ఈ బర్త్‌డేకి అభిమానులకు నేను ఇచ్చే గిఫ్ట్ 'శ్రీశ్రీ'
-బర్త్‌డే వేడుకల్లో సూపర్‌స్టార్ కృష్ణ
పద్మభూషణ్, సూపర్‌స్టార్ కృష్ణ 74వ జన్మదినోత్సవ వేడుకలు మే 31న సాయంత్రం నాగారం విలేజ్‌లోని పద్మాలయా స్టూడియోలో అభిమానుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, దర్శకుడు ముప్పలనేని శివ, ప్రముఖ నిర్మాతలు జి. ఆదిశేషగిరిరావు, పద్మాలయ మల్లయ్య, ఆలిండియా సూపర్‌స్టార్ కృష్ణ మహేష్ సేన రాష్ట్ర అధ్యక్షుడు దిడ్డి రాంబాబు, ఆలిండియా కృష్ణ మహేష్ ప్రజాసేన అధ్యక్షుడు ఖాదర్ ఘోరి, రేపల్లె బ్రదర్స్ గుమ్మడి రవికృష్ణ, రామకృష్ణ, ఆర్.వి. రమణరాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా విజయనగరం నుండి వచ్చిన సీనియర్ అభిమాని డి. ఉస్సేన్ రచించిన 'స్వర్ణోత్సవ విజేయుడు' పుస్తకాన్ని సూపర్‌స్టార్ కృష్ణ ఆవిష్కరించి తొలి ప్రతిని శ్రీమతి విజయనిర్మలకు అందించారు. తర్వాత 'శ్రీశ్రీ' ఫొటో కార్డ్స్‌ను సూపర్‌స్టార్ కృష్ణ ఆవిష్కరించి అభిమానులకు అందజేశారు. అనంతరం అభిమానులు ఏర్పాటుచేసిన భారీ కేక్‌ని సూపర్‌స్టార్ కృష్ణ కట్‌చేశారు.
సీనియర్ అభిమాని డి. ఉస్సేన్ మాట్లాడుతూ - ''1968లో కృష్ణగారి ఫ్యాన్స్ అసోసియేషన్‌ని స్థాపించాను. అప్పటి నుంచి నేను, నా కుటుంబ సభ్యులు కృష్ణగారి అభిమానులుగా ఉన్నాం. జీవితంలో నా కోరిక ఒకటి ఉండేది. అది కృష్ణగారి నట జీవితం గురించి ఒక పుస్తక రూపంలో తేవాలని, అది 'స్వర్ణోత్సవ విజేయుడు'తో నెరవేరింది. ఇవాళ నా జన్మ ధన్యమైంది'' అన్నారు.
దర్శకుడు ముప్పలనేని శివ మాట్లాడుతూ - ''అందరిలాగే కృష్ణగారికి నేను మొట్ట మొదటి నుండి అభిమానిని. 'పండంటి కాపురం' చిత్రాన్ని చీరాల నాజ్ థియేటర్‌లో రిలీజ్ ఫస్ట్‌డే మార్నింగ్ షో చూసి కృష్ణగారికి డెడ్లీ ఫ్యాన్ అయ్యాను. ఆ చిత్రంలో కృష్ణగారు చాలా అందంగా కన్పించారు. చాలా మంచి చిత్రం అది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఆ చిత్రాన్ని బాగా ఆదరించారు. మ్యూజికల్‌గా, సెంటిమెంట్ పరంగా సినిమా అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. డైరెక్షన్ వాల్యూస్ ఉన్న చిత్రం అది. ఆ సినిమా చూసి కృష్ణగారి అభిమానిగా ఎట్రాక్ట్ అయ్యాను. ఆ తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాక కోదండరామిరెడ్డిగారి వద్ద దర్శకత్వ శాఖలో జాయిన్ అయి ఫస్ట్ సినిమానే సూపర్‌స్టార్ కృష్ణగారి 'కిరాయి కోటిగాడు' సినిమాకి వర్క్‌చేశాను. అక్కడి నుండి కృష్ణగారి సినిమాలకు కో డైరెక్టర్‌గా, అసోసియేట్‌గా పనిచేశాను. కృష్ణగారి అభిమానిగా ఆయనకు సరిపోయే ఒక సబ్జెక్ట్‌ని రెడీచేశాను. ఎన్‌విఎస్ క్రియేషన్స్ పతాకంపై అంకమ్మచౌదరి, అన్నారావు గారు 1994లో నిర్మించిన 'ఘరానా అల్లుడు'తో చిత్ర పరిశ్రమలో డైరెక్టర్‌గా ఎంటర్ అయ్యాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన కృష్ణగారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. కృష్ణగారు పరిచయం చేసిన దర్శకులందరూ మంచి పొజిషన్‌లో ఉండి ఉన్నతమైన చిత్రాలు ఎన్నో రూపొందించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆశీస్సులు కూడా చాలా పవిత్రంగా ఉంటాయి. ఆయన దయవల్ల ఇప్పటివరకు 20 చిత్రాలకు దర్శకత్వం వహించాను. అదృష్టవశాత్తు మంచి సినిమాలు తీయగలిగాను. మళ్లీ కృష్ణగారితో ఒక మంచి హిట్ పిక్చర్ తీయాలని 'శ్రీశ్రీ' సబ్జెక్ట్ అనుకుని కృష్ణగారిని కలిశాను. ఆయన కథ విని అద్భుతంగా ఉంది. డెఫినెట్‌గా మనం ఈ సినిమా చేద్దాం అని ఎంతో ప్రోత్సహించారు. ఆయన క్యారెక్టర్ పట్ల ఎంతో కేర్ తీసుకుని 74వ సంవత్సరంలో కూడా ఫుల్ స్క్రిప్ట్‌ని ఓన్ చేసుకుని క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్ అయి అద్భుతంగా నటించారు. అలాగే విజయనిర్మలగారు 50 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌బుక్‌లో స్ధానం సంపాదించారు. కృష్ణగారు విజయనిర్మల గారి కాంబినేషన్‌లో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. వాళ్ల కాంబినేషన్‌లో 'శ్రీశ్రీ' 50వ చిత్రం. వాళ్లిద్దర్నీ దర్శకత్వం వహించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అభిమానుల సమక్షంలో కృష్ణగారి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. 