Social News XYZ     

Santosham South India Film awards 2016 announced

'14ఏళ్లుగా సింగిల్‌ హ్యాండ్‌గా ఫిలిం అవార్డ్స్‌ను ఇవ్వడం సురేష్‌కే సాధ్యమైంది'
దర్శకరత్న డా|| దాసరి నారాయణరావు

 

'సంతోషం' సినీ వారపత్రిక ఆగస్టు 2 పుట్టినరోజు సందర్భంగా అదే నెలలో 14 సంవత్సరాలుగా ఫిలిం అవార్డ్స్‌ను, కొన్నేళ్లుగా 'సౌత్‌ ఇండియన్‌ సంతోషం ఫిలిం అవార్డ్స్‌'ను నిర్వహిస్తూ వస్తున్నారు సంతోషం ఎడిటర్‌ అండ్‌ పబ్లిషర్‌ సురేష్‌ కొండేటి. పద్నాల్గవ సౌత్‌ ఇండియన్‌ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం ఆగస్టు 14వ తేదీన హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దర్శకరత్న డా|| దాసరి నారాయణరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'గతంలో ఫిలిం అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేది. ఇప్పుడు మర్చిపోయింది. ప్రైవేటు సంస్థలు ఆ బాధ్యతను చేపట్టి అవార్డులను ఇస్తున్నాయి. కానీ అవి కంటిన్యూ చేయలేకపోయాయి. కానీ సురేష్‌ కొండేటి ఎన్నో కష్టనష్టాలకోర్చి, ఒక్కడుగా 14 ఏళ్లపాటు ఈ అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నాడు. ఇది సాధారణ విషయం కాదు. తనది కార్పొరేట్‌ కంపెనీ కాదు. అయినా ఉత్తమ కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా నిర్వహిస్తున్నాడు. ఒక కళాకారునికి ఒక అవార్డు వచ్చిందంటే ఆ ఏడాది అతను చేసిన కృషికి గుర్తించి ఇచ్చిన అవార్డు. అటువంటి అవార్డును చూసుకుని ఆ కళాకారుడు ఎంతో ఆనందపడతాడు.

సంతోషం సురేష్‌ను చూస్తే నాకు ఆనందమేస్తుంది. ఈ సురేష్‌ను చూస్తే వీడా! ఇన్నేళ్లపాటు అవార్డులను నిర్వహిస్తున్నది? అనిపిస్తుంది. సురేష్‌ సినిమాపై ఇష్టంతో చిత్రరంగానికి వచ్చాడు. వచ్చి డాన్సర్‌ అయ్యాడు. అప్పట్లో నేను ప్రారంభించిన డాన్స్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొంది నా చేతుల మీదుగా అవార్డును కూడా అందుకున్నాడు. ఆ తర్వాత జర్నలిస్టు అయ్యాడు. సంతోషం పత్రికను స్టార్ట్‌ చేసి దానితోపాటు అవార్డులను కూడా స్టార్ట్‌ చేసి దిగ్విజయంగా 14 ఏళ్లు పూర్తి చేసిన సురేష్‌ని చూసి నేను గర్వపడతాను. ఎందుచేతంటే తను మా పాలకొల్లువాడే. సురేష్‌ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను' అన్నారు సభికుల హర్షధ్వనుల మధ్య.

 

ముందుగా ప్రసాద్‌ ల్యాబ్‌ అధినేత, నిర్మాత అక్కినేని రమేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ..'మా నాన్నగారి గురించి అందరికీ తెలుసు. ఎల్వీప్రసాద్‌గారు తన జీవితాన్నంతా సినిమాకే అంకితం చేశారు. నిర్మాతగా, దర్శకునిగా చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలను అందించారు. మేము కూడా ఆయన బాటలోనే నడుస్తున్నాం. అలాగే సురేష్‌ కొండేటిగారు 14 ఏళ్లుగా అవార్డులను ఇస్తూ చిత్ర పరిశ్రమకు తన సేవలను అందిస్తున్నారు. ఆయనను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను' అన్నారు.

