Social News XYZ     

Director Sukumar released Dhanush’s Rail movie audio

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ చేతుల‌మీదుగా `రైల్‌` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

Director Sukumar released Dhanush's Rail movie audio

రఘువరన్‌ బి.టెక్‌, అనేకుడు, మాస్‌, మరియన్‌ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్ హీరోగా, నేను శైలజ ఫేం కీర్తి సురేష్‌ కథానాయికగా రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్ రైల్‌. ఆదిత్య మూవీ కార్పొరేషన్‌, శ్రీ పరమేశ్వరి రగ్న పిక్చర్స్‌ పతాకాలపై బేబి రోహిత రాజ్ఞ‌ సమర్పణలో ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రేమ‌ఖైదీ, గ‌జ‌రాజు చిత్రాల ద‌ర్శ‌కుడు ప్రభు సాల్మన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.సెప్టెంబర్‌ 16న సినిమా రిలీజ్ కానుంది. డి.ఇమామ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి రిలీజైంది. తొలి సీడీని ద‌ర్శ‌కుడు సుకుమార్ ఆవిష్క‌రించి చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్‌కి అందించారు. శ‌నివారం సాయంత్రం హైదరాబాద్‌లో జ‌రిగిన ఆడియో వేడుక‌లో ఎస్‌.వి.కృష్ణారెడ్డి, సి.క‌ళ్యాణ్‌, త‌మిళ వెర్ష‌న్ నిర్మాత త్యాగ‌రాజ‌న్‌, సుకుమార్‌, విక్ర‌మ్ ప్ర‌భు, బెల్లంకొండ సురేష్‌, క‌బాలి తెలుగు నిర్మాత కె.బి.చౌద‌రి, చంటి అడ్డాల‌, సంతోషం సురేష్ కొండేటి, సంగీత ద‌ర్శ‌కుడు డి.ఇమామ్‌, వెన్నెల‌కంటి, కీర్తి సురేష్‌, ఆర్‌.కె.గౌడ్‌, రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, నందు, హ‌రీష్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంత‌రం ..

ఎస్‌.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ -రైలు ప్ర‌యాణం ఇష్టం. మా ఊర‌న్నా ఇష్టం. ఊరెళ్లాలంటే రైల్‌లోనే వెళ్లాలి. అలా వెళ్ల‌డ‌మే ఇష్టం. గోదావ‌రి ఇష్టం. అందులో ఈత కొట్ట‌డం ఇష్టం. మా ఊరు కుర్రాళ్లు (ఆది, ఆదిత్య‌, వినోద్‌) ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వారికి సినిమా అంటే ఎంథుసియాసిజం. రైల్ టైటిల్ బావుంది. ఆ సౌండే బావుంటుంది. ఆ మూవ్‌మెంట్ బావుంటుంది. రైలుతో విప‌రీత‌మైన అటాచ్‌మెంట్ అందుకే. ఆ ఇష్టంతోనే ఎగిరే పావుర‌మా చిత్రాన్ని రైలు బ్యాక్‌డ్రాప్‌లో తీశాను. రైల్ బ్యాక్‌గ్రౌండ్ సినిమాల‌న్నీ హిట్టే. ఈ సినిమా కూడా ఆ కోవ‌లోనే హిట్ట‌వుతుంది. ధ‌నుష్ మ‌న ప‌క్కింట‌బ్బాయిలా ఉంటాడు. మా వూరి కుర్రాళ్ల ప్ర‌య‌త్నం స‌క్సెస‌వ్వాలి అన్నారు.

 

సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ -ట్రైల‌ర్స్ సూపర్భ్‌గా ఉన్నాయి. త్యాగ‌రాజ‌న్ ఏ సినిమా చేసినా క‌మిట్‌మెంట్‌తో చేస్తారు. ఈ సినిమా స్క్రిప్టు ద‌శ నుంచి తెలుసు. మంచి హిట్ సినిమా ఇది. ఈ రైల్ బుల్లెట్ ట్రెయిన్ కావాలి. ప్ర‌భుసాల్మ‌న్ చాలా డీటెయిల్డ్‌గా సినిమా తీసే ద‌ర్శ‌కుడు. అత‌డు బుక్‌స్టాల్ కాదు బ్రెయిన్ స్టాల్‌. ధ‌నుష్ గొప్ప క‌థానాయ‌కుడు. కీర్తి సురేష్ మ‌ల‌యాళ ఎంట్రీ సినిమా ప్ర‌మోష‌న్‌కి నేను వెళ్లాను. త‌ను చ‌క్క‌ని న‌టి. నిర్మాత‌లు మంచి సినిమాని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. బాగా డ‌బ్బులొచ్చే సినిమా ఇది. పెద్ద స‌క్సెస‌వ్వాలి అన్నారు.

