"పిడికెడు మెతుకుల కోసం పొట్ట చేతబట్టుకుని గల్ఫ్ కి వెళ్తున్న వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి? దూరపు కొండలు నునుపు అనే సామెతను మరిచిపోయి కన్నవారికి, కట్టుకున్నవాళ్లకి దూరంగా బతకాలనుకునే వారు గల్ఫ్‌లో జీవితాన్ని సుఖంగా గడుపుతున్నారా? భారంగా గడుపుతున్నారా? అలాంటి వారి వ్యథలతో మలచుకున్న కథే గల్ఫ్
. ముళ్ల మధ్య గులాబీలు అందంగా వికసించినట్టు వ్యథలే కథగా మిగిలినా అందులోనూ ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను చూపిస్తున్నాం" అని అంటున్నారు సునీల్‌కుమార్ రెడ్డి. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం గల్ప్
. యెక్కలి రవీంద్రబాబు, రమణీకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ " సమాజంలోని కొన్ని కోణాలను సూటిగా ప్రశ్నిస్తూ వెండితెరపై సినిమాలుగా ఆవిష్కరించడం మా దర్శకుడి ప్రత్యేకత. ఇసుక తీరాల్లో మనవారు పడుతున్న కష్టాలను కళ్ల ముందు సాక్షాత్కరింపజేయడానికి ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం గల్ప్
. గదిలో కూర్చుని కథను రాసి సినిమాకు నాంది పలకడం సునీల్‌కుమార్ రెడ్డి తత్వం కాదు. సమస్య మూలాల్లోకి వెళ్లి, బాధితులతో కలిసి సంభాషించి, ఆవేదనను ఆకళింపు చేసుకుని అక్షరాలుగా మార్చడం ఆయన ప్రత్యేకత. అలాంటి కృషినే గల్ప్
చిత్రం కోసం కూడా చేశారాయన. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షెడ్యూల్ చేస్తున్నాం" అని అన్నారు.
సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ "ఇప్పటికీ ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటల చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కాలనీ సెట్‌లో చిత్రీకరణ సాగుతోంది. జులై 19న మొదలైన ఈ షెడ్యూల్లో రోజులు మారాయి
ఫేమ్ చేతన్ మద్దినేని, సంతోష్ పవన్, అనిల్ కల్యాణ్, ఎల్బీ శ్రీరామ్, బిత్తిరి సత్తి, సముద్రం
వెంకటేశ్ తదితరులు పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఆగస్టు నెలాఖరుతో చిత్రీకరణను పూర్తి చేసి సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సరిహద్దు దాటిన ప్రేమకథ
అనే ఉపశీర్షికను పెట్టాం. నాలుగు పాటలున్నాయి. ఆశల రెక్కలు కట్టుకుని
అనే పాటకు ఇప్పటికే సోషల్ మీడియాలో 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటేనే చిత్రానికి ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు" అని చెప్పారు.
ఈ చిత్రంలో డింపుల్ కథానాయిక. పోసాని కృష్ణమురళి, నల్లవేణు, తోటపల్లి మధు, నాగినీడు, తీర్థ, దిగ్విజయ్, పూజిత, పింగ్ పాంగ్, పద్మశ్రీ, జీవా, సూర్య, శివ, ఎఫ్ ఎమ్ బాబాయ్, భద్రం, సోనమ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, డ్యాన్సులు: అజయ్, కెమెరా: ఎస్.వి.శివరామ్, పాటలు: సిరాశ్రీ, మాస్టర్జీ, కాసర్ల శ్యామ్, ఆర్ట్: నాగు, సహ నిర్మాతలు: డాక్టర్ ఎల్.ఎన్.రావ్, రాజాజీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాపిరాజు, మాటలు: పులగం చిన్నారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాతలు: యెక్కలి రవీంద్రబాబు, రమణీ కుమార్.
This website uses cookies.