Social News XYZ     

Karthi’s Kaashmora movie audio launched

కార్తీ నటించిన 'కాష్మోరా' తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది
- ఆడియో ఫంక్షన్ లో ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి

Karthi's Kaashmora movie audio launched

యంగ్‌ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకాలపై గోకుల్‌ దర్శకత్వంలో పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'. ఈ సినిమా ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం అక్టోబర్ 7న జ‌రిగింది. వంశీ పైడిప‌ల్లి తొలి పాట‌ను, రెండో పాట‌ను శ్రీదివ్య విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను, ఆడియో సీడీల‌ను మాధ‌వ‌న్ ఆవిష్క‌రించారు.

వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ ఈ సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచే తెలుసు. ఊపిరి తీసే స‌మ‌యం నుంచే తెలుసు. సినిమా కోసం కార్తీ త‌న శ‌రీరాన్ని ఎంత క‌ష్ట‌పెట్టుకుంటాడో నాకు తెలుసు. ఇప్పుడు మ‌ణిర‌త్నంగారి సినిమాలోనూ చేస్తున్నాడు. ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పారు.
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ రెండున్న‌రేళ్ల నుంచి ఈ సినిమా మీదే దృష్టి పెట్టాం. ఈ సినిమా అవ‌కాశం ఇచ్చినందుకు నిర్మాత‌ల‌కు, కార్తీకి థాంక్స్ చెబుతున్నాను అని తెలిపారు.

 

శ్రీదివ్య మాట్లాడుతూ ఫోటోస్‌, ట్రైల‌ర్స్ చూసి ఎంత ఎక్స్ పెక్టేష‌న్స్ పెంచుకున్నా దానికి చేరుకుంటుంది సినిమా. కార్తీగారితో చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఆయ‌న చాలా హార్డ్ వ‌ర్క‌ర్‌. ఆయ‌న‌తో ప‌నిచేసిన క్ష‌ణాల‌ను ఎప్పుడూ మ‌ర్చిపోలేను. నా ఫేవ‌రేట్ ఆర్టిస్ట్ మాధ‌వ‌న్‌గారు. చిన్న‌ప్ప‌టి నుంచి స‌ఖి చూసేదాన్ని. ఆయ‌న స‌మ‌క్షంలో ఈ ఆడియో జ‌ర‌గ‌డం ఆనందంగా ఉంది అని తెలిపారు.

సినిమాటోగ్ర‌ఫ‌ర్ మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా వ‌చ్చింది అని అన్నారు.
శ‌శాంక్ మాట్లాడుతూ 50 శాతం న‌వ్వుతూనే ఉంటారు సినిమా చూసి. చాలా ఎంజాయ్ చేస్తారు. ట్రైల‌ర్‌లో చూసింది చాలా త‌క్కువే. అరుంధ‌తి, మ‌గ‌ధీర‌లాగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పారు.

ప్ర‌భు మాట్లాడుతూ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. తెలుగులో పీవీపీగారు చాలా ఎంక‌రేజ్ చేస్తున్నారు. మాలో కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ పెంచారు. ఆ క‌ష్టం దీపావ‌ళికి మీ ముందుకు వ‌స్తుంది. ఆనందిస్తార‌ని న‌మ్ముతున్నా అని అన్నారు.

పీవీపీ మాట్లాడుతూ మాధ‌వ‌న్‌గారు ఈ వేడుక‌కు రావ‌డం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం మూడేళ్లుగా క‌ష్ట‌ప‌డ్డాం. కాష్మోరా అనే టైటిల్ నాకు బాగా న‌చ్చింది. తెలుగులో ఇప్ప‌టికే బాగా ఆద‌ర‌ణ పొందిన టైటిల్‌. ఈ సినిమా కూడా ఆ సినిమా రేంజ్‌లోనే హిట్ అవుతుంద‌ని అనుకుంటున్నా. ఊపిరి త‌ర్వాత కంప్లీట్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది కార్తీకి అని చెప్పారు.

