వైశాఖం` హీరో హరీష్ బర్త్‌డే ప్రెస్‌మీట్
'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' వంటి హిట్ చిత్రాల తర్వాతలేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో 'సూపర్‌హిట్' అధినేత బి.ఎ.రాజు, ఆర్.జె. సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'వైశాఖం'. హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రకరణ తుది దశకు చేరుకుంది. ఈ చిత్ర హీరో హరీష్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా బుధవారం చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.....
దర్శకురాలు జయ బి. మాట్లాడుతూ - ''హీరో హరీష్ చాలా నేచురల్ పెర్‌ఫార్మర్. ఈ మధ్యకాలంలో ఇలాంటి నేచురల్ పెర్‌ఫార్మర్‌ను నేను చూడలేదు. అలాంటి హీరోను తెలుగు ఇండస్ట్రీకి నేను పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సెంటిమెంట్, ఎమోషన్స్‌ను అన్నింటినీ చక్కగా పండించగల నటుడు. సీనియర్ నటులతో సమానంగా కలిసి నటించాడు. ఈ సినిమా నాకు చాలా దగ్గరైన సినిమా అలాగే కష్టపెట్టిన సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్ బేస్‌డ్‌మూవీ. ప్రతి ఒక ఆర్టిస్ట్ బాగా సపోర్ట్ చేశారు. ఒక కొత్త కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా తీస్తున్న 'వైశాఖం' చిత్రం దర్శకురాలిగా నాకు ఓ ఛాలెంజ్. హీరోహీరోయిన్స్‌తో పాటు అన్ని క్యారెక్టర్స్‌కూ ఇంపార్టెన్స్ వున్నచిత్రమిది'' అన్నారు.
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''యూత్‌ని, ఫ్యామిలీస్‌ని విశేషంగా ఆకట్టుకునే అంశాలతో తీస్తున్న 'వైశాఖం' 2016లో ఓ సూపర్ డూపర్ హిట్ గ్యారంటీ. ఈ సినిమాలో అన్నీ సూపర్‌గా వచ్చాయి. కథకు పూర్తి న్యాయం జరిగిలే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవకుండా హై బడ్జెట్‌లో 'వైశాఖం' చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మంచి చిత్రాల్ని ఆదరించే ప్రేక్షకులకు తప్పకుండా 'వైశాఖం' బాగా నచ్చుతుంది. మా ఆర్.జె. సినిమాస్ బేనర్‌లో 'లవ్‌లీ' కంటే పెద్ద హిట్ అవుతుంది ఈ 'వైశాఖం'. ఆగస్ట్, సెప్టెంబర్‌లో జరిగే షెడ్యూల్స్‌తో సినిమా పూర్తవుతుంది. అలాగే హీరో హరీష్ మా బ్యానర్‌లో తన రెండో సినిమా చేస్తున్నాడు. సాయికుమార్‌గారు ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు. ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నిషియన్ బాగా సపోర్ట్ చేశారు. సుబ్బారావుగారు కొత్త కెెమెరా టెక్నాలజీతో సినిమాను తెరకెక్కించారు'' అన్నారు.
సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి వెంకటసుబ్బారావు మాట్లాడుతూ ''సినిమా చాలా బాగా వస్తుంది. యూనిట్‌లో మేం చేసే చిన్న చిన్న తప్పుల్ని జయగారు మెనేజ్ చేస్తూ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. ఈ చిత్రంలో స్పైడర్ క్యామ్‌ను ఉపయోగిస్తున్నాం. దీన్ని ఇంకాస్తా డెవలప్ చేసి హాలీవుడ్‌లో ఒకటో రెండు సినిమాలు ఉపయోగించిన రీతిలో ఈ సినిమాలో వాడుతున్నాం. లవ్, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్నీ కలిసిందే వైశాఖం'' అన్నారు.
హీరో హరీష్ మాట్లాడుతూ ''ఈ యూనిట్‌తో కలిసి పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని నన్ను జయ మేడమ్, రాజుగారు హీరోను చేశారు. ఇదే బ్యానర్‌లో నా రెండో మూవీని చేస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను'' అన్నారు.
ఈ కార్యక్రమంలో కాశీవిశ్వనాథ్, గుండు సుదర్శన్, జబర్‌దస్త్ శేషు, అప్పారావు, భద్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో హీరో పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కూడా చేశారు.