ప్రఖ్యాత సీనియర్‌ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌ మాట్లాడుతూ.. 'సురేష్‌ కొండేటి చాలా పట్టుదలవాడు. అంతకుమించి సినిమా అంటే అతనికి విపరీతమైన ప్రేమ. అందుకే 14ఏళ్లుగా నిజాయితీగా, నిస్వార్థంగా ఎవరినీ ఏమీ ఆశించకుండా ఎంతో కష్టనష్టాలకోర్చి ఈ అవార్డుల వేడుకను విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. అతనిని నేను మనసారా అభినందిస్తున్నాను' అన్నారు.

ఫిలిం చాంబర్‌ అధ్యక్షులు, అగ్ర నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ.. 'సురేష్‌ కొండేటి అంటే నాకు చాలా ఇష్టం. అతనిని అభినందించకుండా ఉండలేను. జర్నలిస్టుగా, సంతోషం పత్రిక అధిపతిగా విజయవంతమైన సురేష్‌ అనంతర కాలంలో నిర్మాతగా ఉత్తమ చిత్రాలను అందించి ఉత్తమ నిర్మాత అనిపించుకున్నారు. పంపిణీదారునిగా మారి కొన్ని మంచి చిత్రాలను కూడా పంపిణీ చేశారు. చిత్రరంగంలో ఇన్ని విధాలుగా ఎదిగిన సురేష్‌ ఇండస్ట్రీలో ఎవరూ చేయని విధంగా 14 ఏళ్లుగా అవార్డులు అందిస్తూ ఒక రికార్డును సృష్టించాడు. అందుకే మా సురేష్‌ ఎంతయినా అభినందనీయుడు' అన్నారు.

తెలుగు, తమిళ చిత్రాల ప్రఖ్యాత నిర్మాత ఎడిటర్‌ మోహన్‌'డా|| డి.రామానాయుడు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సురేష్‌ చిత్ర పరిశ్రమకు ఇంత సేవ చేస్తూ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. నిజంగా ఆయనను సత్కరించాలి. ఈ విధంగా ఎందరో కళాకారులకు మరపురాని అవార్డులనిస్తూ తన సేవలను అందిస్తున్నారు. సురేష్‌ను అభినందిస్తున్నాను' అన్నారు.

రుద్రమదేవికి 85 కోట్లు ఇచ్చి ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు : ఉత్తమ దర్శకుడు గుణశేఖర్‌, దర్శకరత్న డా|| దాసరి నుండి అవార్డును అందుకున్న అనంతరం మాట్లాడుతూ.. 'ముందుగా 14 ఏళ్లుగా అవార్డుల ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్న సురేష్‌ కొండేటికి అభినందనలు. ఆయనను ఎంతయినా ప్రోత్సహించాలి. రుద్రమదేవి విషయానికి వస్తే ఈ చిత్రానికి 85 కోట్లు ఇవ్వడమేగాక, ఎన్నో అవార్డులు ఇప్పించింది. ఈ అవార్డును దర్శకరత్న డా|| దాసరి గారి నుండి తీసుకోవడం ఆనందంగా ఉంది. అలాగే ఈ సందర్భంలో అనుష్క, అల్లు అర్జున్‌, రానాలకు ప్రత్యేకమైన అభినందనలు' అన్నారు. బెస్ట్‌ సపోర్టింగ్‌ ఆర్టిస్టుగా (శ్రీమంతుడు చిత్రానికి) అవార్డునందుకున్న డా|| రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ..' 39 ఏళ్లుగా నన్ను అభిమానిస్తున్న మీకు కృతజ్ఞతలు. ఆ నలుగురు చిత్రాన్ని నాలుగు సార్లు చూశాను అన్నారు మురళీమోహన్‌. అదిగో ఆ కోవలోనే శ్రీమంతుడు, సన్నాఫ్‌ సత్యమూర్తి, జులాయి వంటి చిత్రాలు ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోతాయి. ఒక కళాకారునికి అవార్డు వస్తే ఆ కళాకారుడు ఎంతో ఉప్పొంగిపోతాడు ఇంకా ఉత్సాహంతో ముందుకు వెళతాడు. సురేష్‌ కొండేటి ఏటేటా, పద్నాలుగేళ్లుగా ఇంత మంది కళాకారులను అవార్డులతో ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. నిజంగా అతనిని అభినందించితీరాలి. ఇంకా మీ జనరేషన్‌లో కలిసిపోయి ముందుముందు మరిన్ని చిత్రాలు చేస్తాను. ఈ అవార్డు శ్రీమంతుడు చిత్రం ద్వారా రావటం సంతోషంగా ఉంది. మహేష్‌బాబు పెద్ద హీరో నటించగా, చక్కని కమర్షియల్‌ చిత్రంగా రూపొంది.. ఒక మంచిపాయింట్‌తో కొరటాల శివ రూపొందించిన శ్రీమంతుడు ఎంతో ప్రయోజనాత్మకమైన చిత్రం' అన్నారు.

