత స్థానాన్ని కల్పించే విధంగా తనవంతు కృషి చేస్తానన్నారు. అంబర్ పేట శాసన సభ్యులు జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ..' భగవద్గీత ఉత్తమ జీవన విధానానికి స్ఫూర్తి నిస్తుందని అన్నారు. ప్రతిఫలాపేక్షలేకుండా కర్మ చేయటం లో ఉండే ఆనందం ఏమిటో చెబుతుందన్నారు. గంగాధరశాస్త్రి ఈ మహాయజ్ఞాన్ని భుజాన వేసుకుని ముందుకు నడిపించటం సంతోషించ తగినది అన్నారు.
భగవద్గీత ను ప్రతి ఒక్కరు చదవాలని అభిలషించారు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యానృసింహభారతి స్వామి. భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గంగాధర శాస్త్రి మాట్లాడుతూ భగవద్గీత మతాలకు అతీతమైనది అన్నారు. ఈ కార్యక్రమంలో వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు, త్యాగరాయ గాన సభ అధ్యక్షుడు కళా వెంకట దీక్షితులు, ఐ ఫోకస్ అధ్యక్షులు వాసుదేవ శర్మ, భగవద్గీత ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బి.కె.శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.చలపతి రాజు, కోశాధికారి ఎల్.అర్చన తదితరులు పాల్గొన్నారు.