ఒకప్పుడు నాగార్జున సినిమాలో అక్కినేని, బాలకృష్ణ సినిమాలో ఎన్టీఆర్, రాం చరణ్ సినిమాలో చిరంజీవి, నాగచైతన్య సినిమాలో నాగార్జున.. ఈ క్రమంలో ఇప్పుడు చేరుకుంటుంది ఆది సినిమాలో సాయి కుమార్. ఆది కరియర్ లో మొదటిసారి తండ్రి సాయి కుమార్ తో పాటు స్క్రీన్ పంచుకుంటున్న సినిమా చుట్టాలబ్బాయి.
SRT మూవీ హౌస్ బ్యానర్ పై రాం తాళ్ళూరి నిర్మిస్తున్న చుట్టాలబ్బాయి భారీ తారాగణంతో, పూర్తి కమర్షియల్ హంగులతో వినోద భరిత సినిమాగా తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో పడిన ‘చుట్టాలబ్బాయి’ లో ఆది గత సినిమాల కన్నా సరికొత్తగా అలరించనున్నాడు. ఆది సాఫ్ట్ క్యారెక్టర్స్ కే కాదు మంచి మాస్ క్యారెక్టర్స్ ని కూడా అవలీలగా పోషించగలడు అని నిరూపించుకున్నాడు.
సాయి కుమార్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఆది, సాయి కుమార్ కాంబినేషన్ లో మొదటి సినిమా కావడం వల్ల అభిమానుల్లో అంచనాలు తారా స్థాయిలో చేరుకున్నాయి. అహ నా పెళ్ళంట, పూల రంగడు, భాయ్ సినిమాల తరవాత పర్ఫెక్ట్ కథతో తెరకెక్కించాడు దర్శకుడు వీరభద్రం. డ్రాగన్ ప్రకాష్ ఫైట్స్ సినిమాకే హైలెట్. దాంతో పాటు తమన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశానికి ప్రాణం పోస్తాయి.
మళయాళ, తమిళ భాషల్లో 16 కు పైగా సినిమాల్లో నటించి గోల్డెన్ లెగ్ గా గుర్తింపు పొందిన నమిత ప్రమోద్ ఈ చుట్టాలబ్బాయి సినిమాతో మొట్ట మొదటిసారి తెలుగు తెరకు పరిచయం కానుంది. రఘుబాబు, పృథ్వీ, వంశీకృష్ణ, అభిమన్యు సింగ్,శకలక శంకర్, సుదర్శన్, భద్రం, గిరి, సురేఖా వాణి, మల్లికార్జున్, మాళవిక, అన్నపూర్ణ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన చుట్టాలబ్బాయి ఆడియోని జూన్ లో రిలీజ్ చేసి జూలై రెండో వారంలో సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.