ఏడిద నాగేశ్వరరావు స్మారక అవార్డుకు ఎన్నికైన ప్రసిద్ద కె.ఎస్‌.రామారావుకు బదులుగా ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి అందుకున్నారు. ఈ సందర్భంగా రవిరాజా మాట్లాడుతూ.. 'నాకిప్పుడు మూడు విధాలుగా సంతోషంగా ఉంది. ఏడిద నాగేశ్వరరావు వంటి ఓ గొప్ప నిర్మాత స్మారక అవార్డును కొన్ని కారణాల వల్ల రాలేకపోయిన కె.ఎస్‌.రామారావుకు బదులుగా నేను అదుకోవటం అదృష్టంగా భావిస్తున్నాను. కె.ఎస్‌.రామారావు గారితో నాకెంతో అనుబంధముంది. ఆయన డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ ప్రొడ్యూసర్‌. రామారావు గారి బ్యానరులో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ముత్యమంతముగ్గు, పుణ్యస్త్రీ వంటి చిత్రాలు చేశాను' అన్నారు.

అల్లు రామలింగయ్య స్మారక అవార్డును ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ద్వారా అందుకున్న ప్రముఖ నటుడు పృధ్వీ మాట్లాడుతూ... ''క్రమశిక్షణకు మారుపేరు నటనకు పెద్దబాలశిక్ష వంటి నటుడు అయిన అల్లు రామలింగయ్య గారి అవార్డును నేను అందుకోవటం, అదీ గురుతుల్యులు దాసరి నారాయణరావుగారి సమక్షంలో అల్లు అరవింద్‌గారి చేతుల మీదుగా అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. రామలింగయ్య గారు నటన ప్రవహించే గంగా ప్రవాహం ఆయన'' అన్నారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సురేష్‌ కొండేటికి తన శుభాకాంక్షలను అందజేస్తూ ... 'సురేష్‌కొండేటి 14 ఏళ్లుగా ఎవరూ చేయని విధంగా అవార్డులను నిర్వహిస్తూ అందులో అల్లు రామలింగయ్య గారి పేరిట స్మారక అవార్డులను అందజేస్తూ వస్తున్నాడు. ఈ సందర్భంగా సురేష్‌ను మనసారా అభినందిస్తున్నాను. ఒక వ్యక్తిగా 14 ఏళ్లపాటు ఇలా శ్రమిస్తుండటం సాధారణ విషయం కాదు. ఇలాగే లాంగ్‌టైమ్‌ తను నిర్వహిస్తుండాలని కోరుకుంటున్నాను' అన్నారు.

మొదటి చిత్రం దర్శకునిగా సంచలన దర్శకుడు కొరటాల శివ నుండి అవార్డునందుకున్న అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. 'పటాస్‌ చిత్రం చూసి నన్ను అభినందించిన దర్శకరత్న డా|| దాసరి నారాయణరావు గారికి కృతజ్ఞతలు. అలాగే ఆ చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్‌ గారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా నిర్మాతకు దర్శకునిపై నమ్మకముండాలి. అలా నాపై ఎంతో నమ్మకముంచారు కల్యాణ్‌రామ్‌. మొదటి చిత్రం దర్శకునికి రెండో చిత్రం పరీక్షలాంటిదంటారు. అటువంటి ద్వితీయ విఘ్నాన్ని కూడా విజయవంతంగా దాటిన కొరటాల శివగారి నుండి ఈ వార్డునందుకోవటం సంతోషంగా ఉంది' అన్నారు. మొదటి చిత్రం హీరోయిన్‌ హెబ్బాపటేల్‌(కుమారి 21ఎఫ్‌) మాట్లాడుతూ.. ఈ సంతోషం అవార్డు నా సినిమా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈసందర్భంలో కుమారి 21 ఎఫ్‌ చిత్ర దర్శకులు సూర్యప్రతాప్‌గారికి, ముఖ్యంగా సుకుమార్‌గారికి, నిర్మాతలకు కృతజ్ఞతలు' అన్నారు.

