మూడవ రోజుకు చేరిన 'ఫ్రెండ్ రిక్వెస్ట్' టీమ్ నిరాహార దీక్ష
మోడరన్ సినిమా పతాకంపై హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో సోషల్ మీడియా బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించిన యూత్‌ఫుల్ హారర్ ఎంటర్‌టైనర్ 'ఫ్రెండ్ రిక్వెస్ట్'కి విడుదల విషయంలో జరిగిన అన్యాయానికి నిరసన తెలియజేస్తూ మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న చిత్ర యూనిట్‌కి పలువురు ప్రముఖులు సంఘీభావాన్ని తెలుపుతున్నారు.
మూడవ రోజైన ఆదివారం చిన్న చిత్రాల నిర్మాతలు, దర్శకులు, షార్ట్ ఫిల్మ్ మేకర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు.. ఇలా దాదాపు 200 మంది ఫిల్మ్ ఛాంబర్ ప్రాంగణంలోని దీక్షా శిబిరానికి విచ్చేసారు. చిన్న చిత్రాల విడుదల విషయంలో ప్రతి నిర్మాతా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని, థియేటర్ల విషయంలో మాఫియాలా వ్యవహరిస్తున్న కొంతమంది పెద్దలు తమ ధోరణిని మానుకోవాలని, ఇలాంటి దుస్థితి మరో నిర్మాతకు రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా ఫిల్మ్ ఛాంబర్ కృషి చేయాలని వారంతా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కోట్లు ఖర్చు పెట్టి సినిమాయే తమ ప్రాణంగా కష్టపడి ఒక మంచి సినిమా తీస్తే దాన్ని ప్రేక్షకుల వరకు చేర్చే అవకాశం లేకుండా చేస్తున్న ఈ సిస్టమ్ పూర్తిగా మారాలని, ప్రేక్షకుల వరకు సినిమా వెళ్ళనప్పుడు ఆ సినిమా ఫలితం ఏమిటి అనేది ఎలా తెస్తుందని దర్శకుడు ఆదిత్య ఓం తన ఆవేదనను వ్యక్తం చేశారు. శుక్రవారం రిలీజ్ అవ్వాల్సిన మా సినిమాకి థియేటర్లు లేవని గురువారం రాత్రి తెలిసిందని, ఆ సమయంలో ఈ విషయాన్ని ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్ళే అవకాశం లేదని, ఒక వేళ తీసుకెళ్ళినా తమకు ఎలాంటి న్యాయం జరగదని, అందుకే నిరాహార దీక్ష ఒక్కటే మార్గమని ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్మాత విజయ్‌వర్మ అన్నారు.
రిలీజ్ రోజు సిటీలో కేవలం ఒకే ఒక్క థియేటర్‌లో, అదీ రెండు షోలు మాత్రమే ఇచ్చారని తెలిసిన తర్వాత మా సినిమా కిల్ అయిపోయిందని అప్పుడే డిసైడ్ అయిపోయామని, ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఏ నిర్మాతకీ రాకూడదని ఈ పోరాటాన్ని చేస్తున్నామని విజయ్‌వర్మ తెలిపారు. కొంతమంది సినీ ప్రముఖుల జోక్యంతో సిటీలో నాలుగు థియేటర్లు మాత్రమే దొరికాయనీ, అది కూడా ఒక్కో థియేటర్‌లో మార్నింగ్ షో మాత్రమే ఇచ్చారని, దానివల్ల సినిమాకి ఎలాంటి ఉపయోగం జరగదని విజయ్‌వర్మ ఆవేదనను వ్యక్తం చేశారు. మూడు రోజులుగా తాము చేస్తున్న దీక్షకు అందరి మద్దతు లభించిందని, రోజురోజుకీ తమకు సంఘీభావం తెలిపేవారి సంఖ్య పెరుగుతోందని, తమకు మీడియా కూడా ఎంతో సపోర్ట్‌గా నిలుస్తోందని, తమను సపోర్ట్ చేస్తున్న వారందరికీ ఈ సందర్భంగా దర్శకుడు ఆదిత్య ఓం, నిర్మాత విజయ్‌వర్మ, యూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.