మాధ‌వ‌న్ మాట్లాడుతూ ట్రైల‌ర్‌, పోస్ట‌ర్ చూడ‌గానే ఎంత వైవిధ్యంగా ఉందో తెలుస్తుంది. లైఫ్‌, సోల్ పెట్టి ఇలాంటి సినిమాలు తీయాలి. మూడేళ్ల నుంచి సినిమా చేయ‌డ‌మంటే మామూలు విష‌యం కాదు. కొన్ని సినిమాలు టైమ్‌తో సంబంధం లేకుండా ప్యాష‌న్‌తో తీస్తారు. సూర్య పోస్ట‌ర్ చూపించారు. చూడ‌గానే మైండ్ బ్లాక్ అయింది. పీవీపీగారు బాలీవుడ్‌లోనూ సినిమాలు తీయాలి. కార్తీ మ‌ణిర‌త్నంగారితో సినిమా చేయ‌డం ఆనందించ‌ద‌గ్గ విష‌యం. ఈ సినిమా ఆడియో విడుద‌ల చేయ‌డానికి నేనంత‌ట నేనే వ‌స్తాన‌ని అన్నాను అని తెలిపారు.

కార్తీ మాట్లాడుతూ ఈ ఫంక్ష‌న్‌కి అన్న‌య్య సూర్య రాలేక‌పోయినా అన్న‌య్య క్లోజ్ ఫ్రెండ్ మాధ‌వ‌న్‌గారు రావ‌డం ఆనందంగా ఉంది. అన్న‌య్య‌, మాధ‌వ‌న్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్ద‌రూ చాలా విష‌యాల‌ను డిస్క‌స్ చేసుకుంటుంటారు. వంశీ పైడిప‌ల్లి నాకోసం ఈ వేడుక‌కు వ‌చ్చారు. పీవీపీ చాలా మంచి నిర్మాత‌. ట్రైల‌ర్ చూస్తేనే సినిమా ఎలా ఉంటుందో అర్థ‌మ‌వుతుంది. మ‌న‌సు పెట్టి చేశాను సినిమా. ముందు డైర‌క్ట‌ర్ ఒక పాత్ర చెప్పాడు. ఆ త‌ర్వాత రెండో పాత్ర‌, మూడో పాత్ర‌ల‌ను గురించి చెప్పాడు. అన్నీ అద్భుతంగా అనిపించాయి. క‌థ న‌చ్చింది. నిర్మాత కోసం అనుకుంటున్న స‌మ‌యంలో ప్ర‌భుని పిలిపించి చెప్పాను. చేయ‌డానికి ముందుకొచ్చాడు. ప్ర‌తి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుని చేస్తున్నాం. మేం ఎంత చేసినా బాహుబ‌లి ముందు మా సినిమా చిన్న కుక్క‌పిల్ల‌లా క‌నిపిస్తుంది. ప్ర‌భు ఎక్క‌డా వెన‌కాడ‌కుండా సెట్లు వేసి చేయించాడు. ఈ చిత్రంలో ల‌వ్‌, రొమాన్స్ కి చాన్స్ లేదు. శ్రీదివ్య చిన్న పిల్ల‌లాగా ఎగ్జ‌యిట్ అయి చేసింది. న‌య‌న‌తార మ‌హారాణి పాత్ర చేసింది. ఈ సినిమా కోసం గుర్రం రేసు కూడా నేర్చుకున్నా. గ్రాఫిక్స్ విజువ‌ల్స్ ను రాజ‌మౌళిగారి స్ఫూర్తితో చేశాం. దీపావ‌ళికి వ‌స్తుంది. మీ ఆద‌ర‌ణ పొంద‌డం ఖాయం అని తెలిపారు.

కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్‌, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్‌, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, ఆర్ట్‌: రాజీవన్‌, ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌, డాన్స్‌: రాజు సుందరం, బృంద, సతీష్‌, కాస్ట్యూమ్స్‌: నిఖార్‌ ధావన్‌, ఫైట్స్‌: అన్‌బారివ్‌, ప్రోస్తెటిక్స్‌: రోషన్‌, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: స్టాలిన్‌ శరవణన్‌, ఇజెనె, నిర్మాతలు: పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్‌.

Facebook Comments