శ్రీమంతుడు చిత్రం ద్వారా ఉత్తమ దర్శకునిగా ఎన్నికైన సంచలనాత్మక దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతుండగా ఫంక్షన్‌ లోని ఆడియన్స్‌ జనతాగ్యారేజ్‌ చిత్రం గురించి చెప్పమని అడిగారు. దాంతో కొరటాల శివ మాట్లాడుతూ.. 'జనతా గ్యారేజ్‌' చిత్రం ఆడియో ఘన విజయం సాధించింది. సినిమా త్వరలో విడుదలవుతోంది' అని చెప్పి ఇన్నేళ్లుగా అవార్డులను అందజేస్తూ వస్తున్న సురేష్‌ కొండేటిని అభినందిస్తున్నాను' అన్నారు.

ఉత్తమ సంగీత దర్శకుని అవార్డును సుప్రసిద్ధ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ దర్శకరత్న నుండి అందుకుంటుండగా ప్రేక్షకులు 'కుమారి 21ఎఫ్‌' చిత్రంలోని బ్యాంగ్‌ బ్యాంగ్‌' పాట పాడమని అడుగగా దేవిశ్రీ ఆ పాటను పాడి హర్షధ్వనులందుకున్నారు. అనంతరం దేవిశ్రీ మాట్లాడుతూ.. 'కుమారి 21ఎఫ్‌ హెబ్బాను ఒక ఫంక్షన్‌లో ముందు చూసి 'హబ్బా' అనుకున్నాను. ఈ సినిమాలో హెబ్బా అద్భుతంగా చేసింది. అలాగే డైరెక్టర్‌ సూర్యప్రతాప్‌ బ్రహ్మాండంగా డైరెక్ట్‌చేశాడు' అన్నారు.

లైఫ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డునందుకున్న తాళ్లూరి రామేశ్వరి మాట్లాడుతూ.. 'ముందుగా దాసరి నారాయణరావుగారికి కృతజ్ఞతలు. నన్ను గుర్తించి నన్నీ అవార్డుకు ఎన్నుకున్న సురేష్‌ కొండేటికి అభినందనలు. మీకు లైఫ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డునిస్తున్నాం అన్నారు. నేను ఏం సాధించానా అని ఆలోచనలో పడ్డాను. చిత్ర రంగంలో 42 ఏళ్ల ప్రయాణం. ఒకనాడు తిరుపతిలో ఒక సినిమా షూటింగ్‌ను చూసి ఆర్టిస్టు నవ్వాలనుకున్నాను. ముందు హిందీ సినిమాలో నటించాను. సీతామహాలక్ష్మి చిత్రం ద్వారా తెలుగుకు ప్రవేశించాను. సురేష్‌గారు కలకాలం ఇలాంటి ఫంక్షన్‌లు చేస్తుండాలి' అన్నారు.

జీవన సాఫల్య అవార్డునందుకున్న సుప్రసిద్ధ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల ప్రముఖ నటి అందాల జయప్రద మాట్లాడుతూ.. ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం. నేను తిలక్‌ గారి 'మాభూమి' చిత్రం ద్వారా చిత్రరంగానికి వచ్చాను. రాజమండ్రిలో పుట్టిపెరిగాను. మాటలు రాని, నటన రాని నన్ను గురువుగారు దాసరి గారు నటిగా తీర్చిదిద్దారు. రెండో చిత్రం దేవుడే దిగివస్తే చిత్రాన్ని ఆయన దర్శకత్వంలో చేశాను. అనంతరం గురువుగారి దర్శకత్వంలో మేఘసందేశం వంటి ఎన్నో ఉత్తమ చిత్రాలతోపాటు మొత్తం 24 చిత్రాలలో నటించాను! నా సినీ జీవితానికి మరో మంచి గుర్తింపు లాంటిది ఈ సంతోషం అవార్డు. నువ్వు ఇండస్ట్రీలోనే ఉండు అని చెప్పే అవార్డుగా ఈ అవార్డును భావిస్తున్నాను' అన్నారు.

