చిత్రసీమకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలు
తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సినిమా, టీవీ సీరియల్స్ నిర్మాణం మరింత ముమ్మరంగా జరగాలని శ్రీ కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. అందుకోసం అందరినీ కలుపుకుని వెళుతూ, సినిమా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగం మంగళవారం ప్రభుత్వం రెండు జీవోలను విడుదల చేసింది. అందులో మొదటిది సింగిల్ విండో పథకం అమలుకు తీసుకోవాల్సిన విధివిధానాల రూపకల్పనకు సంబంధించింది. రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఛైర్మన్ గా హోమ్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ, టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ, ఐ అండ్ పీ.ఆర్. సెక్రటరీలు సభ్యులుగా ఓ కమిటీని వేసింది. నెలరోజులలోగా ఈ కమిటీ నివేదికను సమర్పించాలని ప్రభుత్వం కోరింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న సింగిల్ విండో పథకానికి ఈ కమిటీ ఏర్పాటుతో మార్గం సుగమం అయినట్టే.
ఇదిలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాలు అవతరించిన నేపథ్యంలో గత కొంత కాలంగా నంది అవార్డుల కార్యక్రమం జరగడం లేదు. ఆ అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం కొంగొత్తగా, మరింత జనరంజకంగా సినీ అవార్డులను ఇవ్వాలని ఆలోచిస్తోంది. అందుకోసం మంగళవారం మరో జీవోను జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వాలి, దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఎలా ఉండాలి అనేది ఈ కమిటీ నిర్ణయించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రమణాచారి ఈ కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు పి. రామ్మోహన్, కె. మురళీ మోహన్ రావుతో పాటు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, ఎం. శ్యాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు ఎన్. శంకర్, 'సంతోషం' సురేశ్ కొండేటి ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. శ్రీ నవీన్ మిట్టల్ ఈ కమిటీకి కన్వీనర్ గా వ్యవహరిస్తారు.