Friend request team ends hunger stike

నిరాహార దీక్షను విరమించిన 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' టీమ్‌

హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో మోడరన్‌ సినిమా పతాకంపై కొత్త హీరో, హీరోయిన్లతో విజయ్‌వర్మ పాకలపాటి సహనిర్మాతగా నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'. రిలీజ్‌ విషయంలో ఈ చిత్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా గత నాలుగు రోజులుగా చిత్ర యూనిట్‌ చేస్తున్న నిరాహార దీక్షను సోమవారం విరమించారు. కొంతమంది సినీ ప్రముఖుల జోక్యంతో ఈ చిత్రానికి కొన్ని థియేటర్లు కేటాయించడం, మల్టీప్లెక్స్‌లలో మరిన్ని షోలు వేసేందుకు మార్గం సుగమం కావడంతో నిరాహార దీక్షను విరమించారు. సోమవారం హైదరాబాద్‌ సిటీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డా|| రాజేంద్రప్రసాద్‌ చిత్ర యూనిట్‌కు నిమ్మరసం తాగించి దీక్షను విరమింప జేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌ ఛైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్‌ అసొసియేషన్‌ ప్రెసిడెంట్‌ నాగరాజు, ఎమ్మెల్యే గోవర్థన్‌రెడ్డి, కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి, భారత్‌ ఎక్తా ఆందోళన్‌ నేషనల్‌ కన్వీనర్‌ మల్లు రమేష్‌, ఇంకా పలువురు నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ - ''ఒక చిన్న చిత్రానికి థియేటర్లు దొరక్క ఇలా నిరాహార దీక్ష చేయడం బాధాకరం. ఈ విషయంలో ముందుగానే సినీ పెద్దలు జోక్యం చేసుకొని వుంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. నిరాహార దీక్ష ప్రారంభించిన తర్వాత కొందరి ప్రయత్నం వల్ల కొన్ని థియేటర్లు దొరికాయని చెప్పారు. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా వుండాలని కోరుకుంటున్నాను. శాశ్వత పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను'' అన్నారు.

డా|| రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ - ''రిలీజ్‌ రోజు సిటీలో కేవలం ఒక్క థియేటర్‌లో రెండు షోలు మాత్రమే ఈ చిత్రానికి ఇవ్వడం అన్యాయం. ఇప్పుడు నాలుగైదు థియేటర్స్‌లో ఈ సినిమా 80 శాతం కలెక్షన్స్‌తో రన్‌ అవుతోందని తెలిసింది. ఇప్పుడు మరికొన్ని థియేటర్స్‌లో ఈ సినిమా రిలీజ్‌ అవుతోంది. సినిమాకి టాక్‌ కూడా బాగుందని తెలుస్తోంది. ఈమధ్యకాలంలో బిచ్చగాడు చిత్రం కూడా స్లోగా థియేటర్లు పెంచుకుంటూ పెద్ద హిట్‌ అయింది. ఈ 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' చిత్రం కూడా అంత పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. థియేటర్లు దొరక్క పోవడం అనేది ఈ ఒక్క సినిమాకే కాదు. చాలా సినిమాల విషయంలో ఇలా జరుగుతోంది. దీనికి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నాం. నాతోపాటు మరో నలుగురితో ఓ కమిటీ వేసి ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఆదిత్య ఓం, విజయ్‌వర్మ ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా పెద్ద హిట్‌ అయి వారికి, యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ప్రతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ - ''ఆదిత్య ఓం, విజయ్‌వర్మ నాకు మంచి మిత్రులు. వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి నిర్మించిన 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' చిత్రానికి థియేటర్లు దొరక్కపోవడంతో దీక్షను మొదలు పెట్టారు. ఈ సమస్య పరిష్కారానికి నా వంతు కృషి చేసి కొన్ని థియేటర్లు ఇప్పించగలిగాను. రేపటి నుంచి మరికొన్ని థియేటర్లు పెరిగే అవకాశం వుంది. మన మేయర్‌ రామ్మోహన్‌గారు ముఖ్యమంత్రి కెసీఆర్‌గారికి అత్యంత సన్నిహితులు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పడం చాలా సంతోషం'' అన్నారు.

దర్శకుడు ఆదిత్య ఓం మాట్లాడుతూ - ''ఎంతో కష్టపడి చేసిన మా సినిమాను రిలీజ్‌ చేసుకోవడానికి కూడా కష్టాలు పడాల్సి వచ్చింది. థియేటర్ల విషయంలో జరిగిన అన్యాయానికి నిరసన తెలియజేస్తూ మేం ఈ నిరాహార దీక్షను చేశాం. తోటి నిర్మాతలు, దర్శకులు మమ్మల్ని ఎంతో సపోర్ట్‌ చేశారు. ఇప్పుడు కొన్ని థియేటర్లలో మా సినిమా రిలీజ్‌ అయింది. మరికొన్ని థియేటర్లలో కూడా రిలీజ్‌ అవుతుంది. మేయర్‌ రామ్మోహన్‌గారు, రాజేంద్రప్రసాద్‌గారు ఈ సమస్యను పరిష్కరించి చిన్న సినిమాలకు న్యాయం చేస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది. మా సినిమా విషయంలో మమ్మల్ని సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అన్నారు.

నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి మాట్లాడుతూ - ''మేము చేసిన నిరాహార దీక్ష వల్ల కొన్ని థియేటర్లు లభించాయి. ఇంకా థియేటర్లు పెరుగుతున్నాయి. ఇది మా 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' చిత్ర యూనిట్‌ సాధించిన విజయం కాదు. చిన్న సినిమా సాధించిన విజయంగా భావిస్తున్నాము. ఈ పోరాటం ఇక్కడితో ఆగిపోదు. చిన్న సినిమాలను బ్రతికించడానికి ఇకముందు కూడా పోరాటం చేస్తాం. మేం చేస్తున్న దీక్షకు ఎంతో మంది సినీ ప్రముఖులు సంఘీభావాన్ని ప్రకటించారు. ఎంతో మంది నిర్మాతలు దీక్షా శిబిరానికి వచ్చి మాకు మద్దతుగా నిలిచారు. ఈరోజు మేయర్‌ రామ్మోహన్‌గారు, 'మా' ప్రెసిడెంట్‌ రాజేంద్రప్రసాద్‌గారు వచ్చి ఇలాంటి సమస్య మున్ముందు రాకుండా వుండేందుకు కృషి చేస్తామని చెప్పడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది'' అన్నారు.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%