"ప్రశంసలందుకొమ్మురా" అంటున్న డా.దాసరి !!
ఏదైనా ఓ సినిమా విజయం సాధిస్తే.. ఎక్కువగా ఆనందించేవారిలో దర్శకరత్న డా.దాసరి ఒకరు. ముఖ్యంగా ఓ చిన్న సినిమా పెద్ద విజయం సాధిస్తున్నప్పుడు దాసరి మరింతగా సంతోషిస్తారు. సదరు చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ అభినందనల వర్షం కురిపిస్తారు. దాసరి ప్రశంస ఓ "ఐ ఎస్ ఐ" మార్క్ లాంటిది. ఓ సినిమాను దాసరి ప్రత్యేకంగా ప్రశంసించారంటే.. ఆ సినిమా "కచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా" అని అందరూ ఫిక్సయిపోతారు.
"పెళ్ళిచూపులు" తర్వాత దర్శకరత్న డా.దాసరి అభినందనలందుకొన్న చిత్రం "జయమ్ము నిశ్చయమ్ము రా". ఈ చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన వేయించుకొని వీక్షించిన దాసరి- దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి, కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డిలను ఇంటికి పిలిపించుకొని మరీ మీడియా సమక్షంలో వాళ్ళను అభినందించారు.
సినిమా మొదలైన పది నిమిషాల తర్వాత నుంచి సినిమాలో తనకు శ్రీనివాస్ రెడ్డి కనిపించడం మానేశాడని.. ఫస్టాఫ్ లో సర్వమంగళం, సెకండాఫ్ లో సర్వేష్ మాత్రమే కనిపించాడని దాసరి అన్నారు. రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ శివరాజ్ కనుమూరి- "జయమ్ము నిశ్చయమ్ము రా" చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతమని దర్శకరత్న కొనియాడారు. టాలీవుడ్ కు మరో మంచి దర్శకుడు దొరికినట్లేనని ఈ సందర్భంగా దాసరి అభిప్రాయపడ్డారు.
ఈ చిత్రం ద్వారా కృష్ణభగవాన్ కు మళ్ళీ మంచి గుర్తింపు వస్తుందని, పోసాని పోషించిన పంతులు పాత్ర తనకెంతగానో నచ్చిందని దాసరి పేర్కొన్నారు. హీరోహీరోయిన్ల పాత్రలతోపాటు- సినిమాలోని ప్రతి పాత్రను దర్శకుడు చూడముచ్చటగా తీర్చిదిద్దాడని దాసరి అన్నారు. ఇప్పటికే మంచి విజయం సాధిస్తున్న ఈ చిత్రం- మరింత పెద్ద విజయం సాధించాల్సిన అవసరం ఉందని దాసరి అన్నారు.
ఒక కమెడియన్ హీరోగా చేయడమనే ట్రెండ్ దాసరిగారితోనే మొదలైందని, ఘన విజయం సాధించిన దాసరి తొలి చిత్రం "తాత మనవడు" దర్శకుడిగా తనను ఎంతగానో ప్రభావితం చేసిన సినిమాల్లో ఒకటని దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి అన్నారు.
దాసరి వంటి లెజండరీ డైరెక్టర్ ప్రత్యేకంగా పిలిపించుకొని ప్రశంసించడం జీవితాంతం గుర్తుంచుకొంటానని కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
సంచలనానికి పర్యాయపదంగా చెప్పుకొనే దాసరి వంటి ఆల్ రౌండర్ "జయమ్ము నిశ్చయమ్ము రా" చిత్రాన్ని ప్రశంసించడం ఓ పెద్ద అవార్డులా భావిస్తున్నామని ఈ చిత్రాన్ని ఉభయ రాష్ట్రాల్లో విడుదల చేసిన ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి అన్నారు!