అక్కినేని నాగేశ్వరరావు స్మారక అవార్డును అందుకున్న ప్రఖ్యాత నటులు మురళీమోహన్‌ మాట్లాడుతూ... 'నటునిగా నాకు 43 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంలో గురువుగారికి నమస్కారాలు. నేనీ రోజున ఇలా ఉన్నానంటే గురువుగారి చలవే. నాకు చిన్నప్పట్నుంచీ అక్కినేని నాగేశ్వరరావుగారంటే అభిమానం. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానరుపై అక్కినేని నాగేశ్వరరావు, గురువుగారి దర్శకత్వంలో నిర్మించిన అద్భుతమైన సంచలన చిత్రం ప్రేమాభిషేకంలో కూడా నటించాను అన్నపూర్ణ వారి కళ్యాణి'లోనూ నటించాను. 14 ఏళ్లపాటు అవార్డులు ఇవ్వటమనే అసాధ్యమైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్న సురేష్‌ కొండేటికి ధన్యవాదాలు' అన్నారు.

బెస్ట్‌ విలన్‌గా 'బాహుబలి' చిత్రానికి మెమోంటోను అందుకున్న దగ్గుపాటి రానా మాట్లాడుతూ.. 'సంతోషం సురేష్‌ గారికి ముందుగా అభినందనలు. పౌరాణికం లేదా జానపదం లేదా చారిత్రాత్మక చిత్రాల్లో నటించాలన్న నా కోరిక బాహుబలి చిత్రం ద్వారా రాజమౌళి గారు, రుద్రమదేవి చిత్రం ద్వారా గుణశేఖర్‌గారు తీర్చారు. వీరిద్దరికీ రుణపడి ఉంటాను. ఈ రోజున ఎక్కడకు వెళ్లినా భల్లాలదేవ అనిపిలుస్తున్నారు' అన్నారు.

సంతోషం లైఫ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డును ప్రఖ్యాత నటులు, నిర్మాత, జయభేరి అధినేత మురళీమోహన్‌ నుండి అందుకున్న సీనియర్‌ నటులు గిరిబాబు తన ఆనందాన్ని తెలుపుతూ.. 'ఈ సంతోషం అవార్డును అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. 1973లో నేను, మిత్రుడు మురళీమోహన్‌ 'జగమేమాయ' చిత్రం ద్వారా చిత్రసీమకు ఎంటర్‌ అయ్యాం. ఈ రోజున ఈ అవార్డును మిత్రుడు మురళీమోహన్‌ ద్వారా అందుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. చిత్రరంగంలో 43 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. అయితే ఇంకా నటిస్తాను. కళాకారునికి తృప్తి అంటూ ఉండదు. చిత్ర పరిశ్రమే నాకు అన్నంపెట్టింది, కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టింది. నేను కళాకారునైనందుకు గర్విస్తున్నాను' అన్నారు.

మొదటి చిత్రం హీరోగా సంతోషం అవార్డునందుకున్న అక్కినేని అఖిల్‌ మాట్లాడుతూ.. 'ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. నా మొదటి చిత్రానికే ఈ అవార్డునందుకోవటం మర్చిపోలేనిది. సురేష్‌ కొండేటిగారికి చాలా థ్యాంక్స్‌' అన్నారు. ప్రముఖ నటులు కాదంబరి కిరణ్‌ సంతోషం అధినేత సురేష్‌ కొండేటిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను' అన్నారు.

. యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ మాట్లాడుతూ.. 'విడువకుండా ప్రతీ ఏటా ఇంత గ్రాండ్‌గా అవార్డుల ఫంక్షన్‌ను నిర్వహిస్తున్న సంతోషం సురేష్‌ కొండేటి గారిని అభినందిస్తున్నాను. సురేష్‌ గారు ముందు ముందు కూడా ఇలాగే ఈ అవార్డు ఫంక్షన్‌ను నిర్వహించాలని కోరుకుంటూ, సురేష్‌ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను' అన్నారు.

తమిళ రంగంలో బెస్ట్‌డెబ్యూ డైరెక్టర్‌గా ఎన్నికైన పినిశెట్టి సత్యప్రభాస్‌ మాట్లాడుతూ.. 'నేను అందుకుంటున్న మొదటి అవార్డు ఇది. ఈ సంతోషం అవార్డును ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సందర్భంగా సురేష్‌ కొండేటి గారికి ధన్యవాదాలు' అన్నారు.