'శ్రీశ్రీ' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులకు నచ్చేవిధంగా ఉంటుంది. జూన్ 3న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఫస్ట్‌టైం ఈ చిత్రాన్ని విదేశాల్లో ఆన్‌లైన్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుంది. కృష్ణగారు సినిమా చూసి ఇది సంచలన విజయం అవుతుంది అని మనస్ఫూర్తిగా చెప్పారు. విజయనిర్మల గారు హిట్ కొట్టావ్ అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఇదే స్ఫూర్తితో ఇంకా ఎన్నో మంచి చిత్రాలు తీస్తాను. అలాగే మళ్లీ కృష్ణగారి దంపతులతో 'బాగ్‌బన్' అనే సినిమా తెలుగులో తీయాలి అనేది నా కోరిక. హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమా చేస్తాను. తొలి సినిమా స్కోప్, తొలి 70 ఎంఎం, తొలి కౌబాయ్, తొలి జేమ్స్‌బాండ్ చిత్రాలతో కృష్ణగారు తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించారు. ఏదైనా సాధించాను అంటే అది కృష్ణగారి వల్లే జరిగింది. తెలుగు సినిమాకి భారీతనాన్ని తెచ్చింది కూడా కృష్ణగారే. మల్టీస్టారర్ చిత్రాలను స్టార్ట్ చేసింది కూడా ఆయనే. కుల, మత, వర్గం తేడా లేకుండా అందరి హీరోలతో నటించి మంచి మనసున్న మనిషిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు కృష్ణగారు. ఈ 'శ్రీశ్రీ' సినిమా ఘన విజయం సాధించి కృష్ణగారికి ఆత్మసంతృప్తి కలగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ - ''కృష్ణ, మహేష్‌బాబు మా కుటుంబం అందరి అభిమానులకు ఈరోజు ఒక శుభ దినం. మేం ఊటీలో ఉన్నా, అడవిలో ఉన్నా, ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా అభిమానులు వస్తారు. మా అభిమానులు ఎంతో గొప్ప వాళ్లు అని మేమంతా గర్విస్తుంటాం. దీపావళికంటే కూడా కృష్ణగారి బర్త్‌డే పండుగ చాలా పెద్దది. కృష్ణగారి బర్త్‌డే కానుకగా 'శ్రీశ్రీ' చిత్రాన్ని మీ ముందుకు తీసుకు వస్తున్నాం. ముప్పలనేని శివ 'శ్రీశ్రీ' చిత్రాన్ని చాలా అద్భుతంగా తీశారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా చాలా గొప్పగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మాకు ఈ కథ నచ్చి ఈ సినిమా చేశాం. అందరికీ నచ్చే సినిమా ఇది'' అన్నారు.
సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ - ''నా పుట్టిన రోజు ఎక్కువగా ఊటీలో జరిగేది. రెండు మూడు సంవత్సరాలుగా పద్మాలయా స్టూడియోలో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో దూరం నుండి నన్ను అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. యాభై సంవత్సరాలుగా నా సినిమాలు చూసి నన్ను ఆదరించారు. అన్నిరకాల ఫార్మాట్స్‌లో వున్న సినిమాల్లో యాక్ట్ చేశాను. 'తేనెమనసులు' చిత్రంతో ఇంట్రడ్యూస్ అయ్యాను. ఫస్ట్ సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు, తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు, తొలి 70 ఎంఎం కూడా తెలుగు ప్రేక్షకులకు నేనే చూపించాను. 'శ్రీశ్రీ' సినిమాని విదేశాల్లో మొట్ట మొదటిసారిగా ఆన్‌లైన్‌లో రిలీజ్ అవుతున్నందుకు అది నా సినిమా కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ సినీ ప్రేక్షకులు అందరూ ఆదరించే సినిమా అవుతుంది. గత పది సంవత్సరాలుగా నా నుంచి అభిమానులు సంతోషించదగ్గ సినిమా ఏదీ రాలేదు. ఈ బర్త్‌డేకి నేను అభిమానులకు ఇచ్చే గిఫ్ట్ 'శ్రీశ్రీ'. డెఫినెట్‌గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అభిమానులందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. 'శ్రీశ్రీ' సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించ వలసిందిగా కోరుకుంటున్నాను'' అన్నారు.