సుకుమార్ మాట్లాడుతూ -నేను మంచి సినిమాలు చూడ‌ను. చూస్తే వాటినుంచి నేనూ తీయాల్సొస్తుంద‌ని. అయితే ఓ గ్రామీణ నేప‌థ్యం ఉన్న సినిమా తీయాల‌ని అనుకున్న‌ప్పుడు కొన్ని త‌మిళ చిత్రాలు చూశాను. అందులో మైనా సినిమా చూశాను. వాస్త‌వానికి మ‌ణిర‌త్నం స‌ర్ సినిమాలంటే ఇష్టం. కానీ ప్ర‌భు సాల్మ‌న్ సినిమాలు చూశాక బెస్ట్ స్క్రీన్‌రైట‌ర్ అనిపించింది. ఇండియ‌న్ సినిమా ప్ర‌పంచంలో వేరే ఏ సినిమాకి తీసిపోని సినిమా అని చెప్పాల‌నుంది. ఆ స్థాయి సినిమా తీశారు ప్ర‌భు. నిర్మాత త్యాగ‌రాజ‌న్ గురించి అంతా బాగా చెబుతున్నారు. ఇంత‌కుముందే త‌మిళ్‌లో కొన్ని మ్యూజిక‌ల్ హిట్ సాంగ్స్ విన్నా. ఆ మ్యూజిక్ కొట్టింది ఇమాన్ అనే విన్నా. పాట‌లు బావున్నాయి. తెలుగు నిర్మాత‌ల‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.

త‌మిళ వెర్ష‌న్ తొడ‌రి నిర్మాత త్యాగ‌రాజ‌న్ (స‌త్య‌జ్యోతి ఫిలింస్ అధినేత‌) మాట్లాడుతూ -బాషా సినిమా త‌ర్వాత చాలా కాలానికి తెలుగులో మా సంస్థ నుంచి సినిమా వ‌స్తోంది. నేను ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్‌కి అభిమానిని. మైనా, గుంకీ వంటి క్లాసిక్స్ న‌చ్చ‌డం వ‌ల్ల‌నే అత‌డితో ఈ సినిమా (తొడ‌రి) తీశాను. తెలుగులో రైల్ టైటిల్‌తో రిలీజ‌వుతోంది. స్క్రిప్టు న‌చ్చి ధ‌నుష్ ఈ సినిమా చేశారు. ప్ర‌భుసాల్మ‌న్ వ‌ర్కింగ్ స్టైల్ బావుంటుంది. ఇమాన్ సంగీతం పెద్ద ప్ల‌స్. తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత‌ల‌కు థాంక్స్‌ అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్‌ మాట్లాడుతూ-ప్రేమ‌ఖైదీ, గ‌జ‌రాజు చిత్రాల నుంచి తెలుగువారికి సుప‌రిచిత‌మే. సినిమాకి భాష లేదు. తెలుగు సినిమాలెన్నో చూస్తుంటాను. ధ‌నుష్ జ్వ‌రం వ‌ల్ల ఆడియో వేడుక‌కు రాలేక‌పోయారు. కీర్తి సురేష్ ఈ చిత్రంలో రైల్ ఎపిసోడ్స్‌లో రిస్కీ షాట్స్‌లో ఎంతో క‌ష్ట‌మైనా చేశారు. డిల్లీ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చే రైల్లో న‌డిచే క‌థ ఇది. ఇమామ్ రైల్ శ‌బ్ధాల్ని కాప్చుర్ చేసి సంగీతం అందించ‌డం గ్రేట్‌. అవ‌కాశం ఇచ్చిన త్యాగ‌రాజ‌న్ గారికి రుణ‌ప‌డి ఉంటాను అన్నారు.
నిర్మాతల్లో ఒక‌రైన ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ - భాషా సినిమా త‌ర్వాత స‌త్య‌జ్యోతి ఫిలింస్ త్యాగ‌రాజ‌న్‌గారు తెలుగు విడుద‌ల చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను న‌చ్చితే చూడ‌మ‌ని ఒక‌రికైనా చెప్పండి. న‌చ్చ‌క‌పోతే చూడొద్ద‌ని వంద‌మందికి చెప్పండి. సినిమా అంత బాగా వచ్చింది. . ఈనెల 16న సినిమా రిలీజ్ చేస్తున్నాం. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌ అన్నారు.

చంటి అడ్డాల మాట్లాడుతూ -ఏ రైలు అయినా ఏదో ఒక ప్లాట్‌ఫాం వ‌ద్ద స్టార్ట్ అవ్వాలి. ఈ నిర్మాత‌లు ఈ ప్లాట్‌ఫాంతో స‌క్సెసై మ‌రిన్ని సినిమాలు తీయాలి అన్నారు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ -రైలు ప్ర‌యాణం అంటే చాలా ఇష్టం. ఆద్యంతం ఆస్వాధిస్తూ ప్ర‌యాణించ‌డం నాకు అల‌వాటు. రైల్ ట్రైల‌ర్ అద్భుతంగా ఉంది. ర‌న్నింగ్ ట్రెయిన్‌పై అంత అద్భుత‌మైన విజువ‌ల్స్ తీయ‌డం గ్రేట్‌. సినిమా పెద్ద హిట్ట‌వ్వాలి అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ -అన్ని జ‌ర్నీల కంటే ట్రెయిన్ జ‌ర్నీ సేఫ్‌, సౌక‌ర్యం అని న‌మ్ముతాను. సికింద‌రాబాద్ నుంచి రైలెక్కి అమ్మా నాన్న‌ల్ని చూసేందుకు వెళ‌తాను. సినిమాల డిస్ట్రిబ్యూష‌న్ రంగం నుంచి వ‌చ్చిన నిర్మాత‌లు .. సేఫ్ ప్రాజెక్టుతో లాంచ్ అవుతున్నారు. ఆడియో రిలీజ్‌కి ముందే లాభాలార్జించిన సినిమా కూడా ఇది. పోటీలో కొనుక్కున్నారు. వ‌డ్డే రామానుజం వ‌ల్ల‌నే ఈ ప్రాజెక్టు వారికి ఓకే అయ్యింది. నేను శైల‌జ ఫేం కీర్తి సురేష్ హ‌త్తుకుపోయే పెర్ఫామ‌ర్‌. బాషా నిర్మాత‌లు త్యాగ‌రాజ‌న్ నిర్మించిన ఈ సినిమా తెలుగులోనూ పెద్ద విజ‌యం సాధిస్తుంది అన్నారు.

డి.ఇమాన్ మాట్లాడుతూ -మైనా, గుంకీ... ఈ వ‌రుస‌లోనే రైల్ సినిమాకి ప్ర‌భుగారితో క‌లిసి ప‌నిచేశాను. ఈ సినిమా మీ అంచ‌నాల్ని చేరుకునే సినిమా అన్నారు.

వెన్నెల కంటి మాట్లాడుతూ -బాషా నుంచి త్యాగ‌రాజ‌న్ గారితో అనుబంధం ఉంది. వారి సంస్థ‌లోని మొద‌టి సినిమా బాషాకి, రెండో తెలుగు సినిమా రైల్‌కి నేనే ర‌చ‌యిత‌ను. ఈ సినిమాలో సౌతిండియాలోనే బెస్ట్ లొకేష‌న్స్‌ని చూపించారు. ఇష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. ప్ర‌భుతో గ‌త సినిమాల‌కు ప‌నిచేశాను. పెద్ద విజయం సాధించే చిత్ర‌మిది అన్నారు.

ధనుష్‌, కీర్తి సురేష్‌, తంబి రామయ్య, కరుణాకరన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్‌, సినిమాటోగ్రఫీ: వెట్రివేల్‌ మహేంద్రన్‌, ఎడిటింగ్‌: ఎల్‌.వి.కె.దాస్‌, ఫైట్స్‌: స్టన్‌ శివ, మాటలు: వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, సాహితి, నిర్మాణ సారధ్యం: వడ్డి రామానుజం, సమర్పణ బేబి రోహిత రజ్న, నిర్మాతలు: ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి, దర్శకత్వం: ప్రభు సాల్మన్‌.

Facebook Comments