తమిళరంగంలో ఉత్తమ దర్శకుడిగా ఎన్నికైన తెలుగు, తమిళ చిత్రాల అగ్ర నిర్మాత ఎడిటర్‌ మోహన్‌ పెద్దకుమారుడు రాజా మాట్లాడుతూ.. 'సురేష్‌ కొండేటిగారు సంతోషం పత్రికను విజయవంతంగా నడుపుతూనే, 14 ఏళ్లుగా ఫిలిం అవార్డులను అందునా సౌతిండియన్‌ ఫిలిం అవార్డులను నిర్వహిస్తుండటం అనితరసాధ్యమైన విషయం. త్వరలోనే తెలుగులో సినిమా చేస్తాను. నాన్నగారు ఆ ప్రయత్నాలలో ఉన్నారు' అన్నారు.

అవార్డుల వివరాలు :

ఉత్తమ నటుడు : ప్రభాస్‌(బాహుబలి),

ఉత్తమ నటి : అనుష్క (రుద్రమదేవి)

ఉత్తమ చిత్రం : రుద్రమదేవి (శ్రీమతి రాగిణి గుణ, నీలిమ గుణ, యుక్తాముఖి)

ఉత్తమ దర్శకుడు : కొరటాల శివ (శ్రీమంతుడు)

ఉత్తమ నిర్మాత : శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని(బాహుబలి)

ఉత్తమ సహాయ నటుడు : డా|| రాజేంద్రప్రసాద్‌(శ్రీమంతుడు)

ఉత్తమ సంగీత దర్శకుడు : దేవిశ్రీప్రసాద్‌(శ్రీమంతుడు) సన్నాఫ్‌ సత్యమూర్తి

ఉత్తమ సంగీత నటి : హేమ(కుమారి 21ఎఫ్‌)

ఉత్తమ విలన్‌ : రానా (బాహుబలి)

ఉత్తమ గాయని : గీతామాధురి(బాహుబలి)

ఉత్తమ గీతా రచయిత : సీతారామశాస్త్రి(కంచె)

ఉత్తమ కొరియోగ్రాఫర్‌ : ప్రేమ్‌రక్షిత్‌ (బాహుబలి)

బెస్ట్‌ డెబ్యూ హీరో : అఖిల్‌

బెస్ట్‌ డెబ్యూ హీరోయిన్‌ : హెబ్బాపటేల్‌(అలా ఎలా?/ కుమారి 21ఎఫ్‌)

బెస్ట్‌ ఎడిటర్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు(బాహుబలి, శ్రీమంతుడు)

బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్‌ : అనిల్‌ రావిపూడి(పటాస్‌)

బెస్ట్‌ ఫొటోగ్రాఫర్‌ : టాటా మల్లేశ్‌(బాహుబలి)

ఎఎన్‌ఆర్‌ స్మారక అవార్డు : మురళీమోహన్‌

అల్లు స్మారక అవార్డు : పృధ్వీ

25ఏళ్లు పూర్తి చేసుకున్న నటి : మాలాశ్రీ (తెలుగు అండ్‌ కన్నడ)

ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ ఆఫ్‌ ఇండియా : జయప్రద

డాక్టర్‌ డి.రామానాయుడు స్మారక అవార్డు : ఎడిటర్‌ మోహన్‌

తమిళం

హీరో శివకార్తికేయన్‌ : రజనీమురుగన్‌

హీరోయిన్‌ హన్సిక : రోమియో- జాలియట్‌

డైరెక్టర్‌ మోహన్‌రాజ్‌ : తని ఒరువన్‌

మొదటి చిత్రం దర్శకుడు ప్రకాష్‌

నిక్కీ గల్రానీ (డార్లింగ్‌) హీరోయిన్‌

రోబో శంకర్‌(బెస్ట్‌ కమెడియన్‌) : మారి

అరుణ్‌ విజయ్‌ (బెస్ట్‌ విలన్‌) : ఎన్నై అరిందాన్‌

పార్తిబన్‌(నానున్‌ రౌడీదాన్‌) : బెస్ట్‌ సంతోషం అవార్డు

మానస (బెస్ట్‌ మొదటి చిత్రం హీరోయిన్‌ కన్నడ) : మృగశిర

బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్‌ సత్యప్రభాస్‌ పినిశెట్టి (తమిళ)

